ఊగిసలాటలు… : - — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
ఉయ్యాల ఊగుచున్నది —
బాల్యపు బంగారు జ్ఞాపకాలు
బాలల నవ్వుల్లా మెల్లమెల్లగా.

చెట్టు ఊగుచున్నది —
గాలికి గీతాలాపన చేస్తూ
ఆకుల తాళాలతో ప్రకృతినృత్యంలా.

మనసు ఊగుచున్నది —
ఆశల అంచులపై ఆగిపోని అలలై
ఆనందం–ఆవేదనల నడుమా.

చెయ్యి ఊగుచున్నది —
స్నేహాల సందేశమై
సంతోషాల సవ్వడిలా.

త్రాసు ఊగుచున్నది —
న్యాయాన్యాయాల నడుమ
నిజాల నిటారుదారిలా.

తల ఊగుచున్నది —
అంగీకారాల అక్షరమై
అభిప్రాయాల ఆత్మస్వరంలా.

కాలం ఊగుచున్నది —
గతం–వర్తమానం మధ్య
జ్ఞాపకాల స్రవంతిలా.

కలలు ఊగుచున్నవి —
నిజాల నెరవేర్పు దారిలో
ఆశల ఊయలపై ఊపులా.

ఊగుతూ నేర్చుకునేదే జీవితము —
సమతుల్యం సొంతం చేసుకునేదే విజయము,
అలలతో ఆడుకునేదే ఆనందము…


కామెంట్‌లు