వినరో భాగ్యము విష్ణు కథలు” (56) “ : - ఎం బిందుమాధవి

 “గభస్తి నేమి: సత్త్వస్థ:సింహో భూత మహేశ్వర:
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవ భృద్గురు:

“పిల్లలూ ఆటలు అయ్యాయా? అందరూ వచ్చారా? అలా చాపలు పరుచుకుని కూర్చోండి. వేసవి కాలం కదా..బయట ఎండ ఇంకా తగ్గలేదు. కరెంట్ మధ్యాహ్నం అనగా పోయింది. ఇంకా రాలేదు. కాసిని మంచి నీళ్ళు తాగండి. ఇదిగో వచ్చేస్తున్నా” అంటూ బామ్మ పిల్లలని శ్లోకాలు నేర్చుకోవటానికి సమాయత్తం చేసింది.
“ఆ:( ఈ రోజు శ్లోకంలో ‘గభస్తి నేమి’ అంటే..’గభస్తులు’ అంటే కిరణాల సమూహం” అని బామ్మ చెప్పగానే..”ఆ:( ఇప్పుడు నేను చెబుతా” అంటూ హరి “ కిరణాలు ఒక వలయంగా ఉంటే వాటి మధ్యలో ఉండే ‘నేమి’ అంటే ‘ఇరుసు’ లాంటి వాడు ఆ శ్రీమహావిష్ణువు అని కదా అర్థం బామ్మా” అన్నాడు. అవునర్రా..మీకు చెప్పినవి బాగా గుర్తు పెట్టుకుని సందర్భం వచ్చినప్పుడు అన్వయం చేయగలుగుతున్నారు. భేష్! సూర్యుడు మధ్యలో ఉండి తన కిరణాలను చుట్టూ వలయాకారంగా ప్రసరింప చేస్తున్నాడు అంటే, అది 360’ డిగ్రీల్లో ఉన్నట్టే కదా! అలా వలయంగా తిరగాలంటే, ఆ వలయం మధ్యలో కిరణాలను పట్టి ఉంచి, తిప్పగలిగే ఒక ఇరుసు ఉండాలి.”
“ఇప్పుడు క్లుప్తంగా చెప్పాలంటే..ఆ శ్రీమన్నారాయణుడే సూర్యుడిగా ఉండి, తన కిరణాల వలయం మధ్యలో తనే ఒక ఇరుసు అయి తన కిరణాలను అన్ని దిక్కులకి ప్రసరింప చేస్తున్నాడన్నమాట. ‘సత్త్వస్థ:’ అంటే శ్రీమన్నారాయణుడు సత్త్వ గుణ సంపన్నుడు. ఇంతకు ముందు చెప్పానో లేదో గుర్తు లేదు.. మానవ ప్రవర్తనని శాసించే గుణాలు మూడు.. అవి సత్త్వ, రజస్, తమో గుణాలు. సత్త్వ గుణం అంటే శాంతము, జ్ఞానం కలిగి ఉండటం. రజో గుణం అంటే ..తనకి కావాలనే ఆశ, పని చేయాలనే ఉత్సుకత. తమో గుణం అంటే అజ్ఞానం, జడత్వం కలిగి ఉండటం. ఒకే మనిషిలో సందర్భాన్ని బట్టి ఈ మూడు గుణాలు ప్రదర్శింపబడతాయి. ఒక మనిషిలో ఏ గుణం ఎక్కువ ప్రధానంగా ప్రకటనమవుతుందో దాని బట్టి ఆ మనిషి..ఇలాంటి వాడు, అలాంటివాడు అని వర్ణించబడుతుంది. కానీ శ్రీమన్నారాయణుడు కేవలం సత్త్వ గుణం మాత్రమే కలిగి ఉంటాడు. అంటే ఆయన జ్ఞాన స్వరూపుడు అన్నమాట”
“ఆయన ‘సత్త్వం’ కలిగిన బలవంతుడు అనేది సత్యం..ఆయన నృసింహ స్వరూపంలో విజృంభించి హిరణ్య కశిపుడిని ఆయన కోరిన పద్ధతిలోనే సంహరించింది సత్యం! అలాంటి శ్రీమన్నారాయణుడు ఈ సృష్టిలోని భూతాలన్నిటికీ..అంటే జీవులన్నిటికీ గొప్ప ఈశ్వరుడు కాబట్టి ‘మహేశ్వరుడు’ అన్నమాట. ఈశ్వరుడు అంటే గొప్ప ఐశ్వర్యం కలవాడు. ఆ ఐశ్వర్యంతో లోకాన్ని పాలించేవాడు అని అర్థం.”
“జలప్రళయం సంభవించి సృష్టి మొత్తం అంతం అయినప్పుడు ఆయన అలాగే నిశ్చలంగా ఉంటాడు. మళ్లీ సృష్టి జరగటానికి కావలసిన బీజాలన్నీ ఆయనలోనే ఉంటాయి కాబట్టి, జీవ సృష్టి ఆయన నించే మొదలవుతుంది కాబట్టి ‘ఆది దేవుడు’ ఆయనే! జీవులు మాయలో పడి అధర్మంగా ప్రవర్తించకుండా కాపాడుతూ వారిని జ్ఞాన వైరాగ్యాల వైపు మళ్లించి, మోక్షం వైపు నడిపే మహా దేవుడు ఆయన. అందుకే ఆయనని ‘మహాదేవుడు’ అని పిలుస్తారు. ‘దేవేశో’ అంటే ఆయన దేవతలందరికంటే ఐశ్వర్యం వంతుడు. కాబట్టే దేవతలకి రాజు అయిన ఇంద్రుడికంటే కూడా అధికుడు. వారికి కూడా వారి వారి తపస్సులను బట్టి సిరి సంపదలని, ఫలితాలని ఇచ్చే అధికుడు కాబట్టి ‘దేవ భృద్గురు’ అంటారు. ఈ రోజుకి చాలా?” అని అడిగి బామ్మ పిల్లలకి మామిడి పండు ముక్కలు పెట్టి పంపించింది.
కామెంట్‌లు