సుప్రభాత కవిత : - బృంద
ప్రత్యూష సమయాన 
ప్రవహించు నీటిలో 
ప్రతిబింబించు  నింగిని 
ప్రసూనములు  తాకేనేమో!

నింగి తన నీలము 
నీట తాకిన సుమములకలది 
నుదుట చుంబించి 
నిలిచి చూచుచున్నదేమో!

అలజడులు లేని బ్రతుకున 
అడుగడుగునా ఆనందమే!
అందుకొను అంతరంగమున 
అణువణువూ  సంతోషమే!

పాలమబ్బుల నీడలోన 
పచ్చిక బయళ్ళ లోన 
పరుగులిడు మనసున 
ప్రతి క్షణమూ ప్రమోదమే!

కనులు కన్న ప్రతి కలా 
కనుల ముందు నిలవదు
కళ్లు మూసి ఊహిస్తే 
కదిలి రాదా కాశ్మీరమే!

సుఖమైనా దుఃఖమైనా 
ప్రేమ అయినా పగ అయినా 
పెంచుకుంటే పెరిగేవే!
తుంచుకుంటే తరిగేవే!

మనసు మందిరముగా 
మలచుకోవాలని 
మమత మాయక ఉంచి 
మనిషిగా బ్రతికే మార్గం చూపే.....

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు