ఇక్కడో చెట్టుండేది...: - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
మతిమరుపు నటన లేని మిత భాషి
యాది మరువని బుర్రల సున్నిత ఆలోచన 
పసితనం తీపి మాటల పరామర్శ తెరపై

కండ్లు మసకమసక 
వొళంతా నలిగిన దేహం ముడుతలు 
ఆశ్చర్యంలోనో దుఃఖంలోనో నొసలు ఎగిరిన ముఖం
ప్రశాంతత కరువైన యాతన

నాకంటే ముందే మా ఇంటిముందు 
పచ్చని చెట్టు నీడ పరిచింది 
అమ్మ చెప్పింది గోముగా 
ప్రకృతి స్నహం చిరునామా 

వెచ్చగ చల్లగ పూసి కాసిన వేళ్లు 
పచ్చగా బతికిన వాకిలిలో వీస్తున్న
గాలి పలకరింతల పులకింత 

నాతోనే సమకాలీన మైత్రి అలుముకున్న చేతులు
నింగీనేలను కలిపిన అలలతేలే పవనం
లాలించిన గుర్తు ఒకటి
వాలిన భుజాన తేనేటీగలా ఝుమ్మంది
గత జన్మల అమ్మ ఋణంలా...

తవ్విచూస్తే తెలిసింది నాలో అన్ని 
కిటికీలు తెరుచుకొన్న నిన్న
ఒక చెట్టు ఇక్కడే నాతో, 
ఆ నీడలో నేను చెట్టంతైన సంగతి...
ఇక్కడో చెట్టుండేదనే 
సుందర దృశ్యం నిజమైన బతుకు గీత!

నన్ను విడిచిన కాలం ఆనవాలుగా
 ఇక్కడో చిన్న మొక్కను నాటా
నా కళ్ళ అద్భుత మెరుపు
రెప్ప తెరిచిన ఆ చెట్టు బతుకు రంగుల ఇంద్రధనుస్సు 
ఆకాశం వంగిన తలతో చెట్టు ఆకులను 
నిమరడమే కొస మెరుపు కొత్త మొలక 


కామెంట్‌లు