నిజాలు నిష్టూరాలు: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
నిజాన్ని దాచేస్తున్నారు —
వెలుగు భయంతో,
అబద్ధాల ముసుగులతో
అద్దాలన్నీ కప్పేస్తున్నారు.

నిజాన్ని బందిస్తున్నారు —
పదాల జైలులో పెట్టి,
నిజ స్వరాన్ని
గోడల మధ్య నొక్కేస్తున్నారు.

నిజాన్ని చూడొద్దంటున్నారు —
కళ్ళకు గంతలు కట్టి,
మాయామాటలతో
మార్గాలు మళ్లిస్తున్నారు.

నిజాన్ని చెప్పొద్దంటున్నారు —
సత్యస్వరాన్ని మూయించి,
న్యాయ దీపాన్ని
నిశ్శబ్దంలో ముంచేస్తున్నారు.

నిజాన్ని కొనేస్తున్నారు —
ధనపు తూకాలలో తూచి,
ధర్మాన్నికూడా
దుకాణపు సరుకుగా చేస్తున్నారు.

నిజాన్ని నొక్కేస్తున్నారు —
అబద్ధాల భారంతో
సత్యపు గుండెపై
రాళ్లు పెడుతున్నారు.

నిజం కొట్టుకుంటుంది —
నొక్కిన గుండెలోనూ
ధర్మం ధడకధడక మోగి
వెలుగై బయటపడుతుంది.

కాని —
నిజం దేవత, దాచినా దివ్య కాంతి దాగదు.
నిజం సూర్యుడు —
మబ్బులు కమ్మినా మరలా ఉదయించక మానడు.

చివరికి —
అబద్ధాల రాజ్యాలు కూలిపోతాయి,
మాయల మేడలు కరిగిపోతాయి;
కాల సింహాసనంపై కూర్చునేది — నిజం దేవతే.


కామెంట్‌లు