అవిజ్ఞాంతా సహస్రాంశు: విధాతా కృతలక్షణ:”
“పిల్లలూ..మనకి ఎంత తెలుసు అనుకున్నా కూడా, భగవంతుడి తత్వం చాలా గంభీరమైనది. అర్థమైనట్టే ఉంటుంది కానీ ,అంత తేలికగా అర్థం కాదు. అందుకే ఈ రోజు శ్లోకం మీకు గజిబిజిగా అనిపిస్తుంది. కాబట్టి కాస్త శ్రద్ధగా విని నేర్చుకోవాలి” అని బామ్మ వారిని ముందుగా సన్నద్ధం చేసింది.
“భగవంతుడు ధర్మాన్ని స్థాపిస్తాడు. ధర్మం అంటే కొన్ని నియమాలన్నమాట. సమాజంలోని అన్ని జీవులు న్యాయంగా తమ తమ జీవనం సాగించాలంటే, ఎవరి పరిధిలో వారు క్రమశిక్షణతో బతకాలి. ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయించి, క్రమేణా తన కిరణాలతో లోకం అంతా వ్యాపించి మధ్యాహ్నానికి తీవ్రమై, సాయంత్రానికి చల్లబడాలి. అంతే కాదు..ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైన తీవ్రతతో, పగటి పూట ఎంత సేపు ఉండాలో నిర్ణయం జరగాలి. సూర్య కిరణాలతో వెలిగే చంద్రుడు, భూమి చుట్టూ తిరుగుతూ, రాత్రి వేళల తన చల్లని కిరణాలతో లోకాన్ని చల్లబరచాలి. ఆ కిరణాలు ఔషధ జాతి మొక్కలు పెరగటానికి అవసరం. నీరు పల్లానికి ప్రవహించాలి. గాలి ఎప్పుడు వ్యాపించి అన్ని జీవుల ఉనికికి కారణమవ్వాలి.”
“అలాగే మనుషులు ఇతరులపై దాష్టీకం చెయ్యకుండా, నియమ నిబంధనలతో బతకాలి. ఇతర పశు పక్ష్యాదుల ఉనికిని కాపాడాలి. ప్రకృతిని నాశనం చెయ్యకూడదు. ధర్మ బద్దంగా తమ సంతానాన్ని వృద్ధి చెయ్యాలి. ఇలా ఆ శ్రీమన్నారాయణుడు తనకంటూ ధర్మం ఆచరించవలసిన అవసరం లేకపోయినా..శ్రీరామ చంద్రుడిగా ఈ భూమి మీద జన్మించి, ధర్మాన్ని, కర్తవ్య నిర్వహణని ఆచరించి చూపించాడు. ఎందుకంటే ఉత్తములు ఏది ఆచరిస్తే, ఇతరులు దాన్ని అనుసరిస్తారు. ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురైనా..ధర్మం తప్పను అనే నిగ్రహము, నిబద్ధత మనిషికి లేకపోతే సమాజం అల్లకల్లోలమవుతుంది. సృష్టిలో బుద్ధి జీవులైన మనుషులు మాత్రమే అన్ని సమస్యలకి కారణమవుతారు.”
“కానీ ధర్మం తప్పటం అనేది, నిన్న చెప్పినట్టు ఆ దేవ దేవుడు సృష్టించే మాయ ప్రభావం వల్ల మనకి జరిగే పరీక్ష మాత్రమే! అలా మనని పరీక్షించి, మనం ధర్మం తప్పి ప్రవర్తించకుండా కాపాడతాడు. అయినా అధర్మంగా ప్రవర్తించేవారు ఉంటారనుకోండి. వారిని అతి కఠినంగా శిక్షించి లోకానికి పాఠం నేర్పుతాడు. “సద సత్క్షర మక్షరం” అంటే ఎప్పటికీ నశించకుండా ఉండేవాడు ఆయనే! జీవులలో ఉండే చైతన్యం ఆయనే కాబట్టి వారు నశించటం (మరణం) ద్వారా నశించేవాడు ఆయనే! మళ్లీ జన్మించటం ద్వారా నశించటం లేదని నిరూపించేవాడు ఆయనే!”
“ఒక పని చెయ్యటం ద్వారా ఏర్పడే‘కర్తృత్వము’, ఆ పని తాలూకు మంచి-చెడు ఫలితాలు అనుభవించే ‘భోక్తృత్వము’ అనేవి లేనివాడు ఆ పరమాత్మ. అందుకే ఆయనని ‘అవిజ్ఞాతా’ అంటాము. ఇక సూర్య భగవానుడిని ‘సహస్రాంశు’ అంటాము. ఎందుకంటే ఆయనకి వేయి కళ్ళు లేకపోతే ఈ జగమంతా వ్యాపించలేడు. ఆయన ఏదో ఒక ప్రాంతానికి పరిమితం అవ్వాలి. సూర్య భగవానుడి రూపంలో ఉండేది ఆ శ్రీమహావిష్ణువు కాబట్టి ఆ దేవ దేవుడిని ‘సహస్రాంశు’ అని చెప్పొచ్చు.”
“విధాతా” అంటే ఈ సర్వ లోకాలని..ఉదాహరణకి భూమిని తూర్పున మోసే ‘ఐరావతం’, ఆగ్నేయంలో మోసే ‘పుండరీకం’, దక్షిణాన మోసే ‘వామనం’, నైరుతి లో మోసే ‘కుముదం’, పశ్చిమంలో మోసే ‘అంజనం’, వాయవ్యంలో మోసే ‘పుష్పదంతం’, ఉత్తరంలో మోసే ‘సార్వభౌమం’, ఈశాన్యంలో మోసే ‘సుప్రతీకం’, లాంటి దిగ్గజాలను, మరియు ఇతర దివ్యమైన పర్వతాలైన మహా మేరువు, వింధ్య, హిమాలయ పర్వత శ్రేణులని మోసే ఆదిశేషుడు రూపంలో ఉండే ఆ పరమాత్మే!”
“అలాంటి ఆ పరమాత్మను ఒక రూపంగా, ఆకారంగా గుర్తించడానికి ప్రమాణాలంటూ ఏమీ లేవు. కేవలము ఆయనకి భౌతికంగా కొన్ని లక్షణాలు ఆపాదించి, భక్తితో పూజించి, మనసులో ఆరాధించి ఉపాసించి ఆయన ఉనికిని అనుభవించగలమే కానీ పరమాత్ముడంటే ఈయనే, ఇలా ఉంటాడు అని మన భౌతిక ప్రమాణాలతో చెప్పలేము. ఎందుకంటే ఆ భౌతిక విషయాలని సృష్టించినది కూడా ఆయనే కదా! సరే ఈ పూటకి చాలు, మిగిలినవి రేపు చెప్పుకుందాం” అని బామ్మ ఆ రోజు శ్లోకాలు ముగించింది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి