శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 78
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
57.చింతామణి గృహాంతస్థా (అష్టాక్షరీ)
58.పంచబ్రహ్మాసన స్థితా (అష్టాక్షరీ)
యాభై ఎనిమిదవ నామ మంత్రము - 
  ఓం పంచబ్రహ్మాసన స్థితాయై నమః
బ్రహ్మ, విష్ణువు, రుద్రడు, ఈశానుడు, సదాశివుడు - వీరు అయిదుగురు పంచ బ్రహ్మలు. మొదటి నలుగురు, బ్రహ్మ, విష్ణువు, రుద్రడు, ఈశానుడు శ్రీమాత సింహాసనానికి కోళ్ళు గా వున్నారు. అయిదవ బ్రహ్మ అయిన సదాశివుడు, సింహాసనము మీద పరుపుగా ఉన్నాడు. ఇంతటి వైభవోపేతమైన, మహోత్కృష్టమైన సింహాసనమును అధిష్టించిన పరమేశ్వరికి నమస్కారము.
అటువంటి పంచబ్రహ్మలనే తన సింహాసనము గా చెసుకుని వైభవోపేతముగా "శ్రీమహారాజ్ని" గా జగాలను పరిపాలిస్తున్న లలితా పరాభట్టారిక ను చూచి వశిన్యాది వాగ్దేవతలు, అమ్మను "పంచబ్రహ్మాసన స్థితా" అని కీర్తించారు.
పరమాత్మ యొక్క పట్టపురాణియై, మణి ద్వీపము లో, మహాపద్మాటవిలో చింతామణులను కూర్చి తయారు చేయబడిన మణి మండపములో, పంచబ్రహ్మలనే తన ఆసనముగా చేసుకుని, సూర్యకోటి సమప్రభగా విరాజాల్లుతూ లోకాలను తన కడగంటి చూపుతో, మందస్మిత ముఖారవిందముతో, చల్లగా పాలిస్తోంది, శ్రీమాత.
అమ్మ కూర్చునే సింహసనానికి నాలుగు కాళ్ళు ఉంటాయి.  బ్రహ్మ ఆగ్నేయం వైపు ఉన్న కోడుగా, నైఋతి దిక్కులో ఉన్న కోడుగా శ్రీమహావిష్ణువు, రుద్రుడు వాయువ్యంలో కోడుగా, ఈశాన్యంలో ఉన్న కోడుగా ఈశానుడు/ఈశ్వరుడు ఉన్నారు. ఈ నాలుగు కోళ్ళను కలుపుతున్న పర్యంకము మీద సదాశివుడు పరుపుగా ఉన్నాడు. అందువలన ఈ సింహాసనము "శివాత్మకమైనది". పదహారేళ్ళ చిరుప్రాయపు రూపంలో మహాకామేశ్వరుడు కూర్చుని వుంటే, ఆయన ఎడమ తొడను తన స్థానం చేసుకుని కూర్చున్నది అర్థనారీశ్వరి అయిన "శ్రీమత్సింహాసనేశ్వరి". ఇటువంటి శివాత్మకమైన మహా సింహాసనము పైన శోభలీనుతూ తన భక్తులను అనుగ్రహిస్తోంది "పంచబ్రహ్మాసన స్థితా" గా లలితా పరాభట్టారిక.
పంచ బ్రహ్మలు శ్రీమాత యొక్క మంచం కోళ్ళు గా మారడం ఎందుకంటే అమ్మతో ఉపవాసం ఉండడానికి. అంటే, అమ్మకు అతి సమీపంలో వుండి అమ్మను సేవించుకోడానికి. సృష్టి చేసే బ్రహ్మ, స్థితి చేసి, పెంపు చేసే విష్ణువు, లయం చేసే శివుడు. ఈ మూడు కాక, తిరోధాన, అనుగ్రహము అనే పనులు కూడా చేస్తారు, ఈశానుడు, సదాశివుడు. తిరోధనము అంటే తను చేసిన సృష్టిని తనలోనే కలుపుకోవడం. అంటే, వున్నది లేనట్లుగా చేయడం. ఇది మాయ. ఈ మాయయే ఈశ్వరుడు. ఈయన మాయ పని చేస్తున్నంత కాలం పరమాత్మ దర్శనం అవ్వదు.  ఈ మాయను తప్పించి, అనుగ్రహ స్వరూపిణి అయిన అమ్మ, సదిశివుని ద్వారా తన సాధకులను తనలో ఐక్యం చేసుకుంటుంది "పంచబ్రహ్మాసన స్థితా" అయిన లలితా పరాభట్టారిక.
*అనుగ్రహానికి ప్రత్యక్ష రుపంగా ఉన్న అమ్మను పూజించేటప్పుడు 
ఓం పంచబ్రహ్మాసన స్థితాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు