సామెత -177: ఆకాశం మీద ఉమ్మేయాలని ఉమ్మితే గది ఆ ఉమ్మినోడి మీదే పడ్తుంది
****
"అవ్వా! గంత మంచి మడిషి మీద ఎన్నెన్ని అవాకులు చవాకులు పేలిండ్రు.గాయన గాబట్టి ఎవలి పాపాన ఆళ్ళే పోతరని నిబ్బరంగా ఉండబట్టిగని లేకుంటే ఎంత ఘోరం జరిగేది. కుళ్ళు కుచ్చితంతో మడుసులు గిట్ల దిగజారిపోతుండ్రేందవ్వా?"
"ఎవలి సంగతి శెల్లే? ఏమైంది? ఒక్క తీర్గ రంది జేత్తున్నవు?"
"శెప్త గని అవ్వా? మంచికి రోజుల్లెవ్వు. ఒకలికి మంచి పేరు వొత్తుందంటే బగ్గున రగిలి గాల్ల పర్వెట్ల తీయాలాని సూత్తుండ్రు. అయినగని గస్మంటోళ్ళు ఎన్నన్నా నిప్పుకు శెదలు పడ్తదా ఏంది? శివరాకరికి గీళ్ళ బుద్ధే బయిట పడుద్దని తెల్వదా ఏంది? గప్పుడాల్ల తల్కాయలు ఏడ బెట్టుకుంట్రో?"
అవును గని శెల్లె!మంచిని దాత్తే దాగేది గాదు పూల వాసన లెక్క పిడికిట్ల దాశినా,పెట్టెల దాశినా గది బయటికి తెలుత్తనే ఉంటది. గింతకీ గా పంతులోరి ఇష్యమేనా నువ్వు శెప్పబొయ్యేది?"
"అవునవ్వా! నీకెట్ల దెల్శింది?"
"నువ్వు గింత రంది వడ్తున్నవంటె గది గా పంతులోరి యిషయమని అర్తమైంది. ఎంత కచ్చె వుంటే మాత్తరం గట్ల బట్ట గాల్చి మీదేత్తరా? పాపం పాడుగాను! గిప్పుడు అస్లిషయం బయటికొచ్చె.గా పంతులోర్ని ఏదో శేద్దామంటే గవన్ని ఆళ్ళకే తలిగే."
"అవునవ్వా! గా పంతుల్కి ఆడివిల్లలు లేరని బల్లె ఆడపోర్లని కన్న బిడ్డల్లెక్క సూశేటోడు.ఊల్లె ఎవల్ని గల్శినా బడి ముచ్చెటి, పిల్లల సద్వుల ముచ్చెటి దప్ప ఇంకోటి రాక వొయ్యేది. ఆడివిల్లల్ని బల్లెకు పంపకపోతే ఇంటికొచ్చి గాల్ల జీయితాలు ఆగం జెయ్యొద్దు సదివిచ్చుండ్రని బతిలాడేటోడు,వొయ్యిలు, పెన్నులు లెవ్వంటె నేను కొనిత్తగని బడికి పంపుండ్రని శెప్పేటోడు."
"అవునవ్వా!గస్మంటి మంచోన్ని బట్కోని శెడ్డోడని ఇద్దరు ముగ్గురు ఆడ పొల్లగాండ్లకు ఊదుపొగేసి చెప్పిత్తె మిలిగిన పొల్లగాండ్లు ఊకుంటరా? గాళ్ళు ఎవలెవలు గట్ల జెప్పమన్నరో మొత్తం జెప్పిరి.తీగె లాగితే డొంక కదిల్నట్టు యిష్యం తెల్శి గట్ల జెప్పిచ్చినోళ్ళ ఇజ్జెత్ వొయ్యె!"
"గందుకే అంటరు శెల్లె! ఆకాశం మీద ఉమ్మేయాలని ఉమ్మితే గది గా ఉమ్మినోళ్ళ మీదే పడ్తుంది " అని గదిప్పుడు సుబూది అయ్యె."
అవునవ్వా! గీ సామెతలు ఊకె బుట్టలే.అనుబాల్నించి పుట్టినయ్. ఏమోలే అవ్వ గా సయిమంలో పంతులోరు అవుమాన పడి ఏమైన జేస్కుంటరో ఏమోనని మస్తు బయమైంది. గా పొల్లగాండ్ల తానకి బొయ్యి నిజం జెప్పుండ్రి.ఓ మంచి మడిషికి అన్నేలం జెయ్యొద్దు.గాయినకేమన్నయితే సచ్చేదాంక మన్సు శాంతి గుండద్రా అని జెప్పిన.ఇంగ గాళ్ళ ఏడ్పు ఏడ్పు గాదుపో! మొత్తానికి గాల్లే పంతులోర్ని రచ్చించుకుండ్రు."
అవును శెల్లె"ఆకాశం- ఉమ్మి "సామెత మతికిల బెట్కుంటేనన్న శెడ్డాలోచన్లు ఉన్నోళ్ళ బుద్ది జెరంతయిన మార్తది.
గదండీ సంగతి" ఆకాశం మీద ఉమ్మేయాలని ఉమ్మితే గది గా ఉమ్మినోళ్ళ మీదే పడ్తుంది " అంటే గిదే మరి.
ఎదుటోళ్ళ మంచితనం, గుండె ధైర్నం దెబ్బ తీయాలని సూత్తే, గట్ల జేసేటోళ్ళే బోల్తా పడ్తరు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి