"మాకేది ఉగాది మాదంతా మనాది" - అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ-9640748497
మాకేది ఉగాది 
మాదంతా మనాది 
రాశీ ఫలాలు నమ్ముకుంటే
మేము రాశికి రాము
రంగానికి రాము
ధనికుడు మరింత ధనికుడుగా
పేదోడుమరింత నిరుపేదౌతుంటే
నాల్గింట మూడొంతులు పైబడి మోసకారులు
దగా మోసం కుట్ర కుతంత్రాన్నే
రాజ్యనీతిగా మలచుకుంటే
మాకేది ఉగాది 
మాదంతా మనాది 
చిన్న చిన్న మండల స్థాయిల్లో కూడా డీమార్ట్ మోర్ లాంటి స్టోర్స్ఏర్పాట్లతో 
ఉప్పులు పప్పులు కారుచౌకగా అమ్ముతుంటే చిన్నకిరాణాకొట్టులెలానడిపేది
ఆకలి చావడం తప్పా
మాకేది ఉగాది 
మాదంతా మనాది 
చేనేత వస్త్రాలకన్నా
మిల్లు వస్త్రాలు సరసమైన ధరలకే విక్రయిస్తుంటే
నేతన్నకు ఉరితాడే
బ్రతకలేక వల్లకాడే
మాకేది ఉగాది 
మాదంతా మనాది 
చిన్న పెద్ద నగరాల్లో  జ్యూవెలరీ షాపులు 
జాయలూకాస్ పెరల్స్ డైమండ్స్ అంటూ 
కార్పోరేట్ బంగారం దుకాణాలు తెరుస్తుంటే
ఇక కంసాలీలెలా బ్రతికేది?!
ఆకలిని జయించలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకోవడం తప్పా
మాకేది ఉగాది 
మాదంతా మనాది 
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు లేకా 
అర్హతగలనిరుద్యోగులు ప్రైవేటు విద్యా సంస్థలు పెడితే 
కన్నుకుట్టిన కార్పోరేట్ సంస్థలు 
హంగుహార్భాటాలతో ఇంటర్నేషనల్ స్కూల్లు తెరిస్తే
ఉన్న ప్రైవేటు స్కూల్లు మూతబడి రోడ్డున పడితే చిన్న కాన్వెంట్ స్కూల్ యాజమాన్యాలు ఎలా బ్రతికేది 
మాకేది ఉగాది 
మాదంతా మనాది 
యాంత్రిక వ్యవసాయంతో
అరకపశువులు ఉండి పని నైపుణ్యం గల వ్యవసాయం కార్మికులు 
పనికల్పించేనాథుడులేక ఉన్న పశువులను అమ్ముకొని ఉప్పరిపనికిపోతుంటే
మాకేది ఉగాది 
మాదంతా మనాది 
పెట్టుబడిదారులకనుసన్నల్లో ఏలికలు పాలనకొనసాగిస్తుంటే?!
ప్రజాస్వామ్యంకాస్త
నియంతృత్వమౌతుంటే?!
అమ్మబోతే అడవి
కొనబోతే కొరివి అన్నచందమాయే 
మా బ్రతుకులు 
మా కేది ఉగాది 
మాదంతా మనాది 
దగా పడ్డోళ్ళమంతా సోయి కొచ్చినం
ఇక చాలు ఈ అవమానాలు 
ముందొచ్చే శ్రీపరాభవంతో 
మా ప్రాభవానికి శ్రీకారం చుడదాము
ఇక మా బ్రతుకంతా ఉగాదే 
మాకు ఉండదులే ఏ మనాది
--------------------------------------

కామెంట్‌లు