“వినరో భాగ్యము విష్ణు కథలు”:(43): - ఎం బిందుమాధవి

 “అశోక స్తారణ స్తార: శూర: శౌరి:జనేశ్వర:
అనుకూల: శతావర్త: పద్మీ పద్మ నిభేక్షణ:”

“ఎవరూ ఏడ్చేది? కొట్టుకుంటున్నారా? లేక పడి దెబ్బలు తగిలించుకున్నారా” అంటూ వచ్చింది బామ్మ.
“వాసు ఇక్కడికి వచ్చేటప్పుడు రోడ్డు మీద పడ్డాడు. మోకాలి మీద దెబ్బ తగిలింది. నెత్తురువస్తున్నాయి. అందుకే ఏడుస్తున్నాడు” అన్నాడు విష్ణు.
“అబ్బబ్బా..ఏం పిల్లలర్రా! కాస్త చూసుకు నడవాలి కదా! ఇలారా..”అని పిలిచి కాలు నీళ్లతో కడిగి, పసుపు అద్దింది బామ్మ.
“ఇదిగో తాతగారు తిరుపతి లడ్డూ తెచ్చారు. అందరూ తినండి. తరువాత మంచి నీళ్ళు తాగి చాపలు పరుచుకోండి” అన్నది.
“ఇవ్వాళ దుఃఖం, శోకం లేని ఆ శ్రీమన్నారాయణుడు శ్లోకం చెప్పుకుందాం. ‘అశోక’ అంటే శోకం లేనివాడు. ఈ భూమి మీద పుట్టిన జీవులకి ‘షడ్వికారాలు’ ఉంటాయి అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! ‘షడ్వికారాలు’ అంటే ఏమిటో గుర్తున్నాయా? ఎవరు చెబుతారు” అని అడిగింది బామ్మ.
“నేను చెబుతా అని మంజుల శోకం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం..కదు బామ్మా” అన్నది.
“అవును సరిగ్గా చెప్పావు. ఆ శ్రీ మహావిష్ణువుకి ఈ వికారాలేవీ ఉండవు. ఎందుకంటే ఆయన ఒక తల్లి గర్భంలో ఉండి జన్మించటం అనేది లేదు కాబట్టి మరణం లేదు. కానీ అన్ని జీవులని ఆయనే పుట్టిస్తాడు. పుట్టిన జీవులన్నింటినీ రక్షించి ఉద్ధరిస్తాడు. కాబట్టి ఆయనని “తారణ: తార:” అంటారు.”
“ఆయన తన భక్తులని రక్షించడంలో శూరుడు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు తాటకి, ఖర దూషణులు, రావణ-కుంభకర్ణులు, మారీచ సుబాహులుని సంహరించిన శ్రీరామ చంద్రుడు..కంసుడు, శిశుపాలుడు, పూతన ఇత్యాది రాక్షసులని సంహరించిన శ్రీకృష్ణుడు..తమ శౌర్య ప్రతాపాలు ప్రదర్శించటం ద్వారానే ఆ పనులు చేసారు. అవునా? అండి చేత ఆయన జనులకి ఈశ్వరుడు అన్నమాట”.
“అనుకూల శతావర్త” అంటే..జీవులకు అనుకూలుడు, స్నేహితుడు. అంటే..అన్ని జీవులలో ఉండే చైతన్యం, ప్రాణ స్వరూపం ఆయనే కాబట్టి..తనకి తానే వ్యతిరేకుడిగా, ప్రతికూలుడిగా ఉండడు. ‘శతావర్త’ అంటే కొన్ని వందలు, వేలసార్లు తానే జీవులుగా పుడుతూ ఉంటాడు కాబట్టి..వందల ఆవృత్తాలు కలిగిన వాడు అని అర్థం!”
“పద్మీ పద్మ నిభేక్షణ:” అంటే భక్తుల పట్ల తను స్వయంగా పద్మం అంత సున్నితంగా ఉంటాడు. భక్తుల హృదయాకాశంలో ఎప్పుడూ పద్మం రూపంలో ఉంటాడు. అందుకే ఆయనని పుండరీకాక్షుడు అంటారు. ఆయన తన చేతిలో పదాన్ని ధరిస్తాడు. పద్మాల మధ్య భాగాన్ని ‘యోని’ అంటారు. ఆ యోనిలో అనేక బీజాలు నిక్షిప్తమై ఉంటాయి. జలప్రళయం వచ్చి మొత్తం సృష్టి నాశనమైనప్పుడు, మళ్లీ సృష్టి జరగటానికి కావలసిన బీజాలు అవే! పద్మం ఈ అన్ని కార్యాలకు ప్రతీక కనుకే ఆయన నాభిలో పద్మం ఉంటుంది. అందుకే ఆయనని “పద్మ నాభ” అని కూడా అంటారు. మళ్లీ మళ్లీ జీవుల పుట్టుక ద్వారా తనని తాను ప్రకటించుకుంటాడు కాబట్టి ఆయనని ‘శతావర్త’ అంటారు. ఆయన కన్నులు పద్మపు రేకుల లాగా ఉంటాయి.”
“ఇప్పుడు శ్లోకం మొత్తం ఒకసారి చెప్పుకుందాం..
“అశోక స్తారణ స్తార: శూర: శౌరి:జనేశ్వర:
అనుకూల: శతావర్త: పద్మీ పద్మ నిభేక్షణ:”
అని చెప్పి..”జాగ్రత్త రోడ్డు మీద చూసుకుంటూ నడవండి. రోడ్డు మీద ఆటలాడద్దు. దారిలో రాళ్లు ఉంటాయి. వాహనాలు వస్తాయి. దెబ్బలు తగిలించుకోకండి” అని చెప్పి పంపించింది.
కామెంట్‌లు