శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 72
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
51.సర్వాభరణ భూషితా (అష్టాక్షరీ)
52.శివ కామేశ్వరాంకస్థా (అష్టాక్షరీ)
యాభై ఒకటవ నామ మంత్రము - 
  ఓం శివ కామేశ్వరాంకస్థాయై నమః
శివస్వరూపుడు, మంగళకరమైన స్వరూపం కలవాడు, కామేశ్వరుడు అయిన పరమేశ్వరుని అంకస్థానమును /  తొడను పీఠముగా చేసుకుని విరాజిల్లుతున్న పరమేశ్వరికి నమస్కారము.
"శివ" అంటే "మంగళము / శుభప్రదము. శివుడు మంగళ కారకుడు. శుభములను ఇచ్చు తండ్రి. శివుని అర్ధాంగి "శివాని". ఈమె మంగళములను అనుగ్రహించేది. ఒకరు కుడి అయితే, మరొకరు ఎడమ. ఈ కుడి ఎడమలతో కూడుకున్నదే, "అర్థనారీశ్వర తత్వము". అర్థనారీశ్వరం లో శివుని తొడ, పరమేశ్వరి యొక్క స్థానము. ఇలా పరమేశ్వరుని వామాంకముపైన కూర్చుని కనిపించిన లలితా పరాభట్టారిక ను చూసిన వశిన్యాది వాగ్దేవతలు, శ్రీమాతను "శివ కామేశ్వరాంకస్థా" అని కీర్తించారు. తన అర్థాంగి అలా కీర్తింపబడటం విన్న, చూసిన శంభుడు, అమ్మను ముసి ముసి నవ్వులతో తేరిపార చూసాడు.
ఇప్పటివరకు, చెప్పుకున్న నామాలలో, మనం అమ్మ స్థూలరూప వర్ణన తెలుసుకున్నాము. ఇప్పుడు, పరమేశ్వరి యొక్క నివాస స్థానాలను తెలుసుకుందాము. శివుడు ఆది గురువు. ఆది భిక్షువు. ఆది యోగి. ఈయన యోగియై కూడా సృష్టి చేయాలి అనే కోరికను కలవాడు అని, బృహదారణ్యకము లో చెప్పబడింది. కనుక శివుడు, కాముడు అయ్యాడు. పరమేశ్వరునికి, శివుడు, కాముడు విశేషణములు. సృష్టి చేయాలి అనే కోరిక, ఇచ్ఛ "ఇచ్ఛా శక్తి". ఈ ఇచ్ఛా శక్తి కి ఆధారమైన పరమేశ్వరి, శివుని అంకమును ఆధారము చేసుకొని ఉంది. ఇలా అర్థనారీశ్వరిగా వున్న పరమేశ్వరి, శివుని ఇచ్ఛా స్వరూపిణి. కనుక, ఏ శక్తి కూడా ఆలంబన లేకుండా ఉండలేదు.
శంభుని వామాంకమే శాంకరి ఇచ్ఛా స్థానము. భక్తుల హృదయము, పరమేశ్వరుని నివాస స్థానము. పరమేశ్వరి యొక్క నివాస స్థానము, శివుని వామాంకము. రుద్రుని వామాంకస్థితయై ముజ్జగాలనూ మురిపెముతో లాలిస్తున్న లలితా పరాభట్టారికను  పూజించేటప్పుడు 
ఓం శివ కామేశ్వరాంకస్థాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు