సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత-168; ఆరు ఆవులున్నమ్మ మూడావులున్నమ్మ తానికి నెయ్యి అడగవోయినట్టు'
****
'అవ్వా! గీ లొల్లి నీ దనుక వొచ్చిందా? ఊల్లె అంత రెండు గురూపులైండ్రు.ఒక్క తీర్గ శెవులు కొరుక్కుంటున్నరు.
 అవునా శెల్లె. ఇంతకీ ఏం లొల్లి? ఎవలెవలు పెట్టుకుంటున్నరు?
 గదేనవ్వా! ఆరావుల అచ్చమ్మత్తోళ్ళకు మూడావుల ముత్తయ్య మావోళ్ళకు నడ్మ గిప్పుడు పచ్చి గడ్డేస్తే భగ్గుమంటున్నది.
 అయ్యో గట్లనా శెల్లె!:అచ్చమ్మత్త బుచ్చమ్మత్త మస్తు అతకాపతకం లెక్కనుండేటోళ్ళు గద! బుచ్చమ్మత్త గీ నడ్మల ఇంకో మూడు ఆవులు కొనాలె అచ్చమ్మత్తోళ్ళకు సరిదీటి గావాలె. గంద్కనే పైస పైస నోరుగట్కొని కూడేత్తున్న అంది.
గంత గనం నోరు గట్కోవడం ఎందుకో నాకర్తం కాలే శెల్లె. రేపు రేపు గా ఆవులే పిల్లలు జేత్తే పెరగకుండ వుండవా? గా మాటంటే అత్తకి కోపమొత్తదని ఊకున్న.
 'అయిన గని బుచ్చమ్మత్త బాగనే కూడ బెట్టింది శెల్లె.అత్త మామూల్ది గాదు యికమతుల పిట్ట.ముందు సూపు బాగనే ఉంది అత్తకి.
 ఓ అవ్వోవ్! గా ముందు సూపే అవ్వోళ్ళ కొంప ముంచింది.
 అయ్యో శెల్లే గట్లెట్ల జరిగింది
ఇంగో అవ్వా!జర శెవ వారిచ్చి ఇను. ఎవలితో అనబాకు.నా మీదొట్టె. గా అచ్చమ్మత్త బుచ్చమ్మత్తోళ్ళు డబ్బులు కూడబెట్టిన ముచ్చట ఇని ముత్తయ్య మావతో శెప్పిందట. 
 
అంజయ్య మావ ఏదో యాపారం జెయ్యాలని ముత్తయ్య ముత్తయ్య మావ తాన రెండు లచ్చలు అప్పు తీస్కొని గిప్పటికి యాడాదైందట. మన్లో మనకి ఎందుకులే అంటే ఎందుకులే అని లెక్క పత్రం రాయిచ్చుకోలేదంట. అగ్గో గిప్పుడు గదే తక్ లీబు అయ్యింది.
 డబ్బులు అడిగితే రేపిత్త మాపిత్త అన్నరట. ఇంగ గీ నడ్మల అసలు నీ తాన తీస్కున్నట్టు ఏమన్న పత్రం ఉందా? నువ్వియ్యలే నే తీసుకోలే.ఎవలికి జెప్పుకుంటవో జెప్పుకో పో అని ముఖం మీదనే తలుపులేస్కుండ్రంట. గోడు గోడున ఏడ్సుకుంట పంచాయతీ బెట్టించిండ్లు.గదీ సంగతవ్వా!
బలేటోళ్ళు శెల్లె! గట్ల శేత్తరా ఎవలైన గందుకే అన్నరు "ఆరావులున్నమ్మ మూడావులున్నమ్మ తానికి నెయ్యి అబగవోయినట్టు" అని.. గిప్పుడు నెయ్యేమో గని లచ్చలు అప్పు తీసుకుని అన్నాలం జెయ్యాలని సూత్తుండ్రు.ఎవలూకుంటరు శెల్లె.
అవునవ్వా!మన సర్పంచి రామయ్య తీర్మానం జెయ్య బోతుండ్రు సూద్దాం రా అవ్వా!"
"అగ్గో అవ్వా! అచ్చం మర్యాద రామన్న లెక్కనే పరీచ్చ బెట్టిండు సూశినవా అవ్వా!"
భలేగుంది శెల్లె పరీచ్చ" గా బుర్దల కాళ్ళు బెట్టి రమ్మనుడు. గాడ శెరో బకీటు నీళ్ళతో కడుక్కోమనుడు.
అవునవ్వా " అచ్చమ్మత్తను సూడు బకీటు నీళ్ళు ఒడవగొట్టింది.బుర్ద బోనేబోలేదు. ఇగ్గో సూశినవా బుచ్చమ్మత్త ఇగురం.ఒక్క శెంబెడు నీళ్ళతో సుబ్బరంగ కడుక్కుంది.
 అగ్గో సర్పంచి శెప్పనే శెప్పిండు.గట్ల మోసం జేసినందుకు రెండు లచ్చలకి వొడ్డీ ,మల్ల మోసం జేశినందుకు పైన పదేలు కట్టాలని శెప్పిండు. ఏం లాభం అందర్ల పరువు బాయె. ముందే గీ బుద్ధి ఉంటె ఎంత బాగుండు". అన్కుంట అవ్వ శెల్లె ఇంటి మొగం బట్టిండ్రు.
గదండీ సంగతి"ఆరావులున్నమ్మ మూడావులున్నమ్మ తానికి నెయ్యి అడగవోవుడు"అంటే గిదే మరి

కామెంట్‌లు