శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 75
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
54.స్వాధీన వల్లభా (అష్టాక్షరీ)
55.సుమేరు శృంగమధ్యస్థా (అష్టాక్షరీ)
యాభై ఐదవ నామ మంత్రము - 
  ఓం సుమేరు శృంగమధ్యస్థాయై నమః
మేరుపర్వతం యొక్క శిఖరాలలో, మధ్య శిఖరం పైన ఉన్న పరమేశ్వరి కి నమస్కారము. సహస్రారకమల మధ్యంలో ఉన్న పరాత్పరికి నమస్కారము. శ్రీచక్ర బిందు మధ్యలో, బిందు రూపిణిగా ఉన్న శ్రీమాతకు నమస్కారము.
మేరుపర్వతం మధ్య శిఖరము పైన జగన్మాత ఉంది. శ్రీచక్రం మధ్యలో వున్న బిందువే మేరుశృగం. ఈ బిందువును చుట్టి వున్న త్రికోణాకారములో, తూర్పు కోణము వద్ద ఇచ్ఛా శక్తి, నైఋతి కోణంలో క్రియాశక్తి, వాయువ్య కోణంలో జ్ఞాన శక్తి ఉన్నాయి. ఇక్కడ శ్రీమాత అయిన రాజరాజేశ్వరి, పరమాత్మ యొక్క వామాంక పీఠస్థయై ఉంది. ఇలా శ్రీచక్ర బిందు మధ్యలో పరమేశ్వర వామాంక స్థితయై దర్శనం ఇచ్చిన శ్రీచక్రరాజసింహేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు, అమ్మను "సుమేరు శృంగమధ్యస్థా" అని కీర్తించారు.
దుర్వాస మహర్షి రచించిన "లలితా సప్తగ్రంధము"లో ఇలా చెప్పబడింది..... సుందరమైన అతి ఎత్తైన పర్వత శిఖరాలు మూడు వున్నాయి. వాటి మధ్యలో, మరొక శిఖరం, ముందు చెప్పిన మూడు పర్వతాలకంటే ఎత్తైనది, సుందరమైనది ఉన్నది. ఈ శిఖరం మీదనే లలితా పరాభట్టారిక కొలువై ఉన్నది. ఈ శిఖరం అన్ని లోకాల సముదాయమతో నిండి వుంది. రకరకాల పొదరిళ్ళు, తోటలు, వనాలు ఎన్నెన్నో ఉన్నాయి. అక్కడ దేవతా స్త్రీలు సంగీతాన్ని నిత్యం సాధన చేస్తూ ఉంటారు. దేవ దుందుభిలు అనునిత్యం మ్రోగుతూ ఉంటాయి.
అమ్మ కొలువైన పర్వత శిఖరం నకు తూర్పు, నైఋతి, వాయువ్య దిశలలో ఉన్న మూడు శిఖరాలు బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల లోకాలకు ఆధారాలుగా వున్నాయి. అమ్మ అధిరోహించిన మధ్య శిఖరం, ఎంతో మనోజ్ఞంగా, రత్న కాంతులతో ప్రకాశిస్తూ నాలుగు వందల యోజనాల ఎత్తైన శ్రేష్టమైన శిఖరము. లెక్కకు మిక్కిలిగా ఉన్న పద్మముల యొక్క అడవి మధ్యలో చింతామణి గృహంలో అమ్మ స్థిరనివాసినిగా ఉన్నది.
చింతామణి గృహం లోనుండి తన భక్తుల, సకల అభీష్టాలను నెరవేరుస్తున్న లలితా పరాభట్టారికను  పూజించేటప్పుడు 
ఓం సుమేరు శృంగమధ్యస్థాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు