గగనయానం — కవనవిహారం: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
గగనానికి ఎగిరితిని —
గాలిపటంలా గాలిలో తేలుతూ
మేఘాల మడుల్లో మునిగిపోతూ
మనసుకు మధురిమలు పంచితిని.

మబ్బులపై కూర్చొంటిని —
మౌనాన్ని ముత్యాల్లా పేర్చుకుంటూ
ఆలోచనల అలల్ని ఆడించుకుంటూ
అంతరంగాన్ని ఆలకించితిని.

చంద్రునిపై కాలుమోపితిని —
చల్లని వెన్నెల నవ్వుల్లో
నిశ్శబ్ద గీతాల సవ్వడితో
నిత్యానందం నింపుకుంటిని.

భూగోళాన్ని తిలకించితిని —
బొమ్మలా తిరిగే జీవన చక్రాన్ని
సుఖదుఃఖాల సుడిగుండాల్లో
సత్యాల సవ్వడిని అనుభవించితిని.

ప్రపంచాన్ని పరికించితిని —
ప్రతి హృదయంలో ఒక విశ్వం ఉందని
ప్రతి చూపులో ఒక గాథ ఉందని
ప్రేమే పరమార్థమని తెలుసుకుంటిని.

నక్షత్రాలను ఏరుకొంటిని —
నవనీతపు నెమలిపింఛాల్లా చేర్చుకుంటూ
కలల కిరీటం కట్టుకుని
కాంతుల కవితల్ని కూర్చితిని.

ఇంద్రధనస్సుపై కూర్చొని —
ఏడు రంగుల రాగాలతో
భావాల బాణీలు పలికిస్తూ
పాఠక హృదయాల్లో పరిమళించితిని.


కామెంట్‌లు