సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 విరాట పర్వము పంచమాశ్వాసము- 192 వ రోజు
అర్జునుని వీరవిహారం
అర్జునుడు గాండీవాన్ని ధరించి కురు సైన్యాలను నుజ్జు, నుజ్జు చేసాడు. కురు సైన్యం వజ్రవ్యూహంగా ఏర్పడి అర్జునిని ఎదిరించ సాగాయి. ఉత్తర కుమారుడు అర్జునిని పరాక్రమానికి పొంగి పోయి శ్లాఘించాడు. అర్జునుడు చెలరేగి యుద్ధం చేయసాగాడు. గాండీవం గుండ్రంగా తిప్పుతూ ఇరు వైపులా ఉన్న అమ్ముల పొది నుండి బాణాలు తీసి రెండు చేతులతో ఎడతెరిపి లేకుండా యుద్ధం చేస్తూ వజ్రవ్యూహాన్ని ఛేదించాడు. అర్జునిని ధాటికి గుర్రములు రథం విడిచి పారి పోతున్నాయి. రథికులు రథం నుండి కింద పడుతున్నారు.కింద పడ్డ వారిని విడిచి పెడుతూ ముందుకు సాగుతున్నాడు అర్జునుదు. ఒకసారి కనిపించిన వారు మరలా కనిపించడం లేదు. ఉత్తరకుమారుని జాగ్రత్తగా కాపాడుకుంటూ యుద్ధం చేస్తున్నాడు. అర్జునినితో యుద్ధం చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. అప్రతిహతంగా సైన్యాల మధ్య అర్జునిని ధాటికి సైన్యాలు నిస్తేజం ఔతున్నాయి.ద్రోణాదులపై శరసంధానం చేసాడు, కర్ణుని రథసారథిని బాణంతో కొట్టాడు, అతని రథాన్ని విరగకొట్టాడు, విల్లును విరిచాడు, దేవదత్తాన్ని పూరించాడు. కర్ణుని అవస్థ చూసి కురు సైన్యాలు భీష్ముని వెనక చేరారు. భీష్ముడు వారిని ఉత్సాహ పరిచాడు. కృపాచార్యుడు, ద్రోణుడు, వికర్ణుడు సుయోధనునికి రక్షణ కవచంగా నిలిచారు.
అర్జునుడు కర్ణునితో తలపడుట
అర్జునుడు ఉత్తర కుమారునితో " ఉత్తర కుమారా! కొంచం సేపు రధాన్ని ఆపు. మనముందు మొహరించిన సైన్యాలను చూడు. కర్ణుని ముందు రధాన్ని ఆపు, వాడి పొగరు అణిస్తే కాని సుయోధనుని పొగరు అణగదు " అన్నాడు. ఉత్తర కుమారుడు రథాన్ని కర్ణుని ముందుకు పోనిచ్చాడు. కర్ణుని వైపు శరవేగంతో దూసుకు వెళుతున్న అర్జునుని చూసి చిత్రాంగధుడు, చిత్రరధుడు, సంగ్రామ చిత్తుడు, వివిశంతి, దుష్ప్రహుడు, చిత్రసేనుడు, దుర్ముఖుడు, దుర్జయుడు, వికర్ణుడు, శంత్రుంతపుడు, దుశ్శాసనుడు మొదలైన కురు కుమారులు అర్జునినిపై ఒక్క సారిగా ఉరికారు. ముందుగా వికర్ణుని విల్లు విరిచాడు వికర్ణుడు పారిపోయాడు. తరువాత శత్రుంతపుని చంపాడు. దానితో కురు కుమారులు పారి పోయారు. తరువాత కర్ణుని తమ్ముడు సంగ్రామ జిత్తుడు అర్జునిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు ఒక బల్లెంతో వాడిని పొడిచి చంపాడు. కర్ణుడు కోపంతో అర్జునినిపై బాణం వేసాడు. ఈ విధంగా అర్జునుడు కర్ణుడు తలపడ్డారు. కౌరవ సేనంతా యుద్ధం చేయడం ఆపి వీరిని చూస్తూ నిలబడ్డారు. అర్జునుడు కర్ణుని చూసి " కర్ణా ! నిండు సభలో నాకు ఎదురు లేదని పలికావు ఇదిగో యుద్ధం వచ్చింది సభలలో ప్రగల్భాలు పలకడం కాదు ఇప్పుడు నీ ప్రతాపం చూపు నీ తమ్ముని చావు కనులార చూసావు కదా ఇంత దాకా వచ్చి పారిపోవడానికి ప్రయత్నించ వద్దు. ద్రౌపదిని నిండు సభలో అవమానించి నందుకు ఫలితం అనుభవించాలి కదా. ఆ రోజు ధర్మరాజు మాటకు కట్టుబడి నిన్ను వదిలాను ఇప్పుడు చిక్కావు తప్పించుకోలేవు " అన్నాడు. కర్ణుడు " అర్జునా! అన్నగారి మీద పెట్టి తప్పుకుంటావా ! అంత వీరుడివా? ఎలాగైనా అడవులలో తిరిగితే రాజ్యం వస్తుందిలే అని అడవులలో తిరిగిన పిరికి పందలు మీకు ధైర్యసాహసాలు ఉన్నాయా? నీవు ఏమేమో చేసావని అన్నారు, నిన్ను చూస్తుంటే అవి అన్నీ అసత్యాలు అనిపిస్తున్నాయి " అంటూ అర్జునిపై బాణాలు సంధించాడు. అర్జునుడు బదులుగా బాణాలతో సమాధానం ఇస్తున్నాడు. కర్ణుని విల్లు విరగ కొట్టాడు. కర్ణుడు శక్తి బాణాలను అర్జునినిపై ప్రయోగించాడు. అర్జునుడు దానిని తుత్తునియలు చేసాడు. కర్ణుడు విల్లు తీసుకుని ఆర్జునిని సారథిపై ఆరు బాణాలు అర్జునినిపై పది బాణాలు వదిలాడు. అర్జునుడు కోపించి కర్ణునిపై బల్లెములు వర్షంలా కురిపించాడు. కర్ణుడు వాటి ధాటికి ఆగలేక పారి పోయాడు. అర్జునుడు విజయ చిహ్నంగా దేవదత్తం పూరించాడు. అర్జునుడు " ఉత్తరకుమారా! కురుసేనలో ముఖ్య వీరుడు కర్ణుడు పారి పోయాడు. ఇక మనకు ఎదురు నిలిచేది ద్రోణాచార్యుఇలు మాత్రమే " అంటూ కురు సేనను చూసాడు. ఉత్తరకుమారుడు అర్జునినితో " అర్జునా ! నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం, భయం, విహ్వల భావం కలుగుతున్నాయి. నీ ధైర్యం, నీ శౌర్యం చూస్తుంటే నాకు భయం కలుగుతంది. నా మనసు వశం తప్పుతుంది, కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి రథం నడప శక్యం కాకున్నది. ఇలాంటి యుద్ధం నేనిది వరకు చూడ లేదు. మనసు పరవశించి పోతుంది " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు