విజయ గీతికల వెనుక
వినిపించని నిట్టూర్పులెన్నో...
నా సాహస కృత్యాల వెనుక
దాగివున్న గాయాలెన్నో...
నా గెలుపుకు అసలైన ప్రేరణ
కిరీటాలు కావు... నేను చవిచూసిన
చేదు ఓటములే నా విజయశిఖరాలు.
విధి విసిరిన తీర్పును
మౌనంగా భరించిన వేళ...
కన్నీటి సముద్రాలను
కనురెప్పల వెనకే బంధించిన వేళ...
మానసిక వేదనను మౌనంగా
మింగి ఓర్పుకవచాన్ని ధరించాను
నిరాశ నిప్పుల్లో కాలిపోక
నిట్టూర్పుల సుడిగుండాన చిక్కుకోక
నిద్రలేని రాత్రుల్లో నాతలగడకు
నా కన్నీటితడిని అంకితం చేశాను.
ఒక్కోసారి అర్థరాత్రిలో
గాఢనిద్రలో పీడకలలు
నన్ను వెన్నాడుతుంటే
నేను నా కలలో చూశాను...
తీరం తాకి విరిగినా
మళ్ళీ పైకి లేచే అలలను...
నేను నా కలలో చూశాను...
వేల ఉలి దెబ్బలను
భరించి సుందరశిల్పంగా
మారిన శిలలను...
నేను నా కలలో విన్నాను ...
మత్స్యకారుల
వలలో చిక్కి ప్రాణాల కోసం
పోరాడే చేపల ఆక్రందనను....
అక్కడే పుట్టింది
నా దృఢ సంకల్పం...
పడిన ప్రతిసారి
బంతిలా తిరిగి పైకి ఎగరాలని...
లక్ష్యం వైపు రామబాణంలా
దూసుకు పోవాలని...
చీకటిని చీల్చే రవికిరణంలా
ప్రకాశించాలని వెలుగులు విరజిమ్మాలని..
ఓ నా మిత్రమా..!
ఒక పచ్చినిజాన్ని గ్రహించు...
జనన మరణాలు...
గెలుపు ఓటములు విధాత నిర్ణయాలని
పట్టుదలే ప్రతిభకు ప్రాణమని...
నిరంతర శ్రమే విజయానికి రాచబాటని...
కష్టేఫలియని కృషితో నాస్తి దుర్భిక్షమని...
ఓ మిత్రమా..! గుర్తుంచుకో
నా ఓటమి ఓర్పు నుండి
పుట్టిన ఈ గెలుపు ప్రభంజనమే...
ఈ లోకానికి నా శ్రమశక్తి శంఖారావమని..!
ఇంతకీ నేనెవరో తెలుసా..?
మొన్న నరేంద్ర మోడీ స్టేడియంలో
టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో
కివీస్ బౌలర్లపై వీరకిశోరంలా
విరుచుకుపడి 5 ఫోర్లు 8 సిక్స్ లతో
విజృంభించి 46 బంతుల్లో 89, మొత్తం
321 పరుగుల వరదను పారించి భారత్
జట్టు ఘనవిజయానికి పునాదిరాయినైన
కేరళ క్రికెట్ క్రీడా కేసరి సంజు శాంసన్ నేనే.
జయహో... జయహో...
ఓ టీమిండియా క్రీడాకారులారా...
ఓ భరతమాత ముద్దు బిడ్డలారా...
ఓ టి20 ప్రపంచ కప్ విశ్వవిజేతలారా...
ఓ కేరళ క్రికెట్ క్రీడా కేసరి సంజు శాంసన్...
జయహో... జయహో...
అందుకోండి...అందుకోండి
140 కోట్లమంది అభిమానుల ఆశిస్సులు...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి