విజ్ఞాన విహార యాత్రలో ప్రభుత్వ పాఠశాల పిల్లలు

 --జింకల, ఉజ్వల పార్కులతో పాటు మానేరు డ్యాం సందర్శన
పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఆంగ్ల మాధ్యమ ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలు సోమవారం విజ్ఞాన, విహారయాత్రకు వెళ్లారు.  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాఠశాలకు చెందిన 46 మంది బాలబాలికలతో పాటు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులతో కలిసి జింకల పార్క్, ఉజ్వల పార్క్, తీగల వంతెన, మానేరు డ్యాం వంటి ప్రధానమైన పలు ప్రదేశాలను సందర్శించారు. పిల్లలు ఉజ్వల పార్కులోని అందమైన పూదోటలను అక్కడి ప్రకృతి అందాలను చూసి ఆనందించారు. పచ్చని చెట్ల చల్లదనంలో వారు సేద తీరారు. అంత్యాక్షరితో పలు రకాలైన ఆటలు ఆడారు. పార్కులోని అందమైన ప్రదేశాలను చూసి ఆనందంతో గంతులు వేశారు. జింకల పార్క్ లో పలు రకాలైన జంతువులు, పక్షులను చూసి సంబరపడ్డారు. డీర్ పార్కులో  జింకలు, ఈము పక్షి మిక్కిలి ఆకర్షణగా నిలిచింది. పాఠ్యపుస్తకాల్లో తప్ప ఎప్పుడూ ఇలాంటి వాటిని  చూడని పాఠశాల పిల్లలు పార్కులో వాటిని ప్రత్యక్షంగా చూసి ఆనందంతో ఉప్పొంగి పోయారు. అక్కడి పక్షులు, జంతువులను చూసి సంతోషపడ్డారు. కొత్తగా నిర్మించిన తీగల వంతెనను పరిశీలిస్తూ దానిపై నడిచారు. అక్కడి అద్భుత దృశ్యాలను చూసి పిల్లలు గంతులు వేశారు. తర్వాత మానేరు డ్యాం దాని పరిసర ప్రాంతాలను సందర్శించారు. డ్యామ్ నీటిలో బోటింగ్ చేస్తూ  కేరింతలు కొట్టారు. రోజంతా కొత్త ప్రదేశాల్లో తిరుగుతూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ పిల్లలందరూ మిక్కిలి సంతోషపడ్డారు.  ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు బండారి స్రవంతి, గోపిశెట్టి సుప్రియ, బండారి సరిత, పిల్లల తల్లిదండ్రులు ధరణి మణికంఠ, పైడిపల్లి అనూష, అనవేన రమాదేవి, పిటిఎస్ పైడిపల్లి లింగయ్య, విజయలక్ష్మి, ధరణి రజని, కొత్తపల్లి విజయలక్ష్మి, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు