విత్ లవ్ టు మి: - డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 నన్ను నేను వెతుక్కుంటున్నా
పారేసుకున్న చోటనే.
వెళ్ళిపోతున్న కాలాల అంచున
నన్ను నేను చూసుకున్నా.
నన్నొదిలి వెళ్ళిపోయిన
ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నా.
ప్రేమకు కానరాని మనసుల
మూలాలను అర్థం చేసుకుంటున్నా.
ఋతువుల ఋజువులను
సాక్ష్యాల సమీక్షలతో
సంధి చేసుకున్నా.
కారణాల కక్ష్యలను దాటుకొని
గమ్యాన్ని వెతుకుతున్నా.
ఎదురుచూస్తున్న కళ్ళకు
మస్తిష్కపు ఆజ్ఞలను ఆపేస్తున్నా.
అరుణోదయపు కాంతుల్లో
నన్ను నేను దాచుకున్నా.
చెట్టు మూలాన్ని విత్తనంలో
నిక్షిప్తం చేసిన ప్రకృతిని‌ ప్రేమిస్తున్నా.
పరిణత శోకంలోని సాంద్రతను
పరిస్థితుల నేపథ్యంలో అనుభవిస్తున్నా.
నిశ్శబ్దంలోని శబ్దాన్ని నిర్నిద్రాగానం
చేస్తూ వింటున్నా.
కామెంట్‌లు