సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 191 వ రోజు: -విరాట పర్వము పంచమాశ్వాసము
పంచమాశ్వాసం
అర్జునుడు దూరంగా ఉన్న సుయోధనుని చూడగానే " ఉత్తర కుమారా ! అడుగో సుయోధనుడు. రథం అటు పోనివ్వు " అన్నాడు. ఇంతలో కౌరవ సేనలోని ప్రముఖులైన వారు ఒక్కొక్కరు ఒక వెయ్యి రథములను తీసుకుని సుయోధనుని వైపు వెళ్ళారు. సుయోధనుడికి అర్జునినికి మధ్య సైన్యం మూడు నిలిచేయి.. చేత చిక్కిన గోగణములు అర్జునుడు తోలుకు పోవడం చూసి సుయోధనుడు నిట్టూర్చాడు.
ఉత్తరకుమారుడికి కురువీరులను పరిచయము చేయుట
అర్జునుడు కురు సేనను తేరి పార చూసాడు. " ఉత్తరకుమారా ! కురుసేనను చూడు. కాంచనమయ వేదిక కేతనముగా కలవాడు ద్రోణాచార్యుడు. ఎగురుతున్న సింహం తోక కేతనముగా కలవాడు అశ్వథ్థామ. బంగారు గోవును కేతనముగా కలిగిన వాడు కృపాచార్యుడు. తెల్లని కేతనమ కల వాడు కర్ణుడు. పాము పడగను కేతనముగా కలిగిన వాడు సుయోధనడు. తాటి చెట్టును కేతనముగా అలంకరించిన వాడు భీష్ముడు " అని తిరిగి " ఉత్తరకుమారా ! ఇప్పుడు మన రథం గురువు గారు ద్రోణాచార్యునకు ప్రదక్షిణగా పోనిమ్ము. ధనుర్విద్యలో అపార పాండిత్యము కలిగిన గురువు గారిని అవమానించ కూడదు. కనుక నేను ముందుగా సుయోధనునితో యుద్ధం చేస్తాను. సుయోధనుని రక్షించడానికి గురువు గారు వస్తారు అప్పుడు నేను ఆయనతో యుద్ధం చేస్తాను. గురు పుత్రుడు అశ్వథ్థామ శివుని వరం వలన పుట్టాడు. భీకరమైన యుద్ధం చేయగల సమర్ధుడు. ఆ ప్రక్కన ఉన్న వాడు కృపాచార్యుడు. నాకు చిన్న నాటి గురువు, ద్రోణ సమాన పరాక్రమవంతుడు. కనుక వారితో యుద్ధం వద్దు , రథం పక్కకు పోనివ్వు. అక్కడ సుయోధనుని మిత్రుడు కర్ణుడున్నాడు చూడు పరశురాముని శిష్యుడైన ఇతడు మహా పరాక్రమ శాలి నాకు సరి జోడు . ఇతనితో యుద్ధం చేయాలని నా కోరిక. నన్నుచూస్తే ఊరుకోడు. కనుక రథం అతనికి ముందుగా నిలిపి మేము చేయబోయే యుద్ధం చూడు. మా పెదనాన కుమారుడు సుయోధనుడు. అతడు అభిమానధనుడు కోపం ఎక్కువ, పరాక్రమ వంతుడు, అత్యంత దుష్టుడు, మా మీద ద్వేషం పెంచుకున్న వాడు. అతడు కనపడితే వదల వద్దు. అదుగో పితామహుడైన భీష్ముడు, అత్యంత పరాక్రమ వంతుడు, బుద్ధి కుశలత కలిగిన వాడు, పరశురామని ఎదిరించిన ధీశాలి, ఎన్నో శస్త్ర రహస్యాలు తెలిసిన వాడు. ఆయనకు కోపం రానివ్వ వద్దు. అలా చేస్తే నన్ను సుయోధనుని దగ్గరకు చేరనివ్వడు " అని కురు వీరులను ఉత్తరునికి పరచయం చేసాడు.
అశ్వథ్థామ ఎత్తి పొడుపు
ఆ సమయంలో అశ్వథ్థామ కర్ణుని చూసి " కర్ణా నిన్ను నీవు పొగుడు కున్నావు కదా! అర్జునుడు వచ్చాడు పోరాడు నీకు ఒక వేళ చేత కాకపోతే శకునితో మంతనాలు చెయ్యి. రారాజు ఈ యుద్ధ భారం నీ మీద పెట్టాడు కదా! తప్పుతుందా " అన్నాడు పరిహాసంగా. కర్ణుడు ఆగ్రహించి " నేను నీలా భీరువుని కాదు యుద్ధం, నుండి తప్పు కోవడానికి అర్జునుడే కాదు అతని తండ్రి ఇంద్రుడు వచ్చినా నేను ఎదిరించగల పరాక్రమ వంతుడను కావాలంటే చూడు " అన్నాడు. కర్ణుడు అలా మాట్లాడుతూ ఉండగానే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వథ్థామ సుయోధనునికి రక్షణగా నిలిచారు. వారి వెనుక బాహ్లిక సోమదత్తులు తమతమ సైన్యాలతో పోరాడారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు