“అనిర్విణ్ణ స్థవిష్టోఽ భూధ్ధర్మ యూపో మహామఖ:
నక్షత్ర నేమి ర్ణక్షత్రీ క్షమ: క్షామ: సమీహన:”
“బామ్మా..శ్రవణ్ ఈ రోజు ‘శ్లోక’ క్లాసుకి రానన్నాడు. వాళ్ళింట్లో ఏడుస్తూ కూర్చున్నాడు” అని పరుగెత్తుకొచ్చి రొప్పుతూ చెప్పాడు హరి.
“వాడికి ఏమైంది. క్లాసుకి ఎందుకు రానంటున్నాడు. ఎక్కడైనా పడ్డాడా? వాళ్ళ అమ్మ కోప్పడిందా” అని అడిగింది బామ్మ.
“అవేవీ కాదు. ఈ యాన్యుయల్ పరీక్షల్లో వాడు చాలా కష్టపడి చదివి రాసినా కూడా వాడికి అనుకున్నన్ని మార్కులు రాలేదుట. అందుకే ఏడుస్తున్నాడు” అని గోపాల్ చెప్పాడు.
“బామ్మ వాడికొక తాయిలం ఇస్తుంది రమ్మని చెప్పి తీసుకురండి” అని చెప్పి పంపి..అందరూ వచ్చాక శ్లోకం చెప్పటం ప్రారంభించింది.
“ఎవ్వరికైనా నిర్వేదం అసలు మంచిది కాదు. దానివల్ల ముందు ముందు మనం సాధించబోయే వాటిమీద ఆ ప్రభావం పడుతుంది. శ్రవణ్ నేను ఏం చెబుతున్నానో తెలుస్తున్నదా? రామాయణంలోని సుందరకాండలో ఆంజనేయ స్వామి సీతా దేవి కోసం వెతుకుతూ లంకకి వెళ్ళాడు కదా! అక్కడ ఎంత సేపు వెతికినా ఆమె కనిపించకపోయే సరికి, అంతటి సమర్థుడైన హనుమకి కూడా నీరసం, నిస్సత్తువ, నిర్వేదం కలిగాయి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ మళ్లీ తనని తానే సంబాళించుకుని..ఆత్మహత్య చేసుకుంటే నేను అనుకున్నది సాధించే అవకాశం శాశ్వతంగా చెయ్యిజారిపోతుంది. కాబట్టి, నేను ఈ లంకలోనే ఉండి తపస్సు చేసుకుంటాను. లేదా మళ్లీ మళ్లీ వెతుకుతాను అనుకున్నాడుట. అలా వుండాలే కానీ ఏడుస్తూ కూర్చుంటే ఎప్పటికీ ఏమీ సాధించలేం. తెలిసిందా?”
“అలా ఈ రోజు శ్లోకంలో ‘అనిర్విణ్ణ స్థవిష్ఠ భూద్ధర్మ యూపో మహామఖ:’ అంటే..ఆ శ్రీమహావిష్ణువు తాను సృష్టించిన ఈ జీవులు సవ్యంగా ప్రవర్తించకపోయినా, అధర్మ పరులైనా ఏ మాత్రం విసుగు చెందకుండా మళ్లీ మళ్లీ వారిలో మార్పు వచ్చేవరకు ఓర్పుతో వ్యవహరిస్తాడు. సృష్టి కార్యం అనుక్షణం నిర్వహిస్తూ, ఏ జీవులు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేలా చెయ్యటం అనే విషయంలో ఏ మాత్రం నిర్వేదం చెందడు. సృష్టి సమతుల్యత కోసం, జీవుల పోషణ కోసం నిర్వహించే యజ్ఞ యాగాది క్రతువులలో చివరికి సమర్పించే పశువధకి కూడా తనే ఆ యూప స్తంభానికి పశువుగా కట్టబడి ఫలితాన్ని ఈ జీవులకి అందిస్తాడు.”
“నక్షత్ర నేమి” అంటే నక్షత్ర మండలం మధ్య ఉండి, వాటి కక్ష్యలో అవి తిరగటానికి ఉపయోగపడే ఇరుసు లాంటివాడు. గ్రహాలు, నక్షత్రాలు వాటి కక్ష్యలలో అవి తిరగటం అనేది సృష్టి సమతుల్యతకి చాలా ముఖ్యం. అలాగే అశ్విని, భరణి..ఇత్యాది 27 నక్షత్రాలని తన చుట్టూ తిప్పుకునే చంద్రుడు తానే! అలా చంద్రమండలం, సూర్య మండలము, నక్షత్ర మండలము కూడా తానే అయి జ్యోతిషశాస్త్రం ఉనికికి కారణం అవుతున్నాడు. మనిషి శరీరంలో ముఖం అగ్ని అయితే, సూర్య చంద్రులు ఇరువురు కళ్ళు. ఇవి శరీరంలో అతి ముఖ్యమైన భాగాలు. అవునా?
అవి శరీర నిర్వహణకు అవసరం.”
“ఇంతకు ముందు చెప్పుకున్నట్టు సూర్య, చంద్ర కిరణాల ద్వారా జీవులకు ఆహారాన్ని, ఔషధాలని, చంద్రుడి యొక్క వెన్నెల రూపంలో ఆహ్లాదాన్ని కూడా అందిస్తూ..తను సృష్టించిన జీవుల ఆనందమే తన ఆనందంగా ఉంటాడు. ఉదాహరణకి మీ అమ్మా నాన్నా మీరు సాధించే విజయాలని చూసి వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. మీకు మంచి బట్టలు కుట్టించి..మీరు అవి వేసుకుని కేరింతలు కొడుతుంటే చూసి, మీకు పిండివంటలు వండి పెట్టి..అవి తిని మీరు ఆస్వాదిస్తుంటే చూసి వాళ్ళే అవి అనుభవించినట్టు సంతోషపడిపోతారు. అవునా? కానీ మీరు తప్పు పనులు చేసినా, అల్లరిగా ప్రవర్తించినా మీకు కొని పెట్టేవి, వండి పెట్టేవి మానేస్తారా? అసలు మానరు. ఎందుకు? వాళ్ళకి మీ పట్ల క్షమా గుణం ఉంటుంది. మన పిల్లలే కదా, ఏదో చిన్నతనం! తప్పు చేస్తే చేశారు అని మిమ్మల్ని క్షమించేస్తారు. శ్రీమన్నారాయణుడు కూడా అంతే! ఆయనకి మనందరం పిల్లలమే కదా! ‘సమీహన:’ అంటే అలా సృష్టి చెయ్యటం అనే పనిని నిరంతరం విసుగు లేకుండా చేస్తూ..కర్మ జీవులకు విముక్తి కలిగిస్తూ ఉంటాడు” అని ముగించింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి