కళ్ళు మూసుకున్న బుద్ధుడు
కాళ్లతో నడవక తప్పలేదు.
ధ్యానంలో ఉన్న బుద్ధుడు
కలలు కనక తప్పలేదు.....!!?
విరిగిన మనుషులను
విరిగిన మనసులను -అతికిస్తున్నాడు.!
విరిగిన ఆకాశాలను
విరిగిన సముద్రాలను- కలుపుతున్నాడు.!!
భీకర శబ్దాన్ని
భీకర యుద్ధాన్ని
మౌనంగా మింగేస్తున్నాడు.!!!
భూమి పంచిన పచ్చని రక్తాన్ని
రణభూమి పంచిన పచ్చి రక్తాన్ని
చూసి
బుద్ధుడు శాంతి కోసం
బిచ్చమెత్తుతున్నాడు.......!!?
గాలి శ్వాసిస్తుంది
నది ప్రవహిస్తుంది
అగ్ని రగులుతుంది
భూమి తగలబడుతుంది.
ఇప్పుడిప్పుడే
ఆకాశం మేఘావృతమై నల్లబడ్డది
సముద్రం
భీకర తుఫాను హెచ్చరిక జారీ చేసింది.
బుద్ధుడు కళ్ళు మూసుకుని
నడుస్తున్నాడు.
ప్రపంచం ధ్యానం కోసం కాదు
ధనం కోసం ధ్యానం చేస్తోంది
అలోక
శాంతి కోసం నడుస్తోంది......!!
అమెరికాలో అలోక పీస్ వాక్ స్ఫూర్తితో.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి