అనుకున్నదొకటి...అయినదొక్కటి: - - యామిజాల జగదీశ్

 తడిసి మోపెడైంది అంటుంటారు కదూ. అది అచ్చంగా నాకు అనుభవపూర్వకమైంది.
నాకు ఎప్పటి నుంచో ఉన్న ఆశ. పుస్తకాలను ఓ షెల్ఫులో వరుసగా సర్ది చూసుకోవాలని. దాని ముందర కూర్చుని చదవాలని. కావలసిన పుస్తకాన్ని షెల్ఫులోంచి తీస్తుంటే కలిగే ఆనందమే వేరు. అది మాటలకందనిది.


ఉద్యోగ జీవితంలో ఉన్నప్పుడు ఆ కోరిక తీరలేదు. రిటైర్ అయి ఇది పద్నాలుగో సంవత్సరం. కానీ షెల్ఫుమీద ఆశ మాత్రం పోలేదు. కనుక షెల్ఫు కొనాలనే అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. తీరా ఆ అవకాశం రానే వచ్చింది. అదెలాగంటే,


నేను ఉదయం పూట రోజూ ఓ నాలుగైదు వీధులు నడిచి వస్తాను. వస్తూ వస్తూ ఏదైనా పనుంటే చేసుకొస్తాను. లేదా వాకింగ్ చేసినట్లయినా ఉంటుందిగా అనుకుంటాను. అలా వాకింగ్ వెళ్తున్నప్పుడు ఓ రోజు ఓ ఇంటి వాకిలి పక్కన గోడకు ఆన్చి ఉంచిన ఓ ఏడడుగుల షెల్ఫు కనిపించింది. ఆ ఇంటి మనిషి నాకు తెలిసినతనే. అతనికో కిరాణా దుకాణం ఉంది.
ఆలస్యం చేయకుండా దుకాణానికి వెళ్ళాను. తీరా అతను లేడు. వాళ్ళావిడ ఉంది. ఆవిడను అడిగాను షెల్ఫు గురించి. కావాలా మీకు, ఉచితంగా తీసుకుపోండి...డబ్బులు అక్కర్లేదంది. ఈ మాటకు నా మనసు ఎగిరి గంతేసింది. అయినా వాళ్ళాయనకు చెప్పి తీసుకుపోవడం మంచిది కదాని రెండు రోజులు ఆగి ఆయనను కలిశాను. ఆయన నా మాటింకా పూర్తి కానే కాలేదు, వెయ్యి రూపాయలు ఇమ్మన్నాడు. అదేంటీ మీ ఆవిడ డబ్బులేమీ అక్కర్లేదన్నారని చెప్పాలనిపించింది. కానీ ఎందుకో మాట పెదవి దాట లేదు. చేతిలో ఉండనే ఉందిగా ఫోను. వెంటనే ఫోన్ పే ద్వారా ఆయనకు వెయ్యి రూపాయలు కట్టాను. అలాగే ఇంటికి చేర్చడానికి మరో మూడు వందలు కూలీ డబ్బులు ఇచ్చాను.


ఆ తర్వాత ఓ రెండు వారాలు పైనే అయింది అది ఇంటికి చేరడానికి. ఈలోపు వీనున్నప్పుడల్లా షెల్ఫుని చూస్తుండే వాడిని. అది చూసినప్పుడల్లా ఏవేవో ఆలోచనలు. పుస్తకాలు ఎలా సర్దాలి. తమిళ పుస్తకాలన్నీ ఓ వరసలో. మిగిలిన తెలుగు పుస్తకాలు మిగిలిన వరుసలలో అనుకున్నాను. అట్టలు లేని పుస్తకాలకు అట్టలు వేయాలనుకున్నాను. ఓరోజు నా మొహమాటాన్ని వీడి దుకాణదారుడిని అడిగాను, షెల్ఫు ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తారా అని. రేపు గ్యారంటీగా పంపిస్తానండి అన్నాడు.


మరుసటి రోజు ఎప్పట్లాగే నేను వాకింగ్ వెళ్ళొస్తుంటే ఆయనే నన్ను పిలిచాడు. ఓ బండి అతన్ని పిలిపించి అతనికి నా కళ్ళముందే వంద రూపాయలు ఇచ్చి ఇంటికి చేర్చమన్నాడు. ఆ బండి వెనకాలే నేనూ నడిచాను. మొత్తానికి షెల్ఫు ఇంటి ఆవరణలోకి చేరింది. మేముంచున్నది ఓ అపార్ట్మెంటులో ఓ వాటా. ఏడడుగుల కొయ్య షెల్ఫు కావడంతో దానికి కొన్ని చిన్న చిన్న మరమ్మతులు అవసరమవడంతో వెంటనే ఇంట్లోకి తీసుకొచ్చే వీలు లేదు. దాంతో సెల్లారులో లిఫ్ట్ పక్కనే ఉన్న 201 కార్ పార్కింగ్ ప్లేసులో ఓ మూల పెట్టించాను సెల్ఫుని.
కాస్సేపటికే ఆ వాటా బ్రహ్మచారి తన ఓనరుకి ఈ షెల్ఫు ఫోటో తీసి చెత్తంతా నా పార్కింగ్ జాగాలో పెడుతున్నారు. వెంటనే దాన్ని తీయించండి...నా టూ వీలర్ పాడైపోతుందని కంప్లయింట్ చేశాడు. ఆ ఓనరు కాస్తా మా ఆవిడకు వాట్సప్ లో ఆ మెసేజ్ పంపాడు. ఇంకేముంది, అతి కష్టంమీద దాన్ని నేనొక్కడినే అక్కడి నుంచి జరిపి ఓ మూల పెట్టాను. ఆ తర్వాత దానికి చిన్నపాటి రిపేర్లు ఉంటే చేయించడానికి ఓ మనిషి ద్వారా కార్పెంటరుని పిలిపించాను. వచ్చిన కార్పెంటరు అటూ ఇటూ చూసి బాగు చేయడానికి మూడు వేలవుతుందని అన్నాడు. పదిహేను వేలు ఇస్తానన్నాను. పోనీ రెండు వేలు ఇవ్వండన్నాడు. సరేనని ఒప్పుకున్నాను. అతని దగ్గర ఉన్న ఫోన్ చాలా చిన్నది. అంటే ఆన్ లైన్లో నేను డబ్బులు కట్టడానికి వీలు లేకపోవడంతో మా ఆవిడ దగ్గర పదిహేను వందలు తీసుకుని కార్పెంటరుకి అడ్వాన్సుగా ఇచ్చాను. అది తీసుకెళ్ళిన మనిషి ఓ ఇరవై రోజులు జాడ లేడు. ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడి అతనిని పరిచయం చేసిన వ్యక్తికి ఫోన్ చేస్తే తెలిసిందేమిటంటే, కార్పెంటర్ ఊరుకి వెళ్ళాడని. ఇవాళో రేపో వస్తాడు...రాగానే మీ దగ్గరకు పంపుతానని చెప్పాడా మూడో మనిషి. సరే అన్నాను. తీరా ఆ రోజు సాయంత్రం కార్పెంటర్ రానే వచ్చాడు. వస్తూ వస్తూ ఓ అసిస్టెంటుని తీసుకొచ్చాడు. ఓ అర గంటలో చిన్న చిన్న పనులు కానిచ్చాడు. ఇవ్వవలసిన మిగిలిన సొమ్ములు అయిదు వందలు ఇచ్చాను మా ఆవిడ దగ్గర తీసుకుని. అయితే అతనేం చేశాడు. బుర్ర గోక్కుంటూ ఊరు నించి వచ్చాను, నా దగ్గర అస్సలు డబ్బుల్లేవు. మరో రెండు వందలు ఇవ్వండి అంటే సరే కదాని ఇంకో రెండు వందలు మా ఆవిడ దగ్గర తీసుకుని అతనికిచ్చి పంపాను. మరుసటి రోజు ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చి కిందా మీదా పడి ఆ ఏడడుగుల భారీ షెల్ఫుని మెట్లెక్కి మూడో అంతస్తులో ఉన్న మా వాటా ముందరున్న బాల్కనీలో పెట్టి ఏడు వందలు తీసుకుపోయారు.
ఇంటి గడపేమో ఆరడుగులే. షెల్ఫేమో ఏడడుగులు. దాంతో దాన్ని నేనూ మా ఆవిడ అడ్డంగా పడుకోబెట్టి ఇంట్లోకి చేర్చాం. అమ్మయ్య అనుకున్నాం.
మరుసటి రోజు మరొకరి చేత దాన్ని ముందర గదిలో నిలబెట్టించడానికి రెండు వందలు సమర్పించుకున్నాం.
అనంతరం పుస్తకాలు సర్దడం మొదలుపెట్టాను. కానీ అది కాస్తంత ఊగుతున్నట్లు అనిపించడంతో లోలోపల ఓ రకమైన భయం. అనుమానం. అదెక్కడ పడిపోతుందేమోనని. ఇలా ఏవేవో ఆలోచిస్తూ పుస్తకాలు సర్దుతున్న సమయంలో నన్నప్పటికే ముంచిన కార్పెంటర్ తన సహాయకుడితో వచ్చాడు. సారూ ఊగుతోందిగా దానిని గోడకు ఫిక్స్ చేయిస్తే మంచిదన్నాడు, నేనూ అవునన్నాను. ఇంతలో సహాయకుడు ఈపాటి చిన్న పని నేను చేసెస్తాను... ఓ మూడు వందలు ఇవ్వండి అన్నాడు. సరే కదాని మూడు వందలు ఇచ్చాను. ఓ అర గంటలో వచ్చి ఫిక్స్ చేస్తాను అన్న మనిషి జాడ ఈ రోజు వరకూ అడ్రెస్ లేడు. అతను మాయ మాటలు చెప్పి నన్ను మోసగించాడని తర్వాత గానీ అర్థం కాలేదు. దాంతో కార్పెంటరుకి ఫోన్ చేసి మోసపోయిన విషయాన్నిచెప్తూ మండిపడ్డాను. నేను కోపావేశంతో మాట్లాడుతుండటం చూసి నా దగ్గర ఫోన్ లాక్కుని కార్పెంటరుతో పద్ధతి బాగులేదని చెప్పి కాల్ కట్ చేసేసింది. నన్ను తిట్టింది ఏదీ చేతకాదని. పని చేయించుకున్న తర్వాత ఎవరైనా డబ్బులిస్తారు కానీ ముందే డబ్బులిస్తే ఇంకెందుకు వస్తారు అని క్లాస్ పీకింది. నిజమే, తను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. దాంతో తను చెప్పిన మాటల్నీ వినడం తప్ప మరో దారి లేకపోయింది. ఏదో సెకండ్ హ్యాండులో తక్కువ ధరకు షెల్ఫు సమకూర్చుకున్నాననుకుంటే అక్షరాలా మొత్తం మీద నాలుగు వేల ఐదు వందలు ఖర్చయ్యాయి. పెయింట్ చేయడానికి మరో పదిహేను వందలు ఇమ్మని అడిగితే అక్కర్లేదని నేనే నూట ముప్పయి రూపాయలకు పెయింట్ డబ్బా కొనుక్కుని షెల్ఫుకి చిత్తమొచ్చినట్లు నేనే పెయింట్ చేసేసాను. పుస్తకాలు సర్దాను. ఈ క్రమంలో అక్కర్లేదనుకున్న పుస్తకాలు అక్షరాలా ఓ నలబై రెండు కిలోల వరకూ తూకంలో ఇచ్చేశాను. ఇప్పుడు కేవలం ఈ ఏడడుగుల షెల్ఫులో సర్దిన పుస్తకాలతో నేను మిగిలాను.

ఈ షెల్ఫు వ్యవహారంతో నేను తెలుసుకున్నదేమిటంటే, నాకు బేరం చెయ్యడం తెలీదని, అవతలి వ్యక్తి తీయగా చెప్పే మాటలకు సులభంగా మోసపోవచ్చని. ఇప్పుడెన్ని అనుకుని ఏం లాభం...ఏ మాత్రం ఆలోచన లేకుండా ఖర్చు పెట్టిన డబ్బులకు ఓ కొత్త ఇనప షెల్ఫే కొనుండవచ్చు అని కొందరి మాట. ఇది కొందరి మాట కాదు, నా అభిప్రాయం కూడా. నా చేతకాని తనం వల్ల ఎంత పని జరిగిందో.


     
కామెంట్‌లు