“యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాంగతి:
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం”
బామ్మ ఆ రోజు శ్లోకాలు చెప్పటం మొదలుపెట్టగానే..”బామ్మా నేను ఈ శ్లోకాలకు అర్థం చెప్పనా” అన్నాడు ఉత్సాహంగా శ్రవణ్.
“అబ్బో..ఇవ్వాళ మంచి హుషారుగా ఉన్నావే! సరే చెప్పు” అంది బామ్మ.
“ఆ శ్రీమన్నారాయణ మూర్తిని ఉద్దేశించి యజ్ఞం చేస్తారు అని తాతయ్య చెప్పారు. ‘యజ్ఞో వై విష్ణు:’ అని వేదం నిర్వచిస్తుంది. అంటే సాక్షాత్తూ విష్ణువే యజ్ఞం అయినప్పుడు..యజ్ఞం విష్ణువు కోసం, విష్ణు స్వరూపులైన యజ్ఞ కర్తలు క్రతువు నిర్వహిస్తూ ఉంటారు. అలా చేసే యజ్ఞంలో అగ్ని ఆ శ్రీమన్నారాయణుడే! యజ్ఞం ద్వారా అగ్నిలో సమర్పించే హవిస్సులు విష్ణువే! హవిస్సులని ఆయా దేవతలకి మోసుకెళ్ళేది ఆ నారాయణుడే! అలా ఆ అహవిస్సులని వారికి అందజేయడం ద్వారా వారికి తుష్టిని, తృప్తిని కలిగిస్తాడు.
“ ‘ఇజ్య’ అంటే యజ్ఞం ద్వారా ఆరాధించటం! ఇక నిత్యం యజ్ఞ రూపంగా పితృదేవతలని, మరి ఇతర దేవతలను ఆరాధించే వారు తామే శ్రీమహావిష్ణువై, ఆ శ్రీమహావిష్ణువునే ఆరాధిస్తున్నారన్నమాట! యజ్ఞ పశువుగా ఉండేదీ ఆ నారాయణుడే! అలా మహోన్నతంగా, సమగ్రంగా ఆరాధించబడే ఆ శ్రీమన్నారాయణుడు యజ్ఞ ఫలంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. దేవతలు కూడా యజ్ఞం చేస్తారు కదా! ఆ దేవతలకి కూడా యజ్ఞ ఫలాన్ని ఇచ్చే మహోన్నతుడు ఆయన. అందుకే ఆయనని ‘మహేజ్యశ్చ’ అంటారు.
“యూప స్తంభం నిర్మించి చేసే యజనాన్ని క్రతువు అంటారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అలా యూప స్తంభానికి బంధించబడే పశువు ఆయనే! యజ్ఞానికి బలి అయ్యేది ఆయనే! యజ్ఞ ఫలమైన మోక్షాన్ని ఇచ్చేదీ ఆయనే అయినప్పుడు తనని తానే ఆరాధించుకుంటూ, తన భక్తులకి మోక్షం ఇచ్చి వారిని అనుగ్రహిస్తాడు. వారితో యజ్ఞారాధన చేయించడం ద్వారా జగత్తు అనే మాయా ప్రపంచంలో అధర్మ కార్యాలవైపు వారు మళ్లకుండా వారిని కాపాడతాడు. అలా అందరికీ చివరికి గతి ఆయనే కాబట్టి ఆయనని ‘సతాంగతి:’ అంటారు.
“సర్వదర్శి” అంటే జీవులు తాము చేసిన పూర్వ జన్మల కర్మలననుసరించి వారికి సత్ఫలితాలని అందించటం అనేది మరవడు. అంటే ఆయనకి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల గురించిన సమగ్ర జ్ఞానం ఉంటుంది కదా! అలాగే సజ్జనులు తప్పులు చెయ్యకుండా కూడా జాగ్రత్త పడుతూ ఉంటాడు.”
“అలా సర్వమైన జ్ఞానం కలవాడు కాబట్టి, ఆయనని జ్ఞానులలో ఉత్తముడు అని చెప్పొచ్చు. ఆయనని అనుసరించి జ్ఞాన సంపన్నులైన వారు కూడా కర్మ బంధాల నించి విముక్తులై, మోక్షాన్ని పొందుతున్నారు అని అర్థం కదు బామ్మా” అన్నాడు శ్రవణ్. ‘బాగా చెప్పానా’ అని కూడా అడిగాడు.
“మీరు చెప్పింది చెప్పినట్లు నేర్చుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నాళాల్లో కొన్ని సార్లు పునశ్చరణ జరుగుతుంది కాబట్టి, రేపటి నించి అలా మిగిలిన వాళ్ళు కూడా అర్థం చెప్పటం మొదలుపెట్టండి” అని బామ్మ కర్తవ్య బోధ చేసింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి