సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము- 214. వ రోజు
ధర్మరాజు కౌరవులకు పంపిన సందేశం
మా తండ్రి దృతరాష్ట్రుడు సభలో ఉండగా " అనఘా! శంతనుని రాజ్యాన్ని కాపాడుతున్న నీవు మమ్మునాదరించి చిన్న వయస్సులోనే మారాజ్య భాగాన్ని మాకిచ్చి ఆదరించావు. అలాగే ఇప్పుడు మాకు సంధి చేసి సకల ప్రజానీకాన్ని రక్షించి రాజ్యాన్ని అధర్మం నుండి కాపాడమని చెప్పు. అలా చేస్తే బ్రాహ్మణులు, రాజులు సంతోషిస్తారని చెప్పు అలాగే తాత భీష్మునితో పాండవులు ఇప్పటికీ శాంతి కాముకులని చెప్పు. యుద్ధం తలపెట్టరని చెప్పు. సుయోధనునితో మేము అత్యంత బలవంతులమైనా మమ్ములను రాజ్యం నుండి వెళ్ళగొట్టిన నీ వెర్రి తనం, అడవులలూ వెన్నంటి వచ్చి మమ్ము కష్టపెట్టిన నీ దురుసుతనం, నిండు సభలో ద్రౌపదిని అవమానించిన నీ తులువతనం ధర్మరాజు సహించాడు అని చెప్పు. అతనిని అతని సోదరులను యుద్ధభూమిలో మరణించ వలదని చెప్పు, పరుల సొమ్ముకు ఆశించక మా రాజ్యభాగం మాకిచ్చి క్షేమంగా ఉండమని చెప్పు, యుద్ధానికి దూరంగా ఉండటం వారికే మేలని చెప్పు, సుయోధనునికి ఎవరూ చెప్పేవారు లేక నేను పెద్ద వాడిని కనుక చెప్తున్నాను, మావైపు ఉన్న ధర్మం అతని వైపు ఉన్న అధికబలాన్ని మహా వీరులను హరించగలదని చెప్పు, శ్రీకృష్ణుడు మా పక్షంలో ఉన్నందున మేము జయించగలమని చెప్పు. నా మాట మన్నించి యుద్ధానికి దూరంగా ఉండి అందరినీ కాపాడమని చెప్పు. ఎవరి రాజ్యం వారు చేస్తూ సఖ్యంగా సుఖంగా ఊందామని చెప్పానని చెప్పు, మాకు అర్ధరాజ్యం ఇవ్వ లేకున్న కుశస్థలి, వృక్షస్థలి, వాసంతి వారణావతం ఇచ్చి యుద్ధాన్ని నివారించిన బంధు మిత్రులు క్షేమంగా ఉండగలరని చెప్పు. ఇందు వలన కురు, పాంచాల, మత్స్య, యాదవ, వృష్టి రాజులు పరస్పరం సఖ్యంగా ఉండగలరని చెప్పు. సంజయుడు " ధర్మజా! మీరు ఆనతి ఇచ్చిన ప్రకారం చేస్తాను. మీ తండ్రి గారికి, మీకు, మీ సోదరులకు, వాసు దేవునికి ప్రియంకలిగేలా చేస్తానని విశ్వసిస్తున్నాను " అన్నాడు. అర్జునుడు " మిత్రమా! నీవు నాకు బాల్య మిత్రుడవు. నీ మంచితనం మాకు తెలుసు. ఆ రోజు ధర్మరాజు దయాగుణం అనే అంకుశంతో భీముని ఆపాడు. ఈ రోజు అదే జరుగుతుంది. ఇక సుయోధనునికి విచారమెందుకు వెళ్ళిరా " అన్నాడు. సంజయుడు అందరి వద్ద శలవు తీసుకుని హస్తినకు బయలుదేరాడు.
*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము సమాప్తం *
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు