సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -159: - ఆకలిగొన్నమ్మ ఎంగిలికి రోయదు

*****
 అవ్వా! గా కాంతయ్య కోడలి సంగతి ఎర్కయిందా?
ఏమైంది శెల్లే? గీ నడ్మల పొల్లకి ఆరోగ్గెం బావుంటల్లేదని   పట్నంల దవాఖాన్లు తిర్గుతుండ్రని యిన్న.
 అవ్వో! నీ శెవ్విటు బడేయ్! నీకో యిష్యం జెప్పాలె.ఊరు ఊరంత కోడై కూత్తుంది గని బజాప్తా అనే దయిర్నం ఎవ్వులికి లేదు."
 ఏంది శెల్లె! ఏమైంది? ముచ్చెట చెప్పనీకె గింత అదురుకుంటున్నవ్?
 అవ్ మళ్ల. గా కాంతయ్య సన్న శిన్నోడు కాదు. పరమ ఉక్కుష్టుడు,రవుడీ,గూండా.వామ్మో! ఎవలన్న యిని గాడికి శెప్పిండ్రో ఇంగేమన్నుందా అవ్వా! మనకెందుకొచ్చిందిలే అన్కోవచ్చు గని గా పొల్లని తల్సుకుంటెనే గుండె కలికలి అయితాంది.ఎన్నాళ్ళ పొల్ల? ఈడేరకముందే  దాని అయ్యమ్మ లగ్గం జేసిండ్రు. వొంచిన నడుమెత్తకుండ ఇంటెడు పన్జేసేది.
అవును శెల్లె! గాడి పేరెత్తితేనే గడగడలాడుతుండ్రు.లాగులు సుత తడ్పుకుంటుండ్రంట.గా కిరాతకుడు ఏమన్న జేశిండా ఏంది?గిప్పుడు గా పొల్లకేమైంది శెల్లే? ఇంకా ఆరోగ్గెం బాగ్గాలేదా?
గదే అవ్వా! కాంతయ్య కొడుకు అయ్యని మించిన లఫంగి తెల్సుగద!గస్మంటోడికి యాడికో బొయ్యి గీ పొల్లని బట్కొచ్చి గానికిచ్చి లగ్గం జేశిండు.ఇంట్లె దాన్ని ఓ పనిమనిషి లెక్కనే గని ఇంటి కోడల్లెక్క ఏనాడు సూల్లేదు.
రెండు మూడు త్యేపల కడుపొత్తే ఆడపొల్లని తెల్వంగనే కడుపులు తీయిచ్చిండ్రు.గిప్పుడు గా పొల్ల పిల్లల సంచి దెబ్బతిన్నదని శెప్పిండ్రంట. గా కానించి అవ్వా! దానికి కూడు బెట్టడం దండగని కడ్పు మాడుత్తుండ్రంట. తినే వొయసు పొల్లాయె. ఆకలికి అల్లాడి పోతుంది... గీ నడ్మల ఏదో లాగ శేత్తుందని ఊల్లె అనుకుంటుండ్రు అవ్వా!"
 అయ్యో!పాపం! పొల్లకి ఎంత కట్టమొచ్చింది!ఎట్లనో అంటే ఏం జేత్తుంది శెల్లే!
 "ఎవలన్న పిల్లల శేతిల్లో తినేయుంటే ఎంగిలిమంగలం లేకుండ గుంజుకొని తింటుందంట అవ్వా! అందరూ పిచ్చి బట్టిందని అంటుండ్రంట."
గందుకే గా తొవ్వ పొంటి పోవాల్నంటె శిన్న పొల్లగాండ్లు గజ్జుమంటుండ్రు.పెద్ద పొల్లగాండ్లల్ల ఉచ్చిలోల్లు కొందరు ఎంగిలి జేసి ఇగ్గో తినమని ఆశ బెడ్తుండ్రంట.
 అయ్యో శెల్లే! గా పొల్లకి ఎంత కట్టమొచ్చింది."ఆకలి గొన్నమ్మ ఎంగిలికి రోయదు" అంటే గిదే మరి.
 "కొంతమందిరి ఆకలికి అస్సలాగరు.ఇంకొంత మందిరి ఆకలాకలని అయినోళ్ళు తింటుంటే కంచంల ఏమున్నా ఎంగిలని సుత సూడకుండ తింటరు శెల్లే!
 "గస్మంటోళ్ళ గురించే గీ సామెత పుట్టింది.గని గా పొల్లని తల్సుకుంటె మన్సు ఎట్టెట్టనో అయితుంది. ఏదో ఒకటి శెయ్యాలె శెల్లే! ముందుగాల పొల్లని గా యమ కూపంల నుంచి బయిట బడేయ్యాలే. ఏదో రకంగా దాన్ని రచ్చించాలె."
అవునవ్వా! నేను సుత తోడుగుంట". అంటున్న శెల్లె మాటల్ని యిన్కుంట ఆలోచన్ల బడింది అవ్వ.
 గీ దునియాలో గిస్మంటివి జూసినప్పుడు,ఇన్నప్పుడు తెల్సినప్పుడు మనసు దుఃఖంతో నిండిపోద్ది. ఏం జెయ్యలేని అశక్తతత నిలువునా వొణికి పోయేలా చేస్తుంది.ధైర్యవంతుల్ని కదిలించి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన కలిగిస్తుంది.
గదండీ సంగతి! "ఆకలిగొన్నమ్మ ఎంగిలికి రోయదు" అంటే గిదే మరి.ఆలోచిద్దాం.పరిష్కారం చూద్దాం. మనవంతు చేయగల్గిన మంచి / సాయం చేద్దాం.
కామెంట్‌లు