సామెత -162: ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే... సుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయిండట
*****
"అవ్వా!గిస్మంటి ఇచ్ఛింత్రం ఏడ్నన్న జూసినవా?మాయదారోడు గింత ఇజ్జత్ తక్వ పనులు చేస్తడనుకోలేదు.
"ఎవడు శెల్లె! గంత ఇజ్జత్ తక్వ పనులు చేసింది? గాడున్నది అందరున్న ఊల్లెనా! అంటు సొంటు తెల్వని అడివిల్న.
"గాడే అవ్వా! పరాంకుశం గాడు.ఇంట్లో పెళ్లాం పిల్లల్ని సరిగ్గ సూసుడు లేదు.గాని పెళ్ళాం పెమీల కూల్నాలికి బొయ్యి తెచ్చిన పైసల్తోనే ఇల్లెల్లాలె. పొల్లగాండ్లది తినే వొయసాయె. గా పెమీల కూలి డబ్బులతో ఇల్లు గడ్వడం శానా కట్టంగ ఉందట.
"గా పొల్ల గాండ్లేమో దినాం ఆకలి తీరక అన్నమో రామశందర! అనీ ఏడుత్తుంటే..గాల్ల ఆకల్ని పట్టిచ్చుకోకుండ ఊల్లోల గురించి మాట్లాడుతుండు. గీని సోయి గీనికి లేదు గని మంది ముచ్చెట్లు మంది బాగోగులు కావాల్నా?
గాడేంది శెల్లె. గట్ల తయారయ్యిండు? ఇల్లు, పిల్లల సోయి లేదు. పొద్దత్తమానం ఫలానోడు గిట్ల ఫలానోడు గట్ల అన్కుంట మందికి నీతులు శెప్పేటోడ్ని గాన్నే సూశిన.
అవునవ్వా! పెమీల ఒక్కతీర్గ బాదవడ్తుంది. ఇల్లాకిలి పట్టిచ్చుకునుడు లేదు.ఎంత సేపూ మందికి నీతులు జెప్పుడు.తనేదో అన్ని సక్కరంగ సూత్తున్నట్టు.గిస్మంటోళ్ళు ఎట్ల మార్తరో ఏమో అవ్వా?
గాల్లు మారరు. మారడానికి ఇట్టపడరు శెల్లె! తనేదో గొప్ప జ్ఞానవంతుడనే బెమలో ఉంటరు. ఇంగ పైంగ మంది గురించి నేను దప్ప ఇంగెవలన్న ఆలోచిత్తరా? అన్నట్టుంటరు.
"అవునవ్వా యతార్తం శెప్పినవ్.గస్మంటోడే గీ పరాంకుశం గాడు.ఇంటి జోలి పట్టదు గని ఎవడో సుట్టపోడికి బిడ్డల్లేరని రామేశ్వరం పోతనని తయారయ్యిండంట.
గదే మరి అతి అంటే"ఆలు బిడ్డలు అన్నానికి ఏడుత్తుంటే సుట్టపోడికి బిడ్డల్లేరని రామేశ్వరం పోతననడం! గా శార్జీల పైసలు ఏదేనికన్న అక్కరకొచ్చేవి గద.
"అవును శెల్లె! గాన్ని నా తానకి పంపు. నాలుగు దులుపుత. గస్మంటోడు పెండ్లే సేశుకోవద్దు. పెండ్లాం పిల్లల ఉసురు తీసుకోవడం."
"సరే అవ్వా! గాన్ని నీతానకి పంపుతా. పోతాన్న" అన్కుంట బొయింది.
గదండీ సంగతి. ఆలు బిడ్డలు "అన్నానికి ఏడుత్తుంటే సుట్టపోడికి బిడ్డల్లేరని రామేశ్వరం పోతనండట".

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి