హనుమంతుడి రామాయణం!: - - యామిజాల జగదీశ్
 రామకథను పూర్తి చేసిన తర్వాత, వాల్మీకి మహర్షి ఆనందంతో పరవశించారు. తను రాసిన శ్రీరామచంద్రుడి కథ ఆదికావ్యమై ప్రపంచమంతటా ఖ్యాతి గడుస్తుంది అనుకున్నారు వాల్మీకి.  రామాయణం ఉన్నంత కాలమూ తన పేరుకూడా అందరి నోటా నానుతుందని  ఆయన భావించారు. రాముని తలచుకున్న వారు తప్పకుండా తనను కూడా గుర్తు పెట్టుకుంటారని ఆయన సంతోషించారు.
మహర్షి నారదుడు మాత్రం ఏ సంకోచమూ లేకుండా దానిలోని మంచి చెడులను చెప్పగలడని భావించిన వాల్మీకి, రామాయణాన్ని చదివి త్రిలోక సంచారి కోసం వెతికాడు. వాల్మీకి రాసిన మొత్తం 24,000 శ్లోకాలను నారదుడు చదివాడు. 
"మీరు రాసిన రామాయణం బాగుంది. అయితే, హనుమంతుడు రాసిన రామకాండ దీనికంటే చాలా ఉత్తమమైనది," అని నారదుడు నిస్సంకోచంగా వాల్మీకితో అన్నాడు.
ఈ మాట వాల్మీకికి దిగ్భ్రాంతి కలిగించింది. 
తన రామాయణంతో మరో రామాయణం పోటీ పడితే, ఆ రెండింటిలో ఏది గొప్పదనే దానిపై వాదన జరుగుతుంది. కాబట్టి వాల్మీకి హనుమంతుడు రాసిన రామాయణం చూడాలనుకుంటున్నారు. దాని కోసం వెతికాడు. దానిని కనుగొని చదవడం అవసరమని భావించాడు. 
ఒక అరటి తోటలో, వాల్మీకి ఏడు పెద్ద ఆకులపై హనుమంతుడు రాసిన రామాయణాన్ని చూశాడు. 
ఎలాంటి సాహిత్య లేదా వ్యాకరణ దోషాలు లేకుండా, అందమైన లయతో ఉన్న ఆ రామాయణం వాల్మీకిని మంత్రముగ్ధుడిని చేసింది. 
వాల్మీకికి తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి. వాల్మీకి కన్నీళ్ళు చూసి
"ఏమిటి, ఏమైనా తప్పు ఉందా? మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?" అని హనుమంతుడు అడిగాడు.
"కాదు, మీరు రాసిన రామాయణం చాలా బాగుంది," అన్నారు వాల్మీకి.
"అటువంటప్పుడు మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?" అని అడిగాడు హనుమంతుడు.
"మీరు రాసిన రామాయణాన్ని చదివిన వారెవరూ, ఆ తర్వాత నేను రాసిన వాల్మీకి రామాయణాన్ని చదవరు. అందుకే నేను ఆందోళన చెందుతున్నాను," అన్నారు వాల్మీకి.
ఇది విన్న హనుమంతుడు "ఇకపై నా రామాయణాన్ని ఎవరూ చదవలేరు," అని చెబుతూ, తను రామాయణం రాసి ఉన్న ఆ ఏడు పత్రాలను చించివేశాడు.
ఈ మాటకు వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోయారు. ఆయన హనుమంతుడిని ఎందుకు ఇలా చేశావని అడిగారు.
అప్పుడు హనుమంతుడు "రాముడిని నా హృదయంలో నిలుపుకోవడానికే నేను రామాయణాన్ని రచించాను. కానీ నేను రచించిన రామాయణం లేకపోయినా, నా రాముడు నన్ను విడిచిపెట్టడు. రాముడి నామ జపం ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది. మీ నామం ఈ లోకంలో శాశ్వతంగా నిలిచిపోవాలనే కోరికతో మీరు రామాయణాన్ని రచించారు. అందుకోసం, మీ రామాయణం చెక్కుచెదరకుండా ఉండాలి. కనుక, నేను రచించిన రామాయణం లేకపోయినంత మాత్రాన ఎవరికీ నష్టం లేదు" అని అన్నాడు.
ఏ విధమైన ప్రయోజనాన్ని ఆశించకుండా, రాముడి పట్ల భక్తితో, గొప్ప కావ్య శైలిలో రాయడం వల్లే హనుమద్ రామాయణం శ్రేష్ఠమైనదని వాల్మీకి గ్రహించారు.
========================================================
(మూలం తమిళం. విషయం బాగుందని నాకొచ్చిన తెలుగులో అనువదించాను.)

కామెంట్‌లు