“వినరో భాగ్యము విష్ణు కథలు”:(44): - ఎం బిందుమాధవి

 "పద్మనాభో ఽరవీందాక్ష పద్మగర్భ శరీర భ్రత్
మహర్ధి: రుద్దో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ:”

“పిల్లలూ ముందుగా ఈ రోజు శ్లోకం చెప్పి అర్థం ఎవరు చెబుతారు” అని అడిగింది.
“బామ్మా నేను చెబుతాను” అన్నది మానస.
“ఆ శ్రీమన్నారాయణుడు.. పద్మ నాభుడు అంటే తన నాభిలో పద్మం కలిగి ఉంటాడు. అంటే పద్మం మధ్యభాగంలో ఉండే యోనిలో సృష్టికి కావలసిన బీజాలన్నీ ఉంటాయి. జీవుల జన్మలలో నాభికి ముఖ్య స్థానం ఉన్నది. ఎందుకంటే నాభి ద్వారానే తల్లి ద్వారా గర్భస్థ జీవికి కావలసిన ఆహారం అందుతుంది. ఆ జీవి భూమి మీదికి రాగానే నాభిని (umbilical card) వేరు చెయ్యటం ద్వారానే తల్లితో గర్భస్థ బంధం పూర్తి అవుతుంది.”
“అలాగే ఆ శ్రీమహావిష్ణువు నాభిలో ఉండే పద్మం ద్వారా ఈ సృష్టి మొత్తం బ్రహ్మగారి ద్వారా నిర్వహించబడుతుంది కనుక ఆ బ్రహ్మ గారు నాభీ కమలంలో ఉండటం అనేది ప్రతీకగా చెప్పబడుతుంది. “అరవిందాక్ష:” మాటే శ్రీమహావిష్ణువు నేత్రాలు కమలాల లాగా ఉంటాయి. ఆయనకి ఉండేది కేవలం రెండు నేత్రాలు కాదు..అనేక వేల నేత్రాలు ఉన్నాయి. కానీ ఆయన సత్య ధర్మాలు, వేదవేదాంగాలు, కర్మ జ్ఞానాలు, ధర్మం-అధర్మం, న్యాయం-అన్యాయం, విద్య-అవిద్య, సత్యం-అసత్యం, తాను-మాయ అనేవి తన రెండు నేత్రాలుగా కలిగి..జీవులకు తమ కర్మ ఫలాలను అందిస్తూ సృష్టి నిర్వహణ చేస్తాడు.”
“పద్మంలో ఉండే అనేక బీజాల ద్వారా అనేక శరీరాలని ధరిస్తాడు. ఆ శరీరాల ద్వారా అన్నపానాదుల ద్వారా ఆహారాన్ని స్వీకరించి..ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.. అనే ముఖ్యమైన ఐదు ప్రాణాల ద్వారా శరీర పోషణ చేస్తాడు.”
“ఆయన సృష్టి కంటే పురాతనమైన వాడు. ఆయనకి పుట్టుక, నాశనము అనేవి లేవు అని చెప్పావు కదా బామ్మా. కాబట్టి ఆయన వృద్ధుడు. మహా శక్తిమంతుడు. మహా బలవంతుడైన గరుత్మంతుడు ఆయన వాహనం. ఆ గరుత్మంతుడే ఆయన ధ్వజం మీద కూడా ఉంటాడు. ఆయన తానే స్వయంగా గరుత్మంతుడు అని భగవద్గీత లో చెప్పాడని ఇంతకు ముందు చెప్పావు బామ్మా” అన్నాడు విష్ణు.
“ఆ:( బావుంది. మీకు నేను చెప్పేది అర్థం అవటమే కాదు, బాగా గుర్తు పెట్టుకుంటున్నారు కూడా! ఈ రోజుకి చాలు. రేపు ఇంకా కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం”అని బామ్మ పిల్లలని పంపింది తన పనిలోకి వెళ్ళిపోయింది.
కామెంట్‌లు