“వినరో భాగ్యము విష్ణు కథలు”:(49):- ఎం బిందుమాధవి

 “వైకుంఠ: పురుష: ప్రాణ: ప్రాణద: ప్రణవ: పృధు:
హిరణ్య గర్భ: శత్రుఘ్నో వ్యాప్తో వాయురధో క్షజ:
రుతు సుదర్శన కాల: పరమేష్ఠి పరిగ్రహ:
ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వ దక్షిణ:”

“నిన్న ‘వైకుంఠ: పురుష:……’ అనే నామాలకి అర్థం చెప్పుకున్నాము కదా! ఈ రోజు హిరణ్య గర్భ:….’ అనే నామాలకి అర్థం చెప్పుకుందాం” అంది బామ్మ.
“సరే బామ్మా” అని పిల్లలందరూ బుద్ధిగా చాప మీద చేరారు.
“హిరణ్య గర్భ:” అంటే బంగారు గర్భము లేదా బంగారు అండము కలిగి ఉన్న వాడు అని అర్థం. ఈ విశేషణాన్ని శ్రీమహావిష్ణువుకి, బ్రహ్మ దేవుడికీ కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ముందుగా శ్రీమహా విష్ణువు నాభి కమలం నించి బ్రహ్మ దేవుడు పుట్టాడు. ఆ బ్రహ్మ దేవుడు మిగిలిన సృష్టి అంతా ప్రజాపతుల ద్వారా చేస్తాడు కాబట్టి ఆయనని కూడా హిరణ్య గర్భుడు అంటారు.”
“అలా హిరణ్యగర్భుడిగా పిలవబడే శ్రీమన్నారాయణుడు, శత్రు భయంకరుడు. అసురులని శిక్షించటంలో ఉగ్రుడిగా ఉంటాడు. తన చైతన్యంతో, శక్తి సామర్థ్యాలతో ఎదురులేకుండా, అడ్డు అదుపులేక వ్యాపించి ఉంటాడు. అంతేకాదు ఆయన వాయువు గాను, భూమిగానూ కూడా తన సువాసనతో వ్యాపించి ఉంటాడు” అని బామ్మ చెప్పగానే..”భూమికి వాసన ఉంటుందా అన్నారు” పిల్లలందరూ ముక్త కంఠంతో.
“భలే వాళ్ళే..భూమికి వాసన లేకపోతే..వర్షం పడగానే..ఆహా మట్టివాసన” అని ఎందుకంటాము. మట్టిలో నల్ల రేగడి అని, ఇసుక నేల అని, ఎర్ర మట్టి అని, పాటి మట్టి, సున్నపు నేల అని..ఇన్ని రకాలు ఉంటాయి తెలుసా? అవి అన్నీ ఒక్కొక్కటి, ఒక్కొక్క వాసనతో ఉంటాయి. ఇంకొక విషయం తెలుసా మీకు..మాములుగా మనం పూజ చేసేటప్పుడు..షోడశోపచార పూజ అని చేస్తాము. అవన్నీ ఇప్పుడే తెలియకపోయినా..పంచభూతాలకి ఉండే తన్మాత్రల ద్వారా ముఖ్యంగా ఐదు రకాలుగా చేస్తాము. అవి ‘పృథ్వీ’ తత్వం అని ‘గంధం’ సమర్పిస్తారు. ‘ఆకాశ’ తత్వం అని ‘పువ్వులు’, వాయు ‘తత్వం’ అని ‘ధూమం’ సమర్పిస్తారు. ‘అగ్ని’ తత్వం అని ‘దీపం’ వెలిగిస్తాము. దప్పికకు ‘నీరు’ ఇచ్చి, ఆకలికి ‘అన్నం’ నైవేద్యంగా పెడతాము. అంటే..మనకి ఉండే అన్ని ముఖ్య అవసరాలని దేవుడికి కూడా పూజ ద్వారా తీరుస్తామన్నమాట.”
