“వినరో భాగ్యము విష్ణు కథలు” (57) : - ఎం బిందుమాధవి

 “ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్య: పురాతన:
శరీర భూత భృద్భోక్తా: కపీంద్రో భూరి దక్షిణ:”
గల గలలాడుతూ పిల్లలు సందడిగా వచ్చి..”బామ్మా ఇవ్వాళ ఏం చెప్పుకుందాం” అని అడిగారు.
“ఏమిటి ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నారు” అని అడిగింది బామ్మ.
“మా స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఉన్నాయి బామ్మా. నేను శ్రీమన్నారాయణుడి విరాడ్రూపం వెయ్యాలనుకుంటున్నాను. అలా వెయ్యచ్చా” అని అడిగాడు రవి.
“అంటే మీకు నేను నేర్పే శ్లోకాలు అర్థమయి, బాగా నచ్చుతున్నాయి అని అర్థం. సరే..శ్రీమన్నారాయణుడి విరాడ్రూపం అంటే కొంచెం కష్టం. కానీ ఆయనది కృష్ణావతారంలోని గోవర్ధన పర్వతం ఎత్తుతున్న రూపం వెయ్యచ్చు. అది మీకు కొంచెం తేలిక అవుతుంది. సరే ముందు ఈ రోజు శ్లోకాలు మొదలుపెడదాము. ‘ఉత్తరో’ అంటే జనన మరణ చక్రాలని దాటి మోక్షం పొందిన వాడు, లేదా సంసార బంధనాలతో సంబంధంలేని ఉత్తముడు అని కూడా అర్థం చెప్పొచ్చు. అందరి కంటే ఉత్కృష్టమైన వాడు” అని బామ్మ చెప్పగానే..
“అవును బామ్మా..ఆ శ్రీమన్నారాయణుడికి పుట్టుక, మరణం లేదు కాబట్టి సంసార చక్రం అనేది ఆయనకి ఉండదు. కర్మలు అనేవి ఉండవు కాబట్టి కర్మ ఫలంగా జన్మించటం ఉండదు” అన్నాడు హరి అనుభవజ్ఞుడిలాగా!
“గోపతిర్గోప్తా” అంటే..’గో’ అనే శబ్దానికి గోవు, భూమి అని కూడా అర్థం ఉన్నది. అంటే ఆయన ఈ భూమికి పతి అంటే రాజు, భూమిని ధరించి పాలించేవాడు అని అర్థం. ఇంకొక రకంగా కృష్ణావతారంలో గోవులని కాచేవాడు కాబట్టి గోవులకి అధిపతి అని కూడా చెప్పొచ్చు. గోవులు అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటి పదార్థాలని ఇచ్చి పోషించేవి. భూమి అంటే పంటలు, జలము ద్వారా పోషకాలని అందించి పోషించేవి. అలా గోవులకి, భూమికి కూడా అధిపతి అయి వాటి ద్వారా పోషకత్వం చేసే ఆ శ్రీమన్నారాయణుడిని ‘గోపతిర్గోప్తా’ అంటారు.
“ఈ సృష్టిలోని సంపూర్ణ జ్ఞానానికి గమ్యం ఆయనే. ఎందుకంటే..మనకి ఉన్న జ్ఞానం అంతా వేదాల ద్వారా లభించిందే కదా! మన జీవనం క్షేమంగా సాగటానికి అవసరమైన సమస్త శాస్త్రాలు వేదం ద్వారానే వచ్చాయి. ఆయనే వేదం, ఆయనే యజ్ఞం. మనం చేసే కర్మల ద్వారా ఆయనని తెలుసుకోలేము. కేవలం ఆయన గురించిన సంపూర్ణ జ్ఞానం ద్వారా ధ్యానించి, ఉపాసించి మాత్రమే ఆయనని తెలుసుకోగలము. అంతే కాదు..ఆయన అందరికంటే మొదటివాడు..పురాతనుడు. ఆయనని ఫలానా కాలం వాడు, ఫలానా వయసువాడు, ఫలానా రూపం వాడు, ఫలానా పరిమాణంలో ఉంటాడు అని చెప్పలేము అని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా! కాబట్టి ఆయన ‘జ్ఞాన గమ్య పురాతన:’ అన్నమాట.
“శరీర భూతభృత్” అంటే..జీవుల శరీరాలని నిర్మాణం చేసే శక్తి, వాటిని నిలబెట్టే శక్తి, పోషించే శక్తి ఆయనే కాబట్టి ఆయనని ఆ నామంతో కీర్తిస్తారు” అని బామ్మ చెప్పగానే..
“ఆ:( బామ్మా.. చేతులు, కాళ్ళు ఇలా ఐదు వేళ్ళతో ఉండాలి. అవి శరీరానికి ముందు వైపు ఉండాలి. చెవులు, ముక్కు, కళ్ళు ముఖంలో ఈ షేప్ లో ఉండాలి అని రూప నిర్ణయం చెయ్యటం అన్నమాట. అలాగే పక్షి ఇలా ఉండాలి, జంతువు అలా ఉండాలి అని రూప నిర్మాణం చేస్తాడు. అలా కాకుండా వేరేగా ఉంటే..మనం వెంటనే ‘ఏమిటి ఈయన ఇలా ఉన్నాడు’ అనుకుంటామా లేదా? అలా శరీర నిర్మాణం చేసే ఆ శ్రీమన్నారాయణ తత్వాన్ని ‘త్వష్ట’ అంటాం కదా” అని ఆరిందాలాగా చెప్పాడు శ్రవణ్.
“బాగా చెప్పావురా! అలా శరీరం నిర్మాణం చేసి, అందులో తానే ప్రాణ శక్తిగా ఉండి శరీరాన్ని నిలబెట్టి, పోషించి, ఎదిగేట్లు చేస్తాడు కాబట్టి ‘శరీర భూతభృత్’ అంటారు. ‘కపి’ అంటే వరాహము, కోతి అని కూడా అర్థము. మీకు తెలుసు కదా..శ్రీమహావిష్ణువు హిరణ్యాక్షుడి నించి భూమిని రక్షించటానికి వరాహావతారం ధరించాడు అని. అంతేకాదు..వానరులకి ఇంద్రుడితో సమానమైన వాడు శ్రీరామ చంద్ర మూర్తి. అలా ఆ శ్రీమన్నారాయణుడు వరాహావతారం, శ్రీరామావతారాన్ని మళ్లీ ఒక సారి స్మరించుకుంటున్నాము.”
“భూరి దక్షిణ:” అంటే..యజ్ఞం చేసేటప్పుడు, ఆ యజ్ఞ కర్త..యజమాని ఆ క్రతువు నిర్వహించే యాజ్ఞీకులకి విధిగా దక్షిణ సమర్పించాలి. యజ్ఞం అనే కాదు..ఏ పనికి అయినా ఆ పని నిర్వహించిన వారికి సంభావనో, దక్షిణో తప్పనిసరిగా ఇస్తేనే ఆ పని చేసిన వ్యక్తికి ఫలితం దక్కుతుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు యజ్ఞం ఆయనే, యజ్ఞ కర్త ఆయనే, యజ్ఞ భోక్త ఆయనే కాబట్టి దక్షిణ గ్రహించేది కూడా ఆయనే అన్నమాట.”
“ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకుంటే..జీవుల శరీరం నిర్మాణం చేసి, వారిలో ప్రాణ శక్తిగా ఉండి, వారిని ఆహారంతో పోషించి, నిర్వహించే ఆ శ్రీమన్నారాయణుడికి మనం ఇచ్చే, లేదా ఇవ్వగలిగే దక్షిణ ఏమిటి..కేవలం ఆయన మన కోసం ధరించిన అవతారాలను స్మరించటం, ఆ అవతార పరమార్థాన్ని తలుచుకుని కృతజ్ఞతతో ఉండటం, ఆయన గురించిన ధ్యానం చేస్తూ, మనసులో ఆయనని నిలుపుకుని ఉపాసన చేస్తూ, ధర్మ బద్ధంగా బ్రతకటమే! అవునా?” అని బామ్మ ఆ రోజు శ్లోకాలు ముగించింది.

కామెంట్‌లు