ఆకాశంలో 'అమ్మ':- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
వెలుగు పంచిన భూమిలో
ఉదయం అస్తమించని సూర్యుడు
రాత్రి చీకటి భయాన్ని కనపడనీయని సుద్దము వాకిలి
ప్రపంచం గుప్పిట నేనో మరి
మూసిన నా పిడికిట విశ్వమో తేలనిచోట 
ఆకాశంలో సగం ఇంటా బయటా బోయవాని వేట పావురమే!

ఆమె
ననుగన్న అమ్మ నన్ను
నడిపించిన అక్క
గోరుముద్దలు తింటూ బొమ్మలెగిరేసిన నా రక్తం
ఎవరైనా పంజరం సంకెల పూర్తిగా తెగిపోని 
అందాల భరిణె

పోటీలో విశ్వసుందరి 
ఇంట్లో వంటింటి మహారాణి
ఒకరి ఆధిపత్యం,ఆజమాయిషి రాపిడి వత్తిడి తప్పని అవని

నా దేహానికి అక్షరం పూత వంటబట్టని క్షణంకన్నా
ముందే మాటలను చనుబాల రంగరించావు కదా 
నేడు మారిన 'అర్థం'లో 
ఆమె ఆదివారం కూడా 
సేదదీరలేని వంటింటి దీర్ఘయాత్ర
నాలో బోసినవ్వే ఆమె ప్రాణంగా బతకిన అమ్మ సుమ సువాసన
అడుగుల నా సవ్వడిలో బుడిబుడి వడివడి నడక 

ఒక కవినో వైద్యున్నో మరింకేమైనా కావచ్చు 
కానీ నా అంతరంగమంతా అహం పరుచుకున్న గగనమే!

అన్నీ నేర్పిన చోట చల్లని చెట్టు వీచే గాలి నునువెచ్చని స్పర్ష 
స్వార్థం,అహం 
బుసకొట్టని జీవిగా నన్ను భువిలో ఆడించలేదేమో 
సహజీవనంలో 
మట్టిమారినా మారంది మగ తత్వమే! 

బాధలు ముళ్ళున్న తోటల
పెంచిన చెట్టు పుష్పాలు ఫలాలు
నిటారుగా నిలిచే నీ ధైర్యమే 
విశ్వ రక్ష
దివారాత్రాల చాకిరి నీది

రేపటి మా బతుకు చెమట చుక్క నీవు
వందనం! తల్లీ నీకు వందనం!!

అమ్మ మనసున్న నేనుగాక
మరెవరు చెప్పగలరు నీ మనసుకవిత...

==================================

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేడు 8-3-26)
కామెంట్‌లు