ఇంటి పేరుతో నాకొక పాఠం: - - యామిజాల జగదీశ్

 ఇంటి పేర్లంటే ఒకింత ఆసక్తి ఎక్కువ. ఆ నోటా ఈ నోటా కొడుకుల, కూతురు, నక్క, మామిడి, పిల్లి, దొంగ...ఇలా రకరకాల ఇళ్ళ పేర్లు వింటుంటే విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఆ పేర్లు ఎలా ఇంటి పేర్లయ్యాయో తెలుసుకోవాలని ఆత్రుత. వీలుంటే అడిగి తెలుసుకోవడం నాకొక హాబీ. 
ఇక మా ఇంటి పేరైన "యామిజాల" అని ఎక్కడైనా కనిపిస్తే అందుబాటులో నెంబర్ ఉంటే ఫోన్ చేసో మెసేజ్ ఇచ్చో పరిచయం పెంచుకోవాలని ఆశ కలుగుతుంది. అయితే ఇలా తెలుసుకోవాలనుకున్న రెండు సార్లూ నాకు చేదు అనుభవమే ఎదురైంది. 
కొన్నేళ్ళ క్రితం ఓ దినపత్రికలో ఓ ప్రకటన చూశాను.‌ ఒకరి దశదిన కర్మ అడ్వర్ టైజ్మెంట్ అది. ప్రకటన యామిజాల సీతామాలక్ష్మి (నాకు గుర్తున్నంత వరకు) పేరిట వచ్చింది. పైగా ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఇంకేముంది ఆగవుగా వేళ్ళు. టకటకమని నెంబరుకి కాల్ చేశాను. ఓ మగ గొంతు ఫోన్ తీశారు. వెంటనే నేను ఇంటి పేరుతో సహా చెప్పి మా ఊరు, ఇతరత్రా వివరాలు చెప్పాను.‌ కానీ ఊహించని రీతిలో జవాబు వినవలసి వచ్చింది. 
ఇంటి పేరు ఒకటైనంత మాత్రాన ఫోన్ చేసెయ్యడమేనా...మరొక్కసారి ఫోన్ చెయ్యకండి అని కాల్ కట్ చేశారు.‌ ఈ రెండు మాటలూ చెప్పిన వ్యక్తి స్వరం కటువుగా ఉంది. అస్సలు ఊహించని ప్రతిస్పందన. నేనింకా వారెక్కడివారో ఏంటో అడిగి తెలుసుకునే లోపే కాల్ కట్టయ్యింది.
ఇక రెండో ఘటన...
ఇటీవలే జరిగింది. టెలిగ్రామ్ యాప్ లో యామిజాల సూర్యనారాయణ మూర్తి అనే ఆయన పేరు కనిపించేసరికి మెసేజ్ పెట్టాను. నా పేరు, మా నాన్నగారి పేరు, సాక్షి పత్రిక నుంచి 2012లో రిటైరైన విషయం వంటివి తెలియజేసాను. ఇవన్నీ చూసిన మూర్తిగారు మీ ఫోటో పంపండి అన్నారు. అడిగారు కదాని ఫోటోతో ఉన్న ఓ ఐడెంటిటీ కార్డు అప్పటికప్పుడు షేర్ చేశాను. అయితే ఆయన రెస్పాన్స్ ఏంటంటే యూ ఆర్ ఫేక్ అని.‌ రీజెంట్ ఫోటో పంపమని మళ్ళీ అడిగారు. అప్పుడు మా సైన్స్ మాష్టారుతో నేనున్న ఫోటో పంపాను. అయినా ఆయనకు నా మీద నమ్మకం కుదరలేదు. యూ ఆర్ ఫేక్ అంటూ మళ్ళీ మెసేజ్ ఇచ్చారు.‌ ఈ జవాబు ఎదురు చూడని నేను మీరు నన్ను ఫేక్ అనడం చాలా బాధగా ఉందని మెసేజ్ పెట్టాను. దాని కాయన యూ ఆర్ ఫేక్...నో డౌట్ అనడంతో ఇక చాట్ కొనసాగించలేదు. ఆశ్చర్యమూ కలిగింది.‌ విస్మయమూ వేసింది. ఊహించని ప్రతిస్పందన. సిన్సియర్ గా మాట్లాడాలనుకుంటే నేనొక ఫేక్ అని ఎందుకు ఆయన ఐఎస్ఐ మార్కులాగా ఓ ముద్ర వేశారో తెలియడం లేదు.
ఇంతకీ యామిజాల ఇంటి పేరు ప్రస్తావనకు వస్తే తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ దగ్గర్లో రెండు యామిజాల ప్రాంతాలున్నాయి. అవి దేవర యామిజాల, తుర్క యామిజాల. సికిందరాబాదు రైల్వే స్టేషన్ సమీపంలోని  ఆల్ఫా హోటల్ పక్కన ఉన్న బస్ టెర్మినస్ నుంచి దేవర యామిజాలకు వెళ్ళే ఆర్టీసీ బస్సులున్నాయి. ఈ విషయం తెలుసుకుని నేనక్కడికి వెళ్ళొచ్చాను. యాంజాలకొక టిక్కెట్ అని అడిగి తీసుకుంటుంటే బలేగా అనిపించింది. బస్సుల మీద యంజాల్ yamjal అని ఉంటోంది. యంజాల్ బస్టాప్ అని కండక్టర్ చెప్తుంటే ఆ ఊరంతా తిరిగినట్లనిపించింది.
ఇక్కడి దేవర యామిజాల పల్లె నుంచి కొన్ని యామిజాల కుటుంబాలు కృష్ణా జిల్లా మచిలీపట్నానికీ, మరికొన్ని కుటుంబాలు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరానికి, ఇంకొన్ని కుటుంబాలు ఇప్పటి విజయనగరం జిల్లాలోని సాలూరు పరిధిలోని శివరాంపురం గ్రామానికి వలస పోయినట్లు కొందరి పెద్దలు వల్ల తెలిసింది. మా తాతముత్తాలది ఈ శివరాంపురం అగ్రహారమే.
విజయనగరం వెళ్ళిన యామిజాల వంశీయులలో ఇద్దరన్నదమ్ములు విజయనగరం, బొబ్బిలి సంస్థానాలకు చేరువయ్యారు. అనంతరం సాలూరు జమీందారుగారి రాజపురోహితులుగా స్థిరపడ్డారు. 
విజయనగరం జిల్లాలోని ఒకప్పటి ఆంద్ర గ్రామానికి వచ్చి జ్యోతిషం, వైద్య శాస్త్రాలలో ప్రావీణ్యం చూపించిన శివరాంపురం యామిజాలవారి మూలపురుషుడిని నాటి విజయనగర మహారాజావారు తమ సంస్థానానికి ఆహ్వానించారు. మహారాణి ఆరోగ్యాన్ని పరీక్షించడానికి పరదా చాటున ఆమె చేతికి దారం కట్టి దాని ద్వారా నాడీ శబ్దం విని వైద్యం చేసారు. జ్యోతిష శాస్త్రంలో వీరికున్న అసాధారణ ప్రతిభకు మెచ్చి మానాపురం గ్రామాన్ని ఇనాముగా ఇచ్చారు. అప్పట్లో ఏడాదికి అయిదు రూపాయలు చొప్పున మహారాజావారికి శిస్తు చెల్లించేవారు. అయితే కాశీయాత్రకు  వెళ్ళిన యామిజాలవారు పన్నెండేళ్ళయినా రాకపోవడంతో ఆ గ్రామాన్ని మహారాజావారు స్వాధీనపరచు కున్నారు. అంతలో కాశీవేళ్ళిన తిరిగొచ్చిన వారికి ఈ విషయం తెలిసి "మహారాజావారు కక్కిన కూడు తిన్నారని" చెప్పి ఆ గ్రామంలో అడుగు పెట్టకుండా మరో ప్రాంతానికి వెళ్ళిపోయారు. 
ఇది తెలిసి మహారాజావారు జరిగినదానికి పశ్చాత్తాపపడి యామిజాలవారిని ఆహ్వానించి మెంటాడ మండలంలోని పెదమేడపల్లి గ్రామాన్ని ఇనాంగా ఇచ్చి ఈశ్వరాలయం కట్టించిచ్చారు. కానీ ఇక్కడ సరైన వసతులు లేకపోవడంతో సాలూరు పట్టణానికి సమీపంలో ఉన్న దుగ్ధసాఖరం గ్రామానికి యామిజాలవారు వలసపోయారు. ఇక్కడకూడా క్లిష్టపరిస్థితులు ఎదురవడంతో అక్కడి నుంచి వేగవతినదికి దగ్గర్లో ఉన్న వెలగచెట్లున్న ప్రాంతానికి వెళ్ళి పూరిపాక వేసుకుని నివసించారు. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం.  వారి విషయం తెలుసుకుని ఓ గ్రామంగా ఏర్పాటు చేయడానికి సకల అధికారాలు ఇస్తూ శివరాంపురం అగ్రహారంగా నామకరణం చేసి ఇనాంగా ఇచ్చారు. అప్పట్లో సుమారు నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంగల భూమికి హక్కుదారురయ్యారు. తోటలు, పంటపొలాలు ఏర్పడ్డాయి. వైదిక వృత్తి చేయటానికి చెళ్ళపిళ్ళవారు, తుంపిళ్ళ వారు, కట్టమూరివారు ఆదరించి ఇళ్ళ స్థలాలు కన్యాశుల్కంగా ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు. 
యామిజాలవారికి గొల్లపేట, భవానీపురం, పారాది, సాలూరు గదబవలస గ్రామాలలోకూడా భూములుండేవి. ప్రతి ఏటా శ్రీరామపట్టాభిషేకం ఘనంగా నిర్వహించేవారు. అయితే క్రమంగా ఇనాం వ్యవస్థ రద్దవడంతో సాగులో ఉన్న కొద్దిపాటి భూమిని దక్కించుకుని కోల్పోయిన భూములకు నామమాత్రపు నష్టపరిహారం పొందారు. క్రమంగా శివరాంపురంలో ఉన్న కుటుంబాలు జీవనోపాధికోసం వివిధ ప్రాంతాలకు వలసపోయాయి. 
మా నాన్నగారు తెలుగు మాష్టారుగా పని చేయడంకోసం 1948 ప్రాంతంలో మద్రాసు వెళ్ళి స్థిరపడ్డారు. ఇప్పుడున్న మా అయిదుగురు అన్నదమ్ములలో నేను,  గణపతి పుట్టి పెరిగింది మద్రాసులోనే. నాపైవాడైన రమణ అనే అన్నయ్యకూడా మద్రాసులోనే పుట్టిపెరిగి తన ఇరవై నాలుగో ఏట జల ఉదరంతో పోయాడు. నాకు తెలిసిన ఇటువంటి విషయాలన్నీ చెప్పాలనుకుంటే యామిజాల సూర్యనారాయణ మూర్తిగారు నన్నొక "ఫేక్" గా ముద్ర వేయడం ఒకింత నొప్పించింది. నిజం చెప్పినా నమ్మని వ్యక్తులు ఉంటారని ఈ సూర్యనారాయణ మూర్తి వల్ల తెలిసింది. ఆయన వైఖరి నాకొక కనువిప్పే. మా ఇంటి పేరు గల వారెవరైనా కనిపిస్తే పలకరించ కూడదనడానికి నా డెబ్బై రెండో ఏట సూర్యనారాయణ మూర్తివల్ల నేను నేర్చుకున్న పాఠం. ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు.

కామెంట్‌లు