“ఆ శ్రీమన్నారాయణుడు కాల రూపుడు అని ఇంతకు ముందు చెప్పుకున్నాము కదా! ఒక సంవత్సర కాలంలో ఆరు ఋతువులు వస్తాయి. అవి వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్, హేమంతం, శిశిరం. ఒక్కొక్క ఋతువు లో రెండు మాసాలు ఉంటాయి. చైత్ర, వైశాఖ మాసాలు..వసంత ఋతువు, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు..గ్రీష్మ ఋతువు, శ్రావణ, భాద్రపద మాసాలు..వర్ష ఋతువు, ఆశ్వయుజ, కార్తీక మాసాలు..శరదృతువు, మార్గశిర, పుష్య మాసాలు హేమంత ఋతువు, మాఘ, ఫాల్గుణ మాసాలు శిశిర ఋతువు అన్నమాట. మొత్తం ఆరు ఋతువులు, పన్నెండు నెలలు కలిపి ఒక సంవత్సరం.”
“ప్రతి ఋతువులోనూ ప్రకృతి కొత్త కొత్త అందాలతో ఎంతో శోభాయమానంగా ఉంటుంది. చైత్ర, వైశాఖ మాసాల్లో మామిడి, వేప, మల్లె చెట్లు చిగురించి వాతావరణం అంతా సువాసనతో నిండిపోతుంది. జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో వడగాడ్పులతో లోకం మండిపోతూ ఉంటుంది. అప్పుడు సూర్యుడు తన తీవ్రమైన కిరణాలతో నీటిని పీల్చుకుని తరువాత రాబోయే వర్షాకాలానికి సిద్ధం అవుతాడు. శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షం కురిసి పరిసరాలన్నీ మట్టి వాసనతో అప్పటివరకు అనుభవించిన వేడి నించి ఉపశమనం కలుగుతుంది. నేలంతా పచ్చని తివాచీ పరిచినట్టు మొలకలతో, పంటలతో కళకళలాడుతుంది. శరదృతువు లో ఆకాశం నిర్మలంగా ఉండి, వెన్నెలతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. హేమంత ఋతువు అటు ఎండ ఉండదు, ఇటు ఎక్కువ చలి లేకుండా హాయిగా ఉంటుంది. శిశిర ఋతువు కొంత చలి, కొంత నులి వెచ్చదనంతో హాయిని కలిగిస్తుంది.”
“ఇలా కాల రూపంలో ఉండే ఆ శ్రీమన్నారాయణుడు సమృద్ధిగా కంటికి ప్రకృతి అందాలతో, మనసుకి వాతావరణ పరంగా ఆహ్లాదంగా..రక రకాల పండ్లు పువ్వులతో, సుగంధంతో మన నాసికకి సంతోషాన్ని కలిగిస్తాడు కాబట్టి ఆయనని ‘ఋతు సుదర్శన కాల: పరమేష్ఠి పరిగ్రహ:’ అంటాము.
“ఆ శ్రీమన్నారాయణుడు సూర్యుడికి, అగ్నికి కూడా భయం కలిగించగల ఉగ్ర రూపం కలవాడు. సంవత్సరంలో వచ్చే గ్రీష్మ ఋతువు ద్వారా ఆ దేవ దేవుడు ఉగ్రంగా ఉంటాడు. అలా ఉగ్రంగా ఉండటం కూడా జీవులన్నిటి ఎడల ఆయనకి ఉన్న అనుగ్రహం, కరుణ మాత్రమే! అలా తీవ్రమైన కిరణాలతో నదుల్లో నీటిని పీల్చుకోకపోతే వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయి? అందుకే ఆ ఉగ్రత్వం కూడా కరుణతో మాత్రమే! అంతే కాదు..జలప్రళయం ద్వారా సృష్టిని అంతం చేసి జీవులకు విశ్రాంతి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా జీవులపట్ల ఉగ్రత్వం అతి సమర్ధతతో ప్రదర్శిస్తాడు. కాబట్టి సృష్టి, స్థితి, లయ..అన్నీ అతి సమర్ధతతో నిర్వహించే కరుణా సముద్రుడు ఆయన. అర్థం అయిందా” అని బామ్మ ఆ రోజుకి ముగించింది.

కామెంట్‌లు