ఈ ఘోర నరబలికి అంతమెప్పుడు..?: - కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
పవిత్రగ్రంథాల సూక్తులు మట్టిపాలై  ఎండిన పూలదండల్లా రాలిపోయే...

మతపెద్దల శాంతి మంత్రాలు  అరణ్యరోదనలై గాలిలో కలిసిపోయె...

రెక్కలు విరిగిన శాంతి కపోతాలు   తుఫానులో చిక్కుకున్న పక్షుల్లా తల్లడిల్లే..

శిథిలాల కుప్పల మధ్య జనారణ్యం వేటగాన్ని చూసి వణికే జింకలగుంపాయె

అరచేతిలో ప్రాణాలు గుండెల్లో వణుకు  
నీరులేని చెరువులో చేపలై కొట్టుమిట్టాడే...

చేయని నేరానికి ఏమిటి ఈ నరమేధం  బలిపీఠంపై మూగజీవాల హాహాకారాల్లా...

ఏమిటి ఈ దానవత్వం..?
మనిషిని మింగేస్తున్న మృత్యువులా...

క్రూరత్వపు చిమ్మచీకటి అంతమై  
శాంతి కాంతి కిరణాలుదయించే దెన్నడు.?

మానవత్వం మళ్ళీ ప్రాణం పోసుకుని  
ఒకే తల్లి కన్నబిడ్డల్లా కలిసే రోజెన్నడు..?

ప్రేమ కరుణ దయ జాలి క్షమ
క్షీర సాగరాలై ఉప్పొంగేదెన్నడు..? 

ఎడారిలో ఒయాసిస్సులా
శాంతి ఒప్పందాలు కుదిరేదెన్నడు..?

ఈ రక్తపాతపు భీకర మా"రణ"హోమం 
ఆగేదెన్నడు ప్రశాంతత పల్లవించే దెన్నడు.



కామెంట్‌లు