చౌధరి రాధాకృష్ణకు ఉదయభాస్కర్ ఉగాది పురస్కారం.

 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, బహుముఖ ప్రజ్ఞాశాలి చౌధరి రాధాకృష్ణకు ' ఉదయభాస్కర్ సేవారత్న రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం లభించింది. శ్రీకాకుళం  నగరానికి చెందిన మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ ఆధ్వర్యంలో రాధాకృష్ణను ఈ అవార్డుకు ఎంపిక చేసారు. శ్రీకాకుళం కేంద్ర గ్రంథాలయం కళావేదికలో అకాడమీ వ్యవస్థాపకులు మణిపాత్రుని నాగేశ్వరరావు, అధ్యక్షులు భాగ్యలక్ష్మి, కార్యవర్గ సభ్యుల నేతృత్వంలో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి, జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి బలివాడ మల్లేశ్వరరావు చేతుల మీదుగా శాలువా , పూలమాల , జ్ఞాపిక,  కిరీటధారణలతో  ఉదయభాస్కర్ సేవారత్న రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారాన్ని చౌధరి రాధాకృష్ణ స్వీకరించారు. విద్య, సాహిత్య, పరిశోధన, సేవా రంగాల్లో విశిష్ట సేవలనందజేసి అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రశంసలు, అవార్డులు, సత్కారాలను రాధాకృష్ణ పొందియున్నారు.
హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే సైన్స్ క్లబ్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, శాస్త్రీయ దృక్పథం అలవరచడంలో విశేష కృషి చేసారు. జూనియర్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం జిల్లా సమన్వయాధికారిగా సేవలందజేసి సుమారు వంద పాఠశాలల్లో జె.ఆర్.సీ.గ్రూపులను ఏర్పాటుచేసి విద్యార్థుల్లో సేవా దృక్పథాన్ని కల్పించారు. ఈ కాలంలో  జె.ఆర్.సీ, వై.ఆర్.సీ విద్యార్థులు కోహిమా (నాగాలాండ్), తిరునల్వేలి (తమిళనాడు), బెంగళూరు, కురుక్షేత్ర (హర్యానా), భువనేశ్వర్, హైదరాబాద్ లలో జరిగిన జాతీయ సమైక్యతా శిబిరాల్లో రాధాకృష్ణ పాల్గొని, నాటి గవర్నర్ చేతుల మీదుగా బంగారు పూత పూసిన వెండి పతకం, ప్రశంసాపత్రాలతో పురస్కార సత్కారాలు అందుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ నెహ్రూ యువ కేంద్ర కు అనుబంధంగా నెలకొల్పిన జిల్లా యువజన సారధ్య సంఘం డైరెక్టర్ గా సేవలందించిన రాధాకృష్ణ సారవకోట సమితి లో సుమారు వంద యువజన సంఘాల ఏర్పాటుకు ప్రోత్సహించి వారిద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విశేష  సేవలనందించారు. అక్షరాస్యతా కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన అక్షర క్రాంతి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, వేలాది మంది నిరక్షరాస్యులను  అక్షరాస్యులుగా చేసారు. ఎ.పి.టి.ఎఫ్ వారి ఉపాధ్యాయ ప్రగతి పత్రిక సంపాదకులుగా, ఈ సంఘ సారవకోట సమితి కార్యదర్శిగా పనిచేసి ఉపాధ్యాయ లోకానికి ఎనలేని సేవలందించారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల సంఘం జాతీయ అధ్యక్షులుగా, అనేక సేవా సంస్థల్లో సభ్యునిగా విభిన్న రంగాల్లో విశిష్ట సేవలనందజేస్తున్న రాధాకృష్ణకు సేవారత్న అవార్డును ప్రదానం చేయడం సముచితమైనదని కొనియాడుతూ అవార్డు ప్రదాన సభలో వక్తలు ముక్తకంఠంతో పేర్కొన్నారు.
కామెంట్‌లు