స్వాపన స్వవసో వ్యాపీ నైకాత్మా నైక కర్మ కృత్
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వర:”
“శ్రీమన్నారాయణుడు జీవులని ఎప్పుడు పోషిస్తూ, కాపాడుతూ ఉంటాడు అని చెప్పావు కదా బామ్మా! అన్నీ ఆయన చేతిలోనే ఉన్నప్పుడు..మరి అందరినీ మంచి వాళ్లుగానే పుట్టించచ్చు కదా! కొందరిని చెడ్డవాళ్ళుగా పుట్టించి, వాళ్ల చేత తప్పు పనులు చేయించి, వాళ్ల చేత కొంతమందికి హింస జరిగేలా చేసి..ఆ తరువాత వాళ్ళని శిక్షించడం ఎందుకు” అని అడిగాడు శ్రవణ్.
“మంచి సందేహమే కలిగిందిరా! కానీ ఇంతకు ముందు నేను, తాతయ్య కూడా చెప్పిన కొన్ని విషయాలు గుర్తు ఉంటే నీ సందేహానికి సమాధానం దొరుకుతుంది. సరే..నేనే మళ్లీ చెబుతాను. ఆ దేవ దేవుడికి మన పుట్టుక మీద మాత్రమే అధికారం ఉంది కానీ..ఎక్కడ, ఎలా పుట్టాలి, ఏ రకమైన జీవిగా పుట్టాలి అనేది మాత్రం మన పూర్వ జన్మల కర్మ ఫలాలు నిర్ణయిస్తాయి. ఉదాహరణకి మనిషా, అడవిలో జంతువా, ఇంటి ఆవరణల్లో తిరిగే పశువులా, పక్షా, క్రిమా, కీటకమా, చెట్టా, పర్వతమా, నదా..ఇలాంటి రూపాలుగా జన్మించటానికి వారి పూర్వ జన్మ కర్మలే కారణం. ఇంకా మనిషి అయితే..సంపన్నుల ఇంట్లోనా, నిరుపేద గుడిసెలోనా, అవయవ లోపం తోనా, తెలివి కలవాడిగానా..అనేది కూడా పూర్వ జన్మ కర్మలే నిర్ణయిస్తాయి.” అని బామ్మ చెబుతూ ఉండగానే..మానస అందుకుని..
“ఆ శ్రీమన్నారాయణుడు ఏది చెయ్యటానికైనా సర్వ స్వతంత్రుడు అని చెప్పావు కదా! అలాంటప్పుడు అందరూ మంచి కర్మలే చేసేట్టు చూడచ్చు కదా” అన్నది.
“అబ్బా..బాగుందర్రా. మీకు భగవంతుడి తత్వం బాగానే వంట పడుతున్నది కానీ మధ్య మధ్యలో కొన్ని మర్చిపోతున్నారు. కర్మలు మంచివే చేయించచ్చు కదా అన్నావు..ఆయన మాయ కూడా చేస్తాడు అని కూడా చెప్పాను. గుర్తుందా? మాయ అంటే నిన్నటి విత్తనం ఈ రోజు మొలక, ఈ రోజు కాయ రేపు పండు, నిన్నటి దాకా మృత్యువుతో పోరాడిన వాడు ఈ రోజు కోలుకుని మళ్లీ ఆరోగ్యవంతుడు అవటం ..ఇలా అన్నమాట.”
“ఇంతే కాదు..కొన్ని రకాల మాయలు ఎలా ఉంటాయి అంటే..అమ్మ అలమారులో పది రూపాయలు పెట్టి మర్చిపోయిందనుకుందాం. వేణుకి అది తీసుకుని షాపులో ఏదో ఒకటి కొనుక్కోవాలనే కోరిక కలుగుతుంది. ఇంతలో వాడి మనసు..’హుష్ తప్పు.అలా అమ్మకి చెప్పకుండా డబ్బు తీసుకుంటే అది దొంగతనం అవుతుంది. అమ్మకి తెలిస్తే కొడుతుంది’ అని చెబుతుంది. అదే మనసు కొంచెం సేపు ఆగి ‘ఏం ఫరవాలేదు. అమ్మకి అసలు అక్కడ డబ్బు పెట్టిన మాట గుర్తు లేదు. ముందైతే బిస్కెట్ కొనేసి తినేస్తే నీ కోరిక తీరుతుంది. తరువాత అమ్మ ఒక దెబ్బ వేస్తే..వీపు అప్పజెప్పేస్తే దెబ్బ తాలూకు నొప్పి కాసేపటికి తగ్గిపోతుంది. బిస్కెట్ కొనుక్కు తిన్న కోరిక తీరుతుంది. ఉ:( డబ్బులు తీసుకో’ అని ఉసి గొలుపుతుంది. అది మాయ అంటే!ముందు మనకి అవకాశం కల్పించి, ఆ ఆకర్షణ నించి మనని మనం ఎలా నిగ్రహించుకుంటామో పరీక్ష పెడుతుంది. అలా తాత్కాలిక వ్యామోహానికి, ఆకర్షణకు లొంగక క్రమశిక్షణతో నిగ్రహంగా ఉండే వారు తప్పులు చెయ్యకుండా..ఆ శ్రీమహావిష్ణువు కోరినట్లు ధర్మ బద్ధమైన జీవితం గడిపి..తరువాయి జన్మలలో ఆయన దగ్గరకి చేరిపోతారు.”
“పైన చెప్పినట్టు అప్పుడప్పుడు మనని పరీక్షించడానికి ఆయన మాయలు సృష్టిస్తూ ఉంటాడు. మనం మానసికంగా ఎంత పటిష్ఠంగా, క్రమశిక్షణతో ఉంటామో పరీక్షిస్తూ ఉంటాడు. అంతా మంచే ఉంటే అసలు చెడు అనేది తెలియదు. అంత చెడే ఉంటే జీవికి మనుగడ ఉండదు. కాబట్టి సృష్టిలో ఎప్పుడు మంచి, చెడు అనేవి పక్క పక్కనే ఉంటాయి. ఏ దారి ఎన్నుకోవాలి అనేది నీ మానసిక పరిణతిని బట్టి ఉంటుంది. అదే ‘స్వాపన’ అంటే!”
‘స్వవసో వ్యాపీ’ అంటే..తనంత తానే ఆకాశంగా, వాయు, జాల రూపంగా అన్ని చోట్లా వ్యాపించి ఉంటాడు. ఆయన ఎవరి అదుపు ఆజ్ఞలకి లోబడి ఉండక్కర్లేదు. సర్వ స్వతంత్రుడు. ఆకాశం నించి వాయువు, వాయువు నించి అగ్ని , అగ్ని నించి జలము, జలం నించి భూమి పుట్టాయని నిన్న చెప్పుకున్నాం కదా..అలా అన్నిటి పుట్టుకకి, వ్యాప్తికి, మనుగడ కలిగి ఉండటానికి, నశించిపోవటానికి..అంటే సృష్టి, స్థితి, లయలకి కూడా ఆయనే కారకుడు. అదే ‘నైకాత్మా’ అంటే”
“నైక కర్మ కృత్’ అంటే ఇన్ని రూపాలుగా ఆయనే ఉన్నప్పటికీ..చైతన్యంగా ఉన్న శక్తి మాత్రం ఒకటే! శక్తి ఒకటే అయినా..ఆయన చేసే కర్మలు అనేకం. ఎలా అంటే ..పుట్టటం, ఉండటం, పెరగటం, మార్పు చెందడం, క్షీణించడం, నశించిపోవడం.”
“వత్సరో వత్సలో వత్సీ” అంటే ఆయన జీవుల పట్ల స్నేహ భావంతో ఉంటాడు. ఆవు తన దూడలకి పాలు ఇచ్చి, దగ్గరకి ఎలా తీసుకుంటుందో..అలా ఆ దేవ దేవుడు మనకి తనే పోషణ చేసి, తానే ఆత్మీయంగా దగ్గరకి తీసి ప్రేమిస్తాడు. ‘రత్న గర్భో ధనేశ్వర:’ ఆయనే సముద్రుడిగా ఉంటాడు. సముద్రగర్భంలో అనేక జీవ రాశులు, రత్నాలు ఉంటాయి కాబట్టి ఆయనని రత్న గర్భుడు అంటారు. అలా సృష్టిలో సంపదని సూచించే అన్నీ ఆయన వల్ల సృష్టించబడినవే కాబట్టి ఆ ధనానికి ఈశ్వరుడు ఆయనే. మనం మాములుగా బాగా ధనవంతుడిని కుబేరుడితో పోలుస్తూ ఉంటాం. అంటే రత్న గర్భుడు ఆయనే! కుబేరుడూ ఆయనే అన్నమాట. అర్థం అయిందా. కాబట్టి వీళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు పెద్ద పదవిలో ఉన్నారు. వాళ్ళు బాగా చదువుకున్నారు అని మనం అనుకుంటున్నామంటే..అవన్నీ ఆయన సృష్టించిన మాయ, ఆకర్షణలో పడకుండా తమని తాము నిగ్రహించుకుని, ధర్మ బద్ధంగా బతికిన వారి పూర్వ జన్మల కర్మ ఫలం వల్లనే కానీ ఆయనకి ఎవరి పట్ల పక్షపాతం అనేది ఉండదు అని అర్థం చేసుకోవాలి” అని బామ్మ పిల్లలకి పరోక్షంగా బుద్ధిగా మసులుకోవలసిన అవసరం గురించి చెప్పింది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి