ఈగ: - - యామిజాల జగదీశ్

 ఈగ ఇదొక చిన్న కీటకమే. కావచ్చు. ఈగలు డిప్టెరా అనే గ్రీకు మాట నుంచి వచ్చాయి.   డి అంటే రెండు అని, ప్టెరాన్ అంటే రెక్కలు అని అర్థం.  ఈగల ప్రధాన లక్షణం ఒక జత రెక్కలు, ఒక జత హాల్టార్స్ నీ కలిగి ఉండటమే. అయితే కొన్ని ఈగలు రెక్కలు లేకుండాకూడా జీవిస్తాయి. ఏముందని ఈగను తీసిపారేస్తాం. కానీ ఈగల గురించి తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.
ఈగలు ఎక్కువగా మనుషుల ఆవాసాలలోనే పెరుగుతాయి. ఇవి ప్రమాదకరమైనవే. మనిషి వెంటే ఉంటూ ఆహార పదార్థాలపై వాలుతూ అంటు వ్యాధులను వ్యాపింపజేస్తాయి. వీటి నోటిలోని అవయవాలు ద్రవపదార్థ స్వాదనానికి అనుకూలంగా ఉంటాయి. ఈగలు తమ లాలాజలంతో ఘన పదార్థాలనుసైతం ద్రవపదార్థాలుగా మార్చగల శక్తి కలవి. ఈగలు పాలు, ఇతర పదార్థాలు ఉండే గ్లాసులపై తేలికగా వాలగలవు. వీటి కాళ్ళపై సన్నని రోమాలుంటాయి. అవి సామాన్య కంటికి కనిపించవు.  ఇవి కొంచెం తడిగా ఉండే ఆహార పదార్థాలపైనే ఎక్కువగా వాలుతుంటాయి.
ఈగల జన్మస్థలం ఆసియా ఖండమని చెప్పుకుంటున్నా ఇవి ప్రపంచంలో అంటార్కిటికా, మరి కొన్ని దీవులను మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రదేశాల్లోనూ ఉన్నాయి. ఇవి నౌకలు, రైలు, విమానాలు, ఇతర వాహనాల ద్వారా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస పోతుంటాయి. రెండు వందల యాబై మిలియనం సంవత్సరాల క్రితమే ఇవి భూమ్మీద ఉండటం గమనార్హం. ఈగల ఆయుష్షు ఆరు రోజులే. కొన్ని ఈగల ఆయుష్షు ఎనిమిది రోజులు. ఓ ఆడ ఈగ ఒక కాన్పులో 120 మొదలుకుని 150 వరకు గుడ్ల వరకూ పెడతాయి. ఇవి తెల్లగా నిగనిగలాడుతుంటాయి. జిగురుగా ఉంటాయి. పన్నెండు గంటల్లోనే ఈ గుడ్లు పొదగబడి ఓ దశకు చేరుకుంటాయి. ఈ దశను ప్యుపేరియం అని అంటారు. ఇది ఈగకు కవచంలా ఉంటుంది. దీని పగల గొట్టిన తర్వాతనే ఈగ తనదైన రూపంలో బయటకు వస్తుంది. ఈగలు తమ రెక్కలతో మనిషి చెవి దగ్గర చేసే రొద ఇంతా అంతా కాదు. విసిగించడంలో ఈగ తర్వాతే మరేవైనా. నిముషానికి ఓ ఈగ వెయ్యిసార్లు తన రెక్కలను రెపరెపలాడిస్తాయి అంటే ఆశ్చర్యమేస్తుంది కదూ. కానీ నిజం. సాధారణంగా ఓ ఈగ 20 మైళ్ళ దూరం వరకూ ఎగురుకుంటూ పోగలదు. సీతాకోకచిలుకల్లా ఇవి కూడా తమ కాళ్ళతో తాను తీసుకునే ఆహారం రుచిని ఆస్వాదిస్తాయి. ఈగలలో రుచిగ్రాహకాలు దేహమంతా వ్యాపించి ఉంటాయి.  ఇవి ఈగల రెక్కలు, కాళ్లు, పాదాలు, దేహం వెనుక భాగాలపైన కూడా పరుచుకుని ఉంటాయి.
ఈగ తన గుడ్లను పేడ కుప్పలు తదితర చోట్ల పెడుతుంది. ఇక్కడో విషయం గమనించాలి. ఈగలు ఎంత ప్రమాదకరమైనవంటే ఏ మాత్రం వీలున్నా మన శరీరం మీది పుండ్లలో కూడా గుడ్లను పెడతాయి. కొన్ని ఈగలు చిన్న పిల్లలముక్కు, చెవులలోకూడా గుడ్లు పెడతాయి.  
మగ ఈగల కళ్ళు రెండూ దగ్గరకుంటాయి. ఆడ ఈగ కళ్ళలో ఎడమవైపు కాస్తంత ఎత్తుగా ఉంటుంది.
ఈగలు బావుల దగ్గరా, వంట గది పక్కనా, కాళ్ళు చేతులు కడుక్కునే చోట ఎక్కువగా ఉంటాయి.  ఈగలు తాము తినాలనుకున్న ఆహారాన్ని వెనుక కాళ్ళతో ఎత్తి, దానిని తన ఆరు కాళ్లతో తొక్కి ముద్ద చేసి ముందున్న రెండు కాళ్ళతో నోట్లో పెట్టుకుని మింగేస్తాయి.  ఈగ మనము తినే అన్నం మీద వాలినప్పుడు ఏదేని ఒక అన్నం మెతుకు మీద నల్లని చుక్క
ఒకటి పెట్టి పోతుంది. ఆ చుక్కను సూక్ష్మదర్శనితో పరీక్షిస్తే రకరకాల సూక్ష్మ జీవులు కనిపిస్తాయి. ఈ చుక్కే ఈగ విసర్జించే మలం.  దానిని మనం తెలిసో తెలియకుండానే తినడంతో రోగాలు వస్తాయి. కనుక వీలున్నంతవరకూ ఈగలు వాలిన ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది. లేకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది.

కామెంట్‌లు