సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 విరాట పర్వము పంచమాశ్వాసము--198వ రోజు
:- ధర్మజుని మందిరంలో పాడవుల ద్రౌపది సహిత సమావేశం
బృహన్నల ఉత్తరుని సమయస్పూర్తికి మెచ్చుకున్నాడు. వారిరువురు సుధేష్ణ వద్దకు వెళ్ళి ఆమె ఆశీర్వాదం పొందారు. ఉత్తర కొరకు నర్తనశాలకు వెళ్ళారు. ఉత్తరుడు బొమ్మ పొత్తికలను ఉత్తరకు ఇచ్చాడు. ఆమె అన్నయ్య పరాక్రమానికి మురిసి పోయింది. ఆ తరువాత పాండవులందరూ ద్రౌపదితో కలిసి ధర్మరాజు మందిరంలో రహస్యంగా సమావేశ మయ్యారు. అర్జునుడు జరిగినదంతా చెప్పాడు. తల వంచుకుని ఉన్న ధర్మజుని చూసి భీమునితో అర్జునుడు " అన్నయ్య నా వైపు ఎందుకు చూడటం లేదని అడిగాడు. ఇక దాచడం కుదరదని ధర్మరాజు " అర్జునా! విరాటుడు తన కుమారుని పొగుడుతుంటే నేను బృహన్నల ఉండగా ఉత్తరుడు విజయం సాధించడంలో విశేష మేమిటని అన్నాను. విరాటుడు కోపించి ఒక పేడిని పొగుడుతావా అని వివేకం నశించి పాచికలు నాపై విసిరాడు. నాకు చిన్న గాయం అయింది " అన్నాడు. ఆమాటలకు భీముడు ఉగ్రుడై " ఆ దురాత్ముని సకుంటుంబంగా యమపురికి పంపి వాని రాజ్యం మనం కైవశం చేసుకుంటాము " అన్నాడు. ధర్మరాజు వారిరువురిని వారించి " కష్టకాలంలో మనకు ఆశ్రయం ఇచ్చిన విరాటుని చంపడం భావ్యము కాదు. అతని పట్ల మనం కృతజ్ఞత మాత్రమే చూపాలి. మనమెవ్వరమో అతనికి వివరిస్తాము. ఆతరువాత కూడా అతడు మనపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే అప్పుడు మీ ఇష్టం అన్నాడు.
పాండవులు తమను తాము బహిరంగ పరచుకొనుట
మరునాటి ఉదయం పాండవులు ద్రౌపది తమ నిజరూపాలు తెలిసేలా వస్త్రధారణ చేసి సభా ప్రవేశం చేసారు. ధర్మరాజు విరాటుని సింహాసనాన్ని అధిష్టించాడు. విరాటుడు కొలువుకు రాగానే సింహాసనంపై కూర్చున్న ధర్మరాజుని చూసి " ఏమిటిది కంకా ! మా సింహాసనం అధిష్టించింది చాలక మమ్ములను చూసి కూడా లేవకుండా కూర్చున్నావా ఇంతటి అహంకారమా? " అన్నాడు. అర్జునుడు " విరాటా ! ఈయన ధర్మరాజు ఎంతో మంది సామంతులను కను సన్నలతో శాసంచగల చక్రవర్తి. భూమిని నాలుగు చెరగులా జయించి రాజసూయాన్ని నిర్వహించిన మహాను భావుడు. అజాతశత్రువు, సత్యవ్రతుడు, ధర్మమూర్తి అయిన ఇతడు దేవేంద్రుని సింహాసనాన్ని అధిష్టించడానికి కూడా అర్హుడు నీ ఇంత చిన్న సింహాసనాన్ని అధిష్టించడానికి తగడా? " అన్నాడు. అది విన్న విరాటునికి ఆశ్చర్యం, ఆనందం, అనుమానం ఒకేసారి కలిగి " మరి ఈయన ధర్మరాజైతే మిగిలిన వారు ఎవరు. ద్రౌపది ఎక్కడ? " అని అడిగాడు. అర్జునుడు " మహారాజా! ఇప్పటి వరకు నీ వంట శాలలో రుచికరమైన వంటలు చేసి, మల్లయుద్ధాలు చేసి నిన్ను మెప్పించిన వలలుడే భీముడు. అతడు బకాసురుడు, కిమ్మీరులను వదించిన బలశాలి. నీ అశ్వశాలలో అశ్వాలను రక్షిస్తూ నిన్ను సేవించే తంత్రీ పాలుడే మా తల్లి మాద్రి పెద్ద కుమారుడు నకులుడు. గోశాలలో గోవులను కాపాడుతూ సేవిస్తున్న దామ్రగంధి మాద్రి చిన్న కుమారుడు సహదేవుడు. అంతఃపురంలో సైరంధ్రిగా సుధేష్ణను సేవించే మాలినియే ద్రౌపది. ఆమెను అవమానించినందుకే భీముడు కీచకుని, ఉపకీచకులని వధించాడు " అనగాగానే భీముడు అందుకుని " నర్తనశాలలో నాట్యం నేర్పే బృహన్నల అర్జునుడు. ఇంద్రలోకంలో ఊర్వశి ఇచ్చిన శాపం అర్జునినికి ఇలా అజ్ఞాతవాస సమయంలో సహాయపడింది. ఖాండవవనాన్ని దహించి ఇంద్రుని జయించిన మహా వీరుడు. కాలకేయులను చంపిన ఘనుడు. అతడే " అన్నాడు. ఇదంతా కలా నిజమా అని విరాటుడు సంభ్రమాశ్చర్యాలతో మునిగి తేలుచున్న సమయంలో ఊత్తరకుమారుడు " అవును తండ్రీ! నేను చెప్పిన దైవాంశ సంభూతుడు ఇతడే. భయంతో వణుకుతున్న నాకు ధైర్యం చెప్పి యుద్ధం చేసి మనలను గెలిపించిన దివ్యపురుషుడు ఇతడే.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు