తమిళంలో ఖురాన్: -- యామిజాల జగదీశ్


 సుప్రసిద్ధ తమిళ కవి కన్నదాసన్ చిరునవ్వుతో ఆ పవిత్ర గ్రంథాన్ని చదువుతున్నారు. అది చదువుతున్న కొద్దీ ఆయనకు ఆనందాన్నిస్తోంది.
ఎంత అద్భుతమైన ఆలోచనలు! ఎన్ని అద్భుతమైన తత్వాలు! వావ్..! ఇది కేవలం ఒక మత గ్రంథం కాదు....ఈ ఖురాన్ సామాజిక జీవితం గురించి చెబుతోంది... ఇది ఆర్థిక శాస్త్రం గురించి చెబుతోంది... లాభాలలో ఎంత శాతం పేదలకు కేటాయించాలో కూడా చెబుతోంది... ఆస్తి పంపకం నుండి స్త్రీల హక్కుల వరకు ప్రతిదీ వివరిస్తోంది....
ముస్లింలు మాత్రమే కాకుండా ప్రజలందరూ ఈ ఖురాన్‌ను చదివి, అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అని అనుకుంటున్నారాయన.
మరుక్షణమే కన్నదాసన్ ఇలా ఆలోచించి, కాగితం, కలం తీసుకున్నారు....
ఈ ఖురాన్‌కు తన కవితా శైలిలో ఒక వివరణాత్మక వచనాన్ని రాస్తే ఎలా ఉంటుంది? అప్పుడు మరింత మంది దీనిని చదువుతారు కదా! ఎందరో దీని నుండి ప్రయోజనం పొందుతారు కదా!అనుకున్నారు.
కన్నదాసన్ తాను రాయవలసిన సినిమా పాటలన్నింటినీ పక్కన పెట్టి, అదే క్షణంలో ఖురాన్ కోసం వచనాన్ని రాయడం ప్రారంభించారు‌....
ఇంతలో‌ ఒక స్వరం వినిపించింది - "అస్సలు కుదరదు...నువ్వు రాయడం తగదు" అన్నదే ఆ స్వరం.
 కన్నదాసన్ పైకి చూశారు...
ఇస్లాం ప్రముఖులలో కొద్దిమంది మాత్రమే కన్నదాసన్‌ను వ్యతిరేకించారు..ఆయన దాన్ని అస్సలు ఊహించలేదు....
"అస్సలు కుదరదు. మద్యానికి బానిసైన వ్యక్తి ఖురాన్‌ పై రాయకూడదు." అంటూ కొందరు ఇస్లామిక్ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మాటలతో ఆయన మనస్సు బరువెక్కింది. ఓ నిట్టూర్పుతో కన్నదాసన్ తను రాస్తున్న కలాన్ని మూసేసారు.
ఆయనకు ఖురాన్‌లో చదివిన విషయాలు గుర్తుకు వచ్చాయి.
పైవారి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు...
ఖురాన్‌ను క్షుణ్ణంగా చదివిన కన్నదాసన్‌కి ఈ విషయం తేలికగా అర్థమైంది... రాయడం ఆపారు...అప్పటికే కన్నదాసన్ ఖురాన్ మొదటి అధ్యాయం కోసం ఒక కవితా వచనాన్ని రాసారు.
“అత్యంత దయగల, అత్యంత కరుణామయుడైన అల్లాను స్మరించుకుంటూ నేను ప్రారంభిస్తున్నాను....
ఓ అల్లా, లోకాల పోషకుడా, నీకే సర్వ స్తోత్రాలు...ఆయనే అత్యంత దయగలవాడు. అత్యంత ప్రేమగలవాడు; న్యాయానికి స్థిరమైన నాయకుడు. మేము నిన్నే ఆరాధిస్తాం. నీ సహాయాన్ని కోరుతున్నాం. మమ్మల్ని సరైన మార్గంలో నడిపించు.
నీ అనుగ్రహం పొందిన వారిని వారి మార్గంలో నడిపించు! నీ ఆగ్రహానికి గురైన వారిని, దారి తప్పిన వారిని, శత్రువును వదిలిపెట్టు!”
కన్నదాసన్ రచించిన ఈ సున్నితమైన తమిళ కవితను చదువుతుండగా, ‘ఒకవేళ కన్నదాసన్ ఖురాన్ మొత్తానికి ఇలాంటి సరళమైన తమిళ కవితను రాసి ఉంటే ఎంత అద్భుతంగా ఉండేది!’ అని అనుకోకుండా ఉండలేకపోయారు.
సరే.... దైవ సంకల్పం లేకుండా ఏదీ జరగదు…
వందల రకాల పక్షులు వస్తాయి...
లక్షల రకాల పువ్వులు వికసిస్తాయి…
నాట్యం చేయడానికి వచ్చేదంతా 
దేవుని బిడ్డలే..!
మనమందరం ఉత్సవాలు జరుపుకుందాం…
అల్లా నామాన్ని జపిద్దాం…
అల్లా పదాలను రాయడాన్ని ఇస్లామీయ పెద్దలు వ్యతిరేకించినప్పటికీ, ‘పావమన్నిప్పు’ అనే తమిళ సినిమాలో అల్లా నామాన్ని ప్రస్తావించే పాట రాశారు. ఆ పాట కేవలం ముస్లింల మనసుల్లోనే కాదు, ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని ఆక్రమించుకున్నారు కన్నదాసన్...
కన్నదాసన్‌కు అమర కీర్తిని ఇవ్వాలని దేవుడు ఎల్లప్పుడూ నిర్