విధ్వంసకర ఆ నల్లని మేఘాలు..?: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్.
ఆకాశపు నీలి కురులపై
రగిలిన చిచ్చు ఆ నల్లని‌ పొగ...
అగ్రరాజ్యాల అహాల
కొలిమిలో సమర్పించిన
అమాయకుల సమిధల సెగ...

శాంతికపోతాల రెక్కలు తెగి
నెత్తురు చిందుతున్న వేళ
మారణాయుధాల గర్జనల
మధ్య మౌనంగా రోదిస్తోంది
భూగోళం ఒక పీడకలలా...

కూలిన భవనాల శిథిలాలు..
మట్టిలో కలిసిన పసివాళ్ళ
కలల సమాధులు...
తెగిన తాలిబొట్లు..
ఆరిన దీపాలు.. అన్నీ
అధికారదాహానికి బలిపశువులే...

క్షిపణుల వర్షంలో
తడిసిన నేల
రక్తపు మడుగులో
విలవిలలాడుతుంటే
చూసీ చూడనట్లు
నక్కిన దైవం రాతివిగ్రహంలా
మిగిలిపోయే ఒక ప్రశ్నార్థకంలా...

కంటిపాపల్లో
కాంతిని తుడిచేసే
ఈ అంధకార అహంకార
యుద్ధం ఎవరికోసం..?
పగా ప్రతీకారాల మంటల్లో
మానవత్వాన్ని ఆహుతి చేసే
ఈ వినాశనం ఎవరికోసం..?

దట్టమైన నల్లని పొగలు
కమ్ముకున్న ఆకాశం కింద
చావుకేకలే నేటి నిత్యసత్యాలు
చరిత్ర పుటల్లో మిగిలేవి కేవలం 
అస్థిపంజరాల కుప్పలే...కన్నీటి రెప్పలే
వద్దువద్దు యుద్ధం వద్దు శాంతియే ముద్దు



కామెంట్‌లు