అమ్మ లేని ఇల్లు చిమ్మ చీకటే : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
కాసేపు అమ్మతో మాట్లాడాలి 
నాకు మాటమాత్రమైన చెప్పకుండా నన్నిడిసిపోయింది
అమ్మా నేను ఏమన్నా బాధిస్తే
క్షమించు,
ఒక పొడవాటి కర్రచేతికిస్తాను
నన్ను నీకసితీరా కొట్టు, తిట్టూ
కానీ 
నువ్వెక్కడున్నా ఇంటికి రా అమ్మా !?

నువ్వు లేనిఇల్లంతా చిన్నపోయింది
మమ్మిడిసి నువ్వు ఏడికెళ్ళినవో
జాడైన ఎవరికి చెప్పకపోతివి
ఏ దూరతీరం నువ్వు పోయినవో
ఈపూటతిన్నవో !లేవో!?
నువ్వు ఇచ్చిన ఈ జన్మ
నువ్వు పెంచి పోషించిన అనువణువూ 
నిన్నే పరితపిస్తుందమ్మా!?

నిత్యం మా చుట్టూతే తిరిగే ఇసుర్రాయి గిరుక నువ్వు 
ఎందుకమ్మా నువ్వు మమ్మల్ని 
ఒంటరిగా వదిలేసిపోయావు

మా ఇంటికి పెద్ద దిక్కు నువ్వేగదనమ్మా నిన్నేమన్నాఅన్నారా
అన్నవదినలు 
సహనంలో భూతల్లివే  కదమ్మా
ఎదిగే మమ్మల్ని ఎటు కాకుండా చేసి
ఎటువైపువెళ్ళిపోయినావు
పసి వయసులోనే నాన్న కాలం చేస్తే
అన్నీ నువ్వై సాకినతల్లి

నువ్వు లేని ఇల్లు 
మాకు చిమ్మచీకటే
నువ్వు నడయాడిన నేల 
పుణ్య క్షేత్రమే మాకు 

ఏ పాపం చేసామని 
మమ్ము ఏకాకులను చేసావు
రా అమ్మా!? రా అమ్మా!? 
ఇకముందెప్పుడూ ఎవరూ ఏతప్పుచేయకుండా
నాదీ హామీ ...
రా అమ్మా రా...!?
(అమ్మ యాదిలో)

కామెంట్‌లు