“వినరో భాగ్యము విష్ణు కథలు”:(42): - ఎం బిందుమాధవి

 “స్కంధ స్కంధ ధర్మో ధుర్యో వరదో వాయు వాహన:
వాసుదేవో బృహద్భాను రాది దేవ: పురందర:”
“బామ్మా ఇవాళ్ళ ఏం నేర్పుతావు” అంటూ బిల బిల్లాడుతూ పిల్లలు వచ్చేశారు.
“వర్షం వచ్చేట్టుంది, బయట దండెమ్ మీద బట్టలు ఉన్నాయి. తడిసిపోతాయి,తెచ్చి ఇంట్లో పడేయండి” అంది బామ్మ.
“వర్షం ఎలా వస్తుంది” అని అడిగింది బామ్మ.
“సూర్యుడు తన తీవ్రమైన కిరణాలతో నీటిని పీల్చుకుని వర్షంగా కురిపిస్తాడు అని చెప్పావు కదా,” అన్నాడు విష్ణు.
“అలా వర్షం కురవటానికి అవసరమైన వాయువులను యజ్ఞం ద్వారా ఏర్పడిన ధూమం, వాయు రూపంగా సూర్య మండలానికి చేరుస్తాయి. ఆ వాయువులను “ఆహవ వాయువులు” అంటారు. అవి ఏడు రకాలు. మన సనాతన ధర్మం, పురాణాల్లో చెప్పినట్టు ఆ వాయువులు కశ్యపుడికి..దితికి పుట్టిన సంతానం. కశ్యపుడు బ్రహ్మ సంతానమైన ప్రజాపతి. ఆయన దితి ద్వారా కొందరికి, అదితి ద్వారా కొందరికి జన్మలనిచ్చాడు. అదితికి పుట్టిన సంతానం వామనుడు, ఇంద్రుడు..మొదలైన దేవతలు అని ఇంతకు ముందు చెప్పుకున్నాము. కశ్యపుడికి దితి ద్వారా జన్మించిన వాళ్ళు దైత్యులు అనే ఒక రాక్షస వర్గం. అలా ఈ సప్త ఆహవ వాయువులు కూడా దితి సంతానం అన్నమాట.”
వాళ్ల పేర్లేంటి బామ్మా?” అన్నాడు వేణు.
“అదే చెప్పబోతున్నాను. (1) ఆహవ వాయువు..ఇది మేఘ మండలానికి భూమండలానికి మధ్యన ప్రసరిస్తుంది. (2) ప్రవహ వాయువు..ఇది సూర్య మండలానికి మేఘ మండలానికి మధ్యన ప్రసరిస్తుంది. (3) అనువహ వాయువు..ఇది చంద్ర మండలానికి సూర్య మండలానికి మధ్యన ప్రసరిస్తుంది. (4) సంవహ వాయువు..ఇది నక్షత్ర మండలానికి చంద్రమండలానికి మధ్యన ప్రసరిస్తుంది. (5) ఉద్వహ వాయువు..ఇది నక్షత్ర మండలానికి శుక్ర మండలానికి మధ్యన ఉంటుంది. (6) వివహ వాయువు..శుక్ర మండలానికి సప్తర్షి మండలానికిమధ్యన ఉంటుంది
(7) పరావహవాయువు..ఇది సప్తర్షి మండలానికి ధ్రువ మండలానికి మధ్యన ఉంటుంది. ఇలా పైకి లేచిన యజ్ఞ ధూమం ద్వారా ఏర్పడిన ఈ వాయువులలో కొన్ని వర్షం రావడానికి కారణం అవుతున్నాయి.”
“మళ్లీ మనం ఇంతకు ముందు చెప్పుకున్న విషయాలన్నింటినీ ఒక సారి గుర్తుకు తెచ్చుకుంటే..యజ్ఞంలో సమర్పించిన హవిస్సులని ఆయా దేవతలకి చేర్చే వాయు రూపం ఎవరు?” అంది బామ్మ.
“శ్రీమహావిష్ణువు” అన్నాడు ఠక్కున హరి.
“కాబట్టి అలా వాయువులని మోసుకెళ్లి ఆయామండలాల్లోకి చేర్చే శ్రీమహావిష్ణువుని “స్కంధ స్కంద ధర్మో ధుర్యో వరదో వాయు వాహన:” అంటారు. అంతే కాదు దేవతలకి శత్రువులైన రాక్షసుల పురాణాలని బద్దలు కొట్టేవాడు కూడా ఆ శ్రీమహావిష్ణువే. ఆయన పరమ శివుడు రూపంతో మేరు పర్వతాన్ని విల్లుగా చేసి, మహాసర్పమైన వాసుకిని అల్లె తాడుగా చేసి, శ్రీమన్నారాయణుడిని బాణంగా చేసి, సూర్య చంద్రులు రథ చక్రాలుగా ఉన్న రథాన్ని బ్రహ్మ గారు నడుపుతూ ఉండగా రుద్రుడిలా త్రిపురాసురుడిని సంహరించాడు. స్కంధుడు అంటే శివ పార్వతుల తనయుడైన కుమార స్వామి. కుమార స్వామి దేవతల సైన్యానికి నాయకుడు. దేవతలకి, రాక్షసులకి యుద్ధం వచ్చినప్పుడు కుమారస్వామి భీకర యుద్ధం చేసి దేవతల విజయానికి కారకుడు అయినాడు.”
“ఇప్పుడు మొత్తం క్లుప్తంగా చెప్పాలంటే..త్రిపురాసుర సంహారం చేసిన పరమ శివుడు, మేరు పర్వతం, నారాయణాస్త్రం..అన్నీ తానే అయిన శ్రీమహావిష్ణువు ఆహవ వాయువులని మోసుకెళ్లగలడు..లోక కళ్యాణం కొరకు శివుడికి కుమారుడిగా జన్మించగలడు. “వాసు దేవ: పురందర:” అంటే తాను సృష్టించిన జగత్తులో తానే చైతన్యంగా నివసిస్తూ..మొత్తం ఆవరించి..స్థితి, లయ కల్పిస్తూ లోకాలను కాపాడటం అనే బృహత్కార్యాన్ని సమర్థవంతంగా, ఎల్లప్పుడూ నిర్వహిస్తూ ఉంటాడు. సృష్టిలోని జీవులలో చైతన్యంగా నివసించే అతడు, సూర్య చంద్రులలో కాంతి రూపంగా ఉంటూ, జీవులని తన చైతన్యంగా నివసింప జేస్తూ ఉంటాడు.”
“అమ్మో బామ్మా ఇన్ని రకాల వాయువులా? అప్పుడేమో మనిషి శరీరంలో పది రకాల వాయువులు ఉంటాయి అని చెప్పావు. ఇప్పుడేమో ఏడు రకాల వాయువులు అని చెప్పావు” అన్నాడు సందేహంగా మొహం పెట్టి.
“అవును మరి! ఆ వాయువులు చేసే పని వేరు, ఈ వాయువులు చేసే పని వేరు అని మీకు చెప్పాను కదా! భగవంతుడు ఇన్ని రూపాలుగా, ఇన్ని భాగాలుగా, ఇన్ని ప్రదేశాల్లో, ఇంత శక్తి వంతంగా లేకపోతే ఈ సృష్టి నిర్వహణ ఎలా జరుగుతుంది? సరే వర్షంలో తడవకుండా వెళ్ళండి” అని చెప్పి పిల్లలని పంపించింది.

కామెంట్‌లు