సుప్రభాత కవిత : - బృంద
గుండెల నిండా శ్వాస 
మనసు నిండా ఆశ 
కంటి నిండా కలలతో 
చాచిన చేతులకందిన కానుక 

ఆవరించిన  గాలికూడా 
ఆలకిస్తోంది గుండె సవ్వడి 
అటు ఇటూ తిరగక 
అదేపనిగా వద్దకొస్తూ....

అక్షరాలకు దొరకని 
అన్వయాలకు అందని 
అలౌకిక ఆనందపు 
అలల ఉయ్యాల ఊపేస్తూ

పెదవి దాటని మాటలతో 
పరవశించి హాయిగా 
పృథ్వి కి తెలిసేలా 
పెడుతున్న కేక వినేస్తూ....

కష్టాలు దాటుతూ వెడితే 
దొరికే ఇష్టమైన తీరంలా 
నెమ్మదిగా  నీరసం ఆవహిస్తుంటే 
చేతికి ఆకాశం అందినట్టు 

ఊరించే ఊహలే 
ఊపిరిగా చేసుకుని 
ప్రతిక్షణం ప్రగతినే 
పరమావధిగా  భావిస్తూ 

గుప్పెట్లో జారే ఇసుకలా 
కరుగుతున్న కాలపు 
జరుగుతున్న క్షణాలు 
ఒడిసి పట్టుకోమంటూ 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు