వినరో భాగ్యము విష్ణు కథలు” (53)” : - ఎం బిందుమాధవి

“సువ్రత: సుముఖ: సూక్ష్మ: సుఘోష: సుఖద: సుహృత్
మనోహరో జీతక్రోధో వీర బాహుర్విదారణ:

“పిల్లలూ మీలో అందరికీ రామాయణం కథ తెలుసు కదా! అందులో దశరథ మహారాజు ఒక మంచి ముహూర్తంలో రామ పట్టాభిషేకం తల పెట్టాడు. రాముడిని తన అంత:పురానికి పిలిపించి తన మనసులో కోరిక రాముడికి చెప్పి, పట్టాభిషేకానికి అవసరమైన దీక్షకు తగిన ఏర్పాట్లు చేసుకోమని చెబుతాడు. రాముడు అలాగే అని చెప్పి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమయిందో తెలుసా” అని అడిగింది బామ్మ.
“అప్పుడు సభలో, రామ పట్టాభిషేక ప్రయత్నాల గురించి జరుగుతున్న సందడి అంతా.. కైకా దేవి యొక్క దాసి అయిన మంధర మోసుకొచ్చి, అది ఒక నేరంగా కైకకి చెప్పి, ఆ పట్టాభిషేక ఉత్సవాన్ని ఆపేటందుకు ఆమెని ఉసిగొల్పుతుంది. అప్పుడు కైక రాముని వనవాసానికి పదునాలుగు సంవత్సరాలు అడవికి పంపమని, భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని రెండు వరాలు దశరథుడిని కోరుతుంది. కైకకి అంతకు ముందు ఇచ్చిన మాట తప్పలేని దశరథుడు, అంతటి దుర్వార్తని తాను రామునికి చెప్పలేనని దుఃఖంతో కుప్పకూలిపోతాడు. అప్పుడు కైక రాముడిని పిలిపించి తానే ఆ విషయం చెబుతుంది. రాముడు, ఏ మనో వికారాలు లేకుండా సంతోషంగా తండ్రి, పినతల్లి కోరిక తీరుస్తానని నవ్వుతూ అడవికి వెళ్ళటానికి సిద్ధపడతాడు. అంతే కదు బామ్మా” అన్నాడు విష్ణు.
“సరిగ్గా చెప్పావు. కానీ ఈ విషయం ఇప్పుడు ఎందుకు గుర్తు చేశానో తెలుసా? రాజ్యాభిషేకం చేస్తానన్నప్పుడు కలిగిన సంతోషం, ఆనందం అన్నది కొంచెం కూడా తగ్గని చిరునవ్వు ముఖంతో రాముడు అడవికి వెళ్ళాడు. అలాంటి కోరిక కోరిన పైన తల్లి మీద కానీ, ఆమెకి అలాంటి వాగ్దానం చేసిన తండ్రి మీద కానీ కొంచెం కూడా కోపం తెచ్చుకోలేదు. అక్కడ అడవిలో కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆయన ముఖంలో ఆ ప్రశాంతత, చిరునవ్వు తగ్గలేదు.”
“సాధారణంగా మన మనుషులం, ఎవరైనా మనకి సన్మానం చేస్తామంటే పొంగిపోతాం. మనని ఏ పదవిలో అయినా నియమిస్తామంటే సంతోషిస్తాం. మళ్లీ కొంత సేపు అయినాక.. “క్షమించండి వయసులో మీ కంటే ఈ వ్యక్తి సీనియర్. అందుచేత ఈ సారి వారికి చేయటం న్యాయం. వచ్చే సంవత్సరం మీకు తప్పక ఆ పదవి ఇస్తాం. మా వల్ల జరిగిన తప్పుకి క్షమించండి” అని చెప్పారనుకోండి. వెంటనే వారిని దూషిస్తాం. వారి మీద చెడు ప్రచారం చెయ్యటానికి వెనకాడం. కానీ రాముడు అలా చెయ్యలేదు. కనీసం మనసులో కూడా బాధపడలేదు. ముఖం మనసుకి అద్దం లాంటిది. అలా బాధపడలేదు కనుకనే ఆయన ముఖం అంత ప్రశాంతంగా, సుందరంగా, చిరునవ్వుతో ఉంటుంది. అలా శ్రీమన్నారాయణుడికి పొంగు, కుంగు అనేవి లేకుండా ఎప్పుడు సుందరంగా ప్రశాంతంగా ఉంటాడు అని ఈ రోజు నామం చెబుతున్నది.”
“అలాగే తను తప్ప అన్యం ఎవరు వద్దని శరణాగతి వేడిన వారిని, నిరంతరం ధ్యానం చేసే వారిని ఎల్లప్పుడూ సర్వ భూతాల బారి నించి కాపాడుతానని, అలా వారిని రక్షించటంలో, వారికి మోక్షం ఇవ్వటంలో ఏ మాత్రం ఏమరుపాటుతో ఉండనని ఆ శ్రీమన్నారాయణుడు వ్రతం చేపడతాడు. వ్రతం అంటే తెలుసా” అంది బామ్మ.
“ఆ:( తెలుసు బామ్మా. మా అమ్మ వ్రతం చేసేటప్పుడు ఉదయమే తల స్నానం చేసి మడి కట్టుకుని వంట చేసి, పూజ చేసే వరకు ఏమీ తినకుండా..మమ్మల్ని కూడా ఆ రోజు అల్లరి చెయ్యద్దని, కఠినంగా మాట్లాడద్దని ఆంక్షలు పెడుతుంది. వ్రతం అంటే ఒక పని విజయవంతంగా పూర్తి చెయ్యటం కోసం, కొన్ని నియమాలు పాటించటం కదా” అన్నది శర్మిష్ట.
“అవును. అలాంటి వ్రతం మనని కాపాడే దేవుడు కూడా చేస్తాడంటే ఆశ్చర్యంగా ఉంది కదా? కానీ తనని శరణు వేడిన వారిని ఎప్పటికీ వదలను అని ఆయన దీక్ష బూని ఉంటాడు. అలా ఆ స్వామి, తనని శరణు వేడిన వారిని వదలని కథ మీకు తెలుసా” అని అడిగింది బామ్మ.
“హిరణ్యకశిపుడు పెట్టే పరీక్షల బాధ నించి ప్రహ్లాదుడిని కాపాడటం, మొసలి బారిన పడిన గజేంద్రుడిని రక్షించడం కదా బామ్మా” అన్నాడు హరి.
“అవును. బాగా చెప్పావు. సరే మళ్లీ మన శ్లోకంలోకి వెళితే..”సూక్ష్మ:” అంటే..అతి సూక్ష్మమైన పరమాత్మ నించి శబ్ద రూపంగా ఆకాశం ఏర్పడింది. ఆకాశం ఎక్కడ మొదలై, ఎక్కడ అంతం అవుతుందో మనకి తెలుసా? అంటే సూక్ష్మం నించి స్థూల రూపం ఏర్పడింది. ఇక అలా ఆకాశం నించి శబ్ద స్పర్శలతో వాయువు, వాయువు నించి శబ్ద స్పర్శ రూపములతో అగ్ని, అగ్ని నించి శబ్ద, స్పర్శ, రూప, రసములతో జలము, జలము నించి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములతో భూమి ఏర్పడ్డాయి. ఇలా పంచ భూతాలు ఒక దాని నించి ఒకటి తమ తన్మాత్రలైన శబ్ద, స్పర్శ రూపాలతో ఏర్పడ్డాయి. కానీ ప్రారంభం మాత్రం ఒక చిన్న అణువైన ఆత్మ నించి మాత్రమే!”
“సుఘోష” అంటే ఆ శ్రీమన్నారాయణుడు వేదము వలె గంభీరమైన మేఘ ఘోష కలిగినవాడు. ‘సుఖద:’ అంటే..ధర్మ వర్తకులని కాపాడుతూ వారి సుఖానికి కారణమవుతూ, అధర్మ వర్తకులని నిస్సందేహంగా కష్టపెడుతూ వారి ప్రవర్తనని చక్కదిద్దుతూ ఉంటాడు. ఆ విషయం మనం శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, వామనుడి అవతారాలలో తెలుసుకున్నాము. ‘సుహృత్’ అంటే తాను అందరికీ ఉపకారం చెయ్యటమే కానీ, ఎవరి నించి ఏ ప్రత్యుపకారమూ కోరని సహృదయుడు ఆ నారాయణ మూర్తి. ఆయనది అత్యంత గొప్పదైన ఆనందం మూర్తీభవించిన రూపం కాబట్టే ఆయనది సుందర రూపం. ఆయన దేవ శత్రువులని సంహరించినప్పటికీ, వారి మీద ఆయనకి ఎలాంటి కోపము ఉండదు. వారి పట్ల శత్రుత్వముతో కాకుండా కేవలము ధర్మ, వేద సంస్థాపనకు మాత్రమే! అలా శత్రు సంహారాన్ని ధర్మ స్థాపనకు మాత్రమే చేసినా ఆ స్వామి వీర్యవంతమైన బాహువులు కలవాడు. ఈ పూటకి చాలా” అని అడిగింది బామ్మ.
“ఈ రోజు మాతో కూడా చాలా విషయాలు చెప్పించావు బామ్మా. రేపు కూడా మేము మరికొన్ని విషయాలు చెబుతాము” అని పిల్లలు వెళ్ళిపోయారు.
కామెంట్‌లు