గాయాలే కాలం
బోధించే కఠిన పాఠాలు..!
ముళ్ళ బాటలో
పాదానికి తగిలిన గాయం...
ఎడారిలో ఒంటెలా
ఆచితూచి అడుగులేయమంటుంది.
కంటికి తగిలిన గాయం...
నిప్పును నీరుగా భ్రమపడే
చకోర పక్షిలా మోసపోవద్దంటుంది
శిల్పాన్ని మలిచే
ఉలి దెబ్బలా చేతి గాయం...
చరిత్ర పుటల్లో చెరిగిపోని
సంతకంగా మనల్ని తీర్చిదిద్దుతుంది.
పెదవుల చెంత
తగిలిన గాయం...
మౌనపు మధురిమను
వెదజల్లే వేణువులా
మృదుభాషణను నేర్పిస్తుంది.
కానీ మమతల
గుండెకు తగిలిన గాయం...
చీకట్లను చీల్చే
జ్ఞానసూర్యుడిలా ఉదయిస్తుంది.
అరిషడ్వర్గాల
అంతాన్ని కోరుతూ
కరుణ అనే కవచంతో
ప్రశాంత జీవన వేదాంతాన్ని
బోధించే పరమగురువులు ఈ గాయాలే..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి