“వినరో భాగ్యము విష్ణు కథలు”:(50): - ఎం బిందుమాధవి

 ఇప్పటికీ షుమారు 420 నామాలతో కథలు పూర్తి అయ్యాయి. అందరికీ నచ్చాయి అనే భావిస్తున్నాను. ఇది 50th కథ. ఇంతవరకు ఒక పుస్తకం వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో ఆ ప్రయత్నం ప్రారంభించాను. ఆ కార్యంలో ఎంతవరకు విజయం సాధించగలనో ఆ భగవంతుడే నిర్ణయించాలి.
“విస్తార: స్థావర స్థాణు: ప్రమాణం బీజమవ్యయం
అర్థో ఽ నర్ధో మహాకోశో మహాభోగో మహాధన:”
“బామ్మా నిన్న ఊరినించి మా బాబాయ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు తిరుపతి కొండకి వెళ్లి దైవ దర్శనం చేసుకుని వచ్చారట. మాకు ప్రసాదం ఇచ్చారు” అన్నది మానస.
“బాబాయ్ వాళ్ళు కొండ నడిచి ఎక్కారుట. బామ్మా నువ్వు ఎప్పుడైనా కొండ నడిచి ఎక్కావా? అమ్మో చాలా కష్టమట. మా పిన్ని చెప్పింది. అయినా కానీ చాలా బాగుంటుందిట. వాళ్ల అబ్బాయి బంటి చెప్పాడు” అన్నది మానస.
“నేను మీ అంత ఉన్నప్పుడు రెండు-మూడు సార్లు ఎక్కాను. చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లు..చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మధ్యలో జింకల పార్కు ఉన్నది” అని..”అవి ఏడు కొండలు. అందుకే ఆ కొండలను సప్తగిరులు అంటారు. చుట్టూ ఉండేది మొత్తం అడవి. అందులో అనేక జంతువులు, పక్షులు, సెలయేళ్లు ఉంటాయి” అని బామ్మ చెబుతూ ఉండగానే..
“బామ్మా ఆ కొండలు, చెట్లు, భూమి, జంతువులు, పక్షులు అన్నీ శ్రీమహా విష్ణువే కదా! ఇంతకు ముందు నువ్వే చెప్పావు కదా” అన్నాడు వాసు.
“అవును..కదలకుండా ఉండే వాటిని స్థావరాలు అనీ, కదిలేవాటిని జంగమాలని అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే..స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి అంత విష్ణు స్వరూపమే! కదలకుండా ఉండే స్థావర రూపమైన కొండలు, భూమి, చెట్లు మరియు కదిలే జంగమ రూపాలైన నదులు, జంతువులు, మనుషులు, పక్షులు, వాయువు, అగ్ని..వీటన్నిటిలో కూడా వ్యాపించి ఉండేది ఆ శ్రీమహా విష్ణువే! అదే “విస్తార స్థావర స్థాణు:” అంటే!”
“కాబట్టే ఆయన ఏ ప్రమాణాలకి అందడు. ఏ కొలతలతోనూ, ఏ రూపాలతోనూ పోల్చి చెప్పలేము. మూడు చిన్న బీజం లాగా ఉండి, మొలకెత్తాక విస్తరించుకునే మర్రి వృక్షాన్ని గురించి చెప్పాలంటే..చిన్న బీజం అని చెబుతామా? పెద్ద వృక్షం అని చెబుతామా? అలాగే ఆ దేవ దేవుడు ఎంత ఎదగగలడో బీజాన్ని చూసి వ్యక్త పరచలేని మహా స్వరూపం అన్నమాట.”
“మన శరీరంలో ఐదు కోశాలు ఉంటాయి. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. అందులో ముఖ్యమైనవి అన్నమయ్య కోశము, ప్రాణమయ కోశము. ‘అన్నమయ కోశం’ అంటే మనం తినే ‘అన్నం’ అంటే ఆహారంతో నిర్మించబడి, పోషించబడేది. ‘ప్రాణమయ కోశం’ అంటే..ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ప్రాణ శక్తితో ఉండేది. మొత్తం ప్రాణాలు పది. అందులో ముఖ్య ప్రాణాలు ఐదు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా!”
“అన్నం భౌతిక పదార్థమైతే..ప్రాణం ఆ దేవ దేవుడి చైతన్యం అన్నమాట. అలా అన్నంతోనూ, ప్రాణ శక్తితోనూ మన శరీరం నిలబడి పోషించబడుతున్నది అంటే ఆ దేవ దేవుడి అపారమైన కరుణే కారణం. కానీ ఆయన ఆ కోశాలు మాత్రమే కాదు. వాటన్నిటి కంటే భిన్నమైన వాడు. వాటికంటే అధికుడు. ఆనందమయ రూపుడు. మన శరీరంలోని ఆనందమయ కోశంలో ఉండేది కూడా ఆయన చైతన్యమే కదా! కానీ ప్రాణం లాగే ఆనందం కూడా భౌతికంగా చెప్పలేని ఒక భావన. అందరూ తమకి ఆనందం కావాలని కోరుకుంటారే కానీ, అది భౌతికంగా దొరికేది కాదు. కాబట్టి ఎప్పుడు ఆయన స్మరణ, ధ్యానం చేసే వారికి కలిగే ఒక అలౌకిక భావన ఆనందం. అలాంటి ఆనందాన్ని ఆయన మనకి కలిగిస్తాడు కానీ ఆయన ఇవన్నీ కోరుకోడు. ఆయన వీటన్నిటికీ అతీతుడు. కాబట్టి ఆయన ‘ఆనందం’ అనే భావాన్ని సదా అనుభవించే మహా భోగి, మహాధన సంపన్నుడు. ఆయనని ధ్యానించే వారికి కూడా ఆ ధనాన్ని అందించే కారుణ్యమూర్తి” అని చెప్పి ఆ రోజు శ్లోకాలు ముగించింది బామ్మ.

కామెంట్‌లు