సామెత-174; ఆర్నెల్లు సవ్వాసం చేస్తే వారు వీరవుతరు
*****
ఒరేయ్! బుడ్డోడా! ఏం చేత్తున్నవ్ రా! వయ్యిలు ముందేసుకుని సద్వకుండా ఏందో జేస్తున్నవ్?"
ఏం లేదవ్వా! సద్వుతున్న. సద్వుతున్న. మా బల్లె సారు కాయితంతోటి బొమ్మలు జేస్కొని రమ్మన్నడు గందుకే గియ్యి జేత్తున్న."
అంతా ఒల్లెక్కమే అవ్వా! కాయితంతో బొమ్మలు జెయ్యాలని జెప్పి నువ్వు మొన్న కొనిచ్చిన కొత్త నోటుబొక్కు చించి పోగులు బెట్టిండు.పైంగ అవ్వకి శెప్పకని సైగ జేత్తుండు."
"అవునానే భూలచ్మీ! గీడు ఎందుకిట్ల తయారైండు.సరింగ సద్వుతనే లేడు పొద్దత్తమానం ఆటలకి మరిగిండు.అన్ని శితిని పనులే చేత్తుండు. మొన్న పెన్ను యిప్పదీసి రాసే మొల్కిని పండ్లు బెట్టి గుంజినట్టుంది. నోటినిండా,శేతినిండా బట్టల నిండా ఇంకు జేస్కుండు. ఏందిరా వారీ! గిదేం పన్రా అంటే ఒకటి లేదు రెండు లేదు మూగిమొద్దులెక్క మిడిగుడ్లేసుకుని సూడబట్టిండు.పల్లపల్ల నాల్గు పీకాలన్పిచ్చి శెయ్యి లేపిన్నో లేదో గజ్జ గజ్జ వొణకబట్టిండు. గట్ల గాన్ని సూశేతల్కి జాలనిపిచ్చి ఎత్తిన శెయ్యి దింపిన."
"అసలు గీ నడ్మల మన బుడ్డోడు ఎందుకిట్ల జేత్తుండే భూలచ్మీ! బల్లె సుత గిట్లనే శేత్తుండా!శెప్పు సార్లకి జెప్పి తోడ్కలు తోడ్కలు ఊడేటట్టు కొట్టిపిత్త".
"అవ్వా! గీ శకలన్నీ గీనియి గాదు. గీ నడ్మల బల్లెకు ఓ కొత్త పోరడు వొచ్చిండు. మన బుడ్డోడు గాని సోపతి బట్టిండు.గాడు ఉత్త శితిని పోరడు.బల్లె సార్లు శెప్పిన మాట యినే ముచ్చటే లేదు. గాని అమ్మ నాయినను పిలిపిచ్చి సుత అడిగిండ్రు. గాడు ఇంతకు ముందు పైవేట్ల సద్విండట. గక్కడ బడోళ్ళు గిస్మంటోన్ని బరాయించడం మా వొల్ల గాదు" అన్కుంట టీసీ సుత ఇచ్చి పంపిండ్రంటవ్వా!" గంద్కని మా బల్లె శెరీక జేసిండ్రంట అవ్వా!
"అయితే మన బుడ్డోడు గాని సోపతి గానీ పట్టిండా ఏంది?"
అవునవ్వా! గాడు మన బుడ్డోడి కీలాస్నే.గాని సోపతే మనోడు బట్టిండు.గాన్ని వీడు తర్గతిల సుత తన పక్క పొంటినే కూసుండబెట్కుండవ్వా!"
అవునార వారీ! బుడ్డోడా!గాని సోపతి బట్టి గిట్ల తయారైనావ్! అందుకే అంటరు "ఆర్నెల్లు సవ్వాసం జేత్తే వారు వీరవుతరు అన్నట్లు " గాని లెక్క తయారైతున్నావ్! ఆడ్ని మీ బల్లె ఏ సారన్న పంతులమ్మన్న మెచ్చుకుండ్రా? గుడ్లు మిటకరిచ్చి సూసుడు గాదు.అడ్గిందానికి నోరిప్పి జవాబు శెప్పు.
"ఒసే భూలచ్మీ! పొద్దుగాల శింత శిగురు కోశేటపుడు గింత పొడుగాటి బరిగె జేద్దామని ఇర్శిన.పొయ్యి ఎన్క మూలకు బెట్టిన తేపో! దాంతో నాలుగంటిత్తే అయ్య నోట్లోంచి అస్లిషయం బయటికొత్తది."
నే శెప్తవ్వా! నన్ను కొట్టకు.గాడితో ఎవ్వలు సోపతి చేయట్లేదని నాకు రోజూ బొంగుండ,నూల జీడీ ఇచ్చి నన్ను దోస్తు జేస్కుండు. వాడు "మనం జేసే పనుల్ల మజా వుంటది గని సద్వుల గాదు" అన్కుంట వొయ్యిలు జింపి కత్తిపడవలు,సిరాబుడ్లు..గిట్ల మస్తు రకాల బొమ్మలు జేసి నాకిత్తున్నడు. గవ్వే గిప్పుడు నేర్సుకుంటున్న అవ్వా!" వొణుక్కుంట జెప్తున్న బుడ్డోన్ని సూస్కుంట...
గాని సోపతి బట్టినవ్ గద! సార్లు గాన్ని గాని నిన్ను గాని మెచ్చుకుండ్రా జెప్పు.
అవ్వా! మొన్న సార్లు బిలిశి 'మీ బుడ్డోడు గీ నడ్మల పురాగ శెడిపోయిండు. మీ యవ్వ నోపాలి తోల్కరమ్మని జెప్పిండవ్వా! అయితే మన బుడ్డోడు అవ్వకి శెప్పమాకక్కా! నీకు దండం బెడ్త అన్నడవ్వా!"
వోష్నీ పోరడా! గాని దోస్తానం బట్టి నువ్వు గాన్లెక్క తయారైనావ్?"
గాడు బొగ్గసుమంటోడు. గాడ్ని పట్టుకుంటే మశంటుంది.ముట్టుకుంటే కాలుద్ది.అందర్ల శెడ్డ పేరొత్తది.ఇంకోపాలి గాని పక్కన కూసున్నట్టు గానీ,గాంతో తిర్గినట్టుగాని తెల్వాలె.గీ శింత బరిగే ఉంది నువ్వే ఉన్నవ్. నాల్గంటిత్తే సక్కంగైతవు."
"బుడ్డోడు తప్పైందని గుంజీళ్ళు తీస్కుంట "ఇంకోపాలి గట్ల జెయ్యనవ్వా! గాని దోత్తు పట్టిన కానించి సార్లు అందర్తో తిట్లే పడ్తున్నయ్" అంటుంటే..."
"శెడ్డోల్లయినా మంచోల్లయినా గాళ్ళతో తిర్గితే వాళ్ళు వీళ్ళయితరు. నువ్వు గాన్తో తిరిగి శెడ్డలవాట్లు నేర్సుకున్నవ్. అక్క సూడు దాని దోత్తులందరూ మంచోళ్ళు. బల్లె సక్కంగ పాఠాలింటరు,సద్వుల పోటీ బడి సద్వుతరు. మొన్న గాల్ల తెల్గు సారు బజాట్లె కల్సి 'మీ భూలచ్మి మంచిగ పద్దేలు , పాఠాలు సక్కగ సద్వుద్దని మెచ్చుకుండు." గట్లుండాలె గని.. గింతకు మున్పు ఎట్లున్నవ్.గిప్పుడెట్లయినవ్? యాదికి దెచ్చుకో! అనే తల్కి గిప్పన్నించి మంచిగుంటవ్వా! ఏడ్సుకుంట అంటుంటే..
అవ్వ దగ్గర్కి తీస్కొని కండ్లు తుడిశి" మా బుడ్డోడు ఇంగ మంచిగైతడు అక్క లెక్క " అన్కుంట శెరొక సున్నుండ తినుమని ఇచ్చింది.
"గదండీ సంగతి "ఆర్నెల్లు సవ్వాసం జేత్తే వారు వీరవుతరు" అంటే గిదే మరి. పిల్లలే గాదు పెద్దోళ్ళు సుత గీ సవ్వాసాల వల్ల శెడిపోవుడో,మంచిగవుడో అవుతుంటరు.గందుకే "వందిచ్చి శెడ్డ సవ్వాసం వొదులుకోవాలనీ,వెయ్యిచ్చి మంచి సవ్వాసం కలుపుకోవాలని అంటరు".

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి