“వినరో భాగ్యము విష్ణు కథలు”:(46): - ఎం బిందుమాధవి

 “ఉద్భవ: క్షోభణో దేవ: శ్రీ గర్భ: పరమేశ్వర:
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహ:”

“బామ్మా తమ్ము నిన్నటి నించీ బాగా ఏడుస్తున్నాడు. అమ్మ ఎత్తుకున్నా ఊరుకోవట్లేదు. వాడికి మోషన్స్ అవుతున్నాయి. అమ్మ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళింది” అని చిట్టి ఏడుపు మొహంతో చెప్పింది.
“తమ్ముకి ఇప్పుడు ఎన్నో నెల నడుస్తున్నది” అని అడిగింది బామ్మ.
“ఇప్పుడు ఆరో నెలట బామ్మా” అన్నది చిట్టి వాళ్ళ పక్కింట్లో ఉండే మహతి.
“అది సంగతి. ఇప్పుడు వాడికి పళ్లు వస్తూ ఉంటాయి. అందుకే వాడికి మోషన్స్ కూడా అవుతున్నాయి. అలా ఆపకుండా నసగా ఏడుస్తూ ఉండటం, మోషన్స్ అవటం అనేవి పళ్లు వస్తున్నాయి అనేదానికి గుర్తు. పళ్లు చిగురు చీల్చుకుని వస్తాయి. అందుకే వాడికి నొప్పి. చెప్పటం చేతకాక ఏడుస్తూ ఉండి ఉంటాడు. మొన్న మనం పెరట్లో విత్తనాలు వేశాం గుర్తు ఉందా? అప్పుడు ఏమైంది? గింజ నేల చీల్చుకుని మొలకగా బయటికి వచ్చింది. అలా చీల్చుకుని వచ్చేటప్పుడు ఏమవుతుందో మీరు దగ్గరగా చూశారా! నేల ఆ చుట్టు పక్కల భాగం పగిలినట్టు అవుతుంది. నేల గొంతెత్తి అరవదు. మనిషి అయితే ఏడుస్తాడు. అంతే తేడా! అంటే ఏదైనా కొత్తగా పుట్టేటప్పుడు కొంత బాధ, క్షోభ జరుగుతుంది.” అని బామ్మ చెప్పగానే..
“అవును..అమ్మకి తమ్ము పుట్టేటప్పుడు అమ్మ కూడా గట్టిగా కేకలు పెట్టి అరిచింది. కొంచెం సేపు అయ్యాక బుజ్జి తమ్ముని నాన్న బయటికి తీసుకొచ్చారు. ఓహో అదా సంగతి! ఇప్పుడు తెలిసింది”అన్నది చిట్టి తనకి బాగా అర్థం అయినట్టు.
“ఆ శ్రీమన్నారాయణుడు..మొక్క మొలిచే నేల తనే, మొలకగా మారే గింజ తనే, ఆ గింజ మొలకెత్తటానికి కావలసిన నీరు తనే, ఎండ తనే, గాలీ తనే..ఇలా అన్నీ తానే అయి ఉండే చైతన్యం కాబట్టి ‘ఉద్భవ: క్షోభణో దేవ:’ అంటాము. అందరికంటే అధికుడు, ఉన్నతుడు..తనని కొలిచి పూజించే యోగులు, తపస్వుల కంటే గొప్పవాడు. కాబట్టే అందరూ ఆయన కోసం, ఆయనని పొందటం కోసం తపస్సు చేస్తారు.”
“శ్రీ గర్భ పరమేశ్వర:” అంటే ఒక జీవి గర్భంలో ఉండేటప్పుడు పిండ రూపంలో ఉంటాడు. భూమి మీదికి వచ్చి జన్మ తీసుకునేటప్పుడు పూర్తిగా తయారైన శరీరం తీసుకుంటాడు. అంటే రూపాంతరాలు చెందుతాడు. అంతే కాదు అన్ని సంపదలని తన గర్భంలో దాచుకుంటాడు. ఒక జీవ సృష్టికి, ఆ జీవి సంపూర్ణంగా ఎదగటానికి అవసరమైన సర్వ శక్తులని తన గర్భంలో ధరిస్తాడు. అందుకే ఆయన ఈశ్వరులకే ఈశ్వరుడు. మహేశ్వరుడు.
“కరణం కారణం కర్తా గహనో గుహ:” అంటే..ఇందాక చెప్పినట్టు, కుండ తయారు చెయ్యటానికి అవసరమైన మట్టీ తనే, తయారైన కుండా తనే, కుండ తయారు చెయ్యటానికి ఉపయోగించే సాధనమూ తనే, కుండ తయారు చేసే వ్యక్తి తనే, ఆ కుండలో వేసే పదార్థము తనే!” అని బామ్మ చెప్పగానే..
“ఆయ్ భలే తమాషాగా ఉంది కదా! మనం అవన్నీ వేరు వేరు అనుకుంటాం. కానీ “విశ్వం విష్ణు” అని చెప్పినట్టు అన్నీ తానే అయి, అన్నిటిలోనూ తనే చైతన్యంగా వ్యాపించేటప్పుడు, మన కంటితో చూసేది ఏది మనం సృష్టించింది కాదు. పాత శ్లోకాలే అయినా ఇవ్వాళ కొత్తగా బాగుంది బామ్మల” అని చెప్పి పిల్లలు కొత్తగా మొక్కలపైన వచ్చాయా, వస్తే ఇందాక బామ్మ చెప్పినట్టు చుట్టూ నేల పగిలి ఉన్నదా లేదా అని చూడటానికి పెరట్లోకి పరుగెత్తారు.

కామెంట్‌లు