నిర్జల నయనం:- డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

ఆమె లేకుంటే అంతా శూన్యమేనాయె!
సందడి లేని వాకిలి
ముగ్గే లేని ముంగిలి
దీపం వెలగని దేవునిగది
వాసనలు రాని రసవతి
ఆమె లేకుంటే అంతా వట్టిదే!
శోభ లేని నట్టిల్లు
తోరణం కట్టని గుమ్మం
ధూపం లేని తులసమ్మ
కిలకిలనవ్వులు వినబడని హాలు
పండుగ పూట కానరాని పాయసం
బయటకు బయలుదేరదీసే బాంధవ్యం
బంధువుల మధ్యలో తాపత్రయం
ఆమె లేకుంటే జగమే మాయ!
తలంటు లేని శిరస్సు
కొసరి తినిపించే ప్రేమ
ఎదురుచూసే కళ్ళు
అలసినా ఆప్యాయత పంచే
వదనం
మాటలతో వైద్యం చేసే మనిషి
ఆమె లేకపోతే అంతా పోయినట్లే
కష్టం,సుఖం పంచుకునే తత్వం
తపన పడే తరగని స్నేహం
వెంట నిలబడే వ్యక్తిత్వం
నేనున్నాననే భరోసా
కొండంత అండ
ఆమె లేకపోతే ఏదీ సంతోషం?
ప్రశ్నార్థకమే జీవితం
తన ఒడిలో ముందే కనులు మూయాలి
తన తలపుల్లో చిరంజీవిని కావాలి! 
కామెంట్‌లు