“వినరో భాగ్యము విష్ణు కథలు”:(48): - ఎం బిందుమాధవి

 “రామో విరామో విరజో (విరతో) మార్గో నేయో నయ:
వీర: శక్తి మతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమ:”
వైకుంఠ: పురుష: ప్రాణ: ప్రాణద: ప్రణవ: పృధు:
హిరణ్య గర్భ: శత్రుఘ్నో వ్యాప్తో వాయురధో క్షజ:”

“బామ్మా మాకు ఇప్పుడు వారం రోజులు సెలవలు. ఆ తరువాత మా టీచర్ మా చేత “సీతా కళ్యాణం” నాటకం వేయిస్తామని చెప్పారు” అన్నాడు ఉత్సాహంగా హరి.
“అబ్బో..మీ టీచర్ మీకు రామాయణాన్ని ప్రత్యక్షంగా చేయించి చూపిస్తున్నారన్నమాట. సరే..ఇంతకీ రాముడు వేషం ఎవరు వేస్తున్నారు” అని అడిగింది బామ్మ.
“రాముడి వేషం నేనే వేస్తున్నాను బామ్మా. నా ఎత్తు, రూపు రేఖలు, నవ్వు మొహం..రాముడి వేషానికి బాగా సరిపోతాయని టీచరు చెప్పారు” అన్నాడు హరి.
“అవును రాముడిని ‘పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం’ అంటారు. అంటే..రాముడిది పురుషులని కూడా ఆకర్షింపచేసే మోహన మైన రూపం అని వాల్మీకి మహర్షి వర్ణించారు. రాముడు, వన వాసానికి వెళ్ళేటప్పుడు అయోధ్యలోని మనుషులే కాకుండా, జంతువులు, పక్షులు, పశువులు, చెట్లు, నదులు కూడా ఆయనని వదిలి ఉండలేక బాధ పడ్డాయట. ఈ దివ్య సుందర విగ్రహుడిని, ఈ నిర్మల హృదయుడిని వదిలి ఉండలేము.. మళ్లీ ఎప్పుడు చూస్తామో అని ఏడ్చాయిట. అంటే ఆయనని చూసి మనుషుల హృదయాలు ఆనందంతో రమించేవిట. అందుకే.. దశరథ తనయుడైన పుత్రుడికి వశిష్ఠ మహర్షి ‘రాముడు’ అనే పేరు పెడితే..ఆయన తన పేరుని సార్ధకం చేసుకున్నాడని దండకారణ్యంలో ఋషులు, మునులు, చెట్టు చేమలు అనుకునేవిట” అని బామ్మ కళ్ళు మూసుకుని రాముడిని తను స్వయంగా చూస్తున్నంత ఆనందంతో చెప్పింది.
“అలా భక్తులని, ధర్మ వేత్తలని రమింపజేసే శ్రీరాముడు..రాక్షసుల, దుష్టుల చేష్టలని నియంత్రించి వారిని శిక్షింప జేసే వీర రౌద్ర రూపం. ప్రళయకాలంలో జీవులన్నిటినీ తనలో కలిపేసుకుని వారికి విశ్రాంతిని కలిగించేవాడు. అదే ‘రామో విరామో’ అంటే అర్థం. ఆ శ్రీమన్నారాయణుడు తనకి తాను స్వయంగా అనుభవించే సంపదలు, భోగాలు అంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే ఆయనే మనకి కావలసిన భౌతిక భోగాలన్నీ సమకూర్చే ఆది దేవుడు కదా!”
“ఆయన జీవులకి ఎలా బతకాలో, ఎలా బతకకూడదో చెప్పే మార్గనిర్దేశం చేసే పరమాత్మ అన్నమాట. ఉదాహరణకి మీకు మీ టీచర్ ఎలా చదువుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఇతరుల పట్ల ఎలా దయతో మెలగాలో నేర్పించే ఒక మార్గదర్శకుడన్నమాట. అలా లోకంలోని జీవులన్నిటికీ తమ జీవన పరమావధి ఏమిటో తెలియజేసే చైతన్యం ఆ శ్రీమహావిష్ణువు. ఆ దారిలో వారిని నడిపించి చివరికి వారికి మోక్షం ఇవ్వగలిగిన సమర్ధుడు ఆయనే. ఆయనకి తను స్వయంగా మోక్షము పొందటం అనే మాట ఉండదు. ఎందుకో చెప్పండి” అన్నది బామ్మ.
“ఎందుకంటే ఆయనకి జన్మ, మరణం అనే భౌతిక విషయాలు ఉండవు కదా. ఆయనకి ఒక రూపము, ప్రమాణము అనేవి ఉండవు కదా! అన్నిటా, అన్ని చోట్లా, అన్ని రూపాలలో, అన్ని ప్రమాణాలలో వ్యాపించి ఉండే ప్రాణ శక్తి ఆయన. అందుకే ఆయనకి మోక్షం అనేది ఉండదు కదు బామ్మా” అన్నాడు విష్ణు.
“అవును..సరిగ్గా చెప్పావు” అన్నది బామ్మ. “వీర: శక్తి మతాం శ్రేష్ఠో” అంటే ఆయన శ్రేష్ఠమైన, శక్తిమంతమైన వీరుడు. అత్యంత వీరులుగా భావించబడే రావణ కుంభకర్ణుల కంటే, కంసుడు, హిరణ్యాక్ష హిరణ్య కశిపుల కంటే కూడా శక్తిమంతమైన వీరుడు కాబట్టే ఆయన వారిని వధించగలిగాడు. ‘ధర్మో ధర్మ విదుత్తమ:’ అంటే అన్ని జీవులని తనలో ధరించేవాడు ఆయనే! అన్ని జీవులచేత ప్రాణ శక్తి రూపంతో ధరింపబడేవాడు ఆయనే! వేదాలలో చెప్పబడిన ఉత్తమమైన ధర్మాలని అందరికీ బోధించేవాడు ఆయనే కాబట్టి ఆయనని “విదుత్తమ” అంటారు.”
“వైకుంఠ:”అంటే భూతాలని (పంచ భూతాలైన జలము, వాయువు, అగ్ని, ఆకాశము, పృథివి) వాటి మార్గాలకి ఆటంకం కలిగించి, అన్నిటినీ ఒక దానితో ఒకటి కలిపి ఉంచుతాడు. అంటే జలప్రళయ సమయంలో భూమిని జలంలో, వాయువుని ఆకాశంలో, వాయువుని అగ్నితో కలిపి వాటి సహజ మార్గాలని, పయనాన్ని ఆపుతాడు. తరువాత సృష్టిని ప్రారంభించేటప్పుడు..అవి ఒక దాని నించి ఇంకొకటి విడివడి జీవుల సృష్టికి కారణం అవుతున్నాయి.”
“అలా సృష్టించబడిన జీవులలో ముందుగా తనే ప్రాణ శక్తిగా శయనించేవాడు కాబట్టి ఆయనని “పురుష:” అంటారు. అలా జీవులలో ఉండి వాటిని నడుపుతాడు. అవి పెరిగి, మార్పు చెందటానికి కారణం అవుతాడు. కానీ ఆ జీవులన్నిటి కంటే ‘పూర్వం’ నించి ఉన్నవాడు కాబట్టే ఆయనని ‘పురుష:’ అనచ్చు. అలా ప్రాణుల మనుగడకి ఎలా కారణమవుతున్నాడో, అలా సృష్టి అంతంలో ప్రాణులు నశించటానికి కూడా కారణమవుతున్నాడు. అందుకే ఆయనని ‘ప్రాణద’ అని కూడా అంటారు.”
“అలా ఇన్ని రకాల పనులు ఇంకా సమర్థవంతంగా నిర్వహిస్తాడు కాబట్టే వేదాలు, శ్రుతులు ఆయనకి ప్రణామం చేస్తాయన్నమాట. అర్థం అయిందా? పిల్లలూ..ఇప్పుడు సెలవులయ్యాక మన హరి రాముడి వేషం వేస్తున్నాడన్నమాట. హరీ ..నువ్వు రాములవారి ఫోటోలు రోజు చూస్తూ ఆయన ఎలా నిలబడతాడో, అందరి వంక ఎలా చిరునవ్వుతో చూస్తాడో, కోదండం ఎలా పట్టుకుంటాడో చూసి బాగా ప్రాక్టీస్ చెయ్యి” అని బామ్మ పిల్లందరినీ ఆశీర్వదించి పంపింది.
కామెంట్‌లు