ఆమె ఒక పున్నమి వెన్నెల..!: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
ఆమె అగ్నికి ప్రతిరూపం
ఆమె ఒక అనురాగ దీపం
ఆమె ఒక అమృతభాండం
ఆమె ఒక అవకాశం ఒక ఆకాశం..!

కన్నీటి బిందువుల్లో
కాంతిని దాచుకున్నది ఆమె...
కరిగిన గుండెలో
గర్జనను వినిపిస్తున్నది ఆమె...!

వివక్షల వడగాల్పుల్లో
వాడని వృక్షమై నిలిచిందామె...
మానభంగాల మేఘాల్లో
మెరుపై మెరుస్తుంది ఆమె...!

వీరవిజయ కాంతుల వేదికలపై
వెలుగువీణగా నినదించే సుస్వరంఆమె..

త్యాగాల అనురాగాల జాబిల్లి ఆమె...
నీడనిచ్చే చల్లని తల్లి కల్పవల్లి ఆమె...
జీవజలధారలుగా గలగలపారే గంగఆమె..

ఆమె అడుగుల సవ్వడికి
నేల పునీతమౌతుంది
ఆమె నవ్వులపువ్వులు రువ్వితే
ఉషోదయం ఉదయిస్తుంది..!

బండరాళ్లవంటి బాధల్ని
బంగారు మెట్లు చేసి
భవిష్యత్తు గగనంలో
విజయపతాకం ఎగురవేసేది ఆమె..!

ఆమె శక్తి స్వరూపిణి
సహన శిఖరాన్ని తాకే శిఖామణి...
ఆమె ప్రేమమూర్తి
ప్రపంచానికే ఒక ప్రాణప్రదాత...!

అమ్మగా ఆకాశం...
అక్కగా ఆశ్రయం...
భార్యగా భరోసా...
సఖిగా సత్యసంధాత ఆమె..!

అవమానాల
అగ్నిగుండం దాటిన
మహోన్నత శక్తి...మహిళ..!

చరిత్రను రాసేది ఆమె చేతి కలం
భవితను మలిచేది ఆమె గుండె ధైర్యం..

తనను అణగదొక్కిన అడుగులనే
ఒక్కొక్కటి పేర్చి పేర్చి మెట్లుగా మార్చి
ఆకాశపుటంచులపై జెండా నాటేది ఆమె..!

వేయి వేదనల రాళ్లరాగాలపైన
విజయవీణను వాయించిన
వీరనారి ఆమె..!
కన్నీటి సముద్రాన్నే
కిరీటంగా ధరించిన కీర్తిశిఖరం ఆమె..!

అణచివేతల అగ్నిపర్వతాన్ని
అవకాశాల ఆకాశదీపంగా
మలిచిన మహా ప్రతిభాశాలి ఆమె..!

సృష్టికి శిరోమణిగా...
సమానత్వపు సూర్యోదయంగా
యుగయుగాల్ని యజ్ఞవేదికగా మార్చే
ఓ నవయుగనాయకీ నీకు వందనం..!

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం 
సందర్భంగా మహిళామూర్తులకు
శుభాకాంక్షలు)



కామెంట్‌లు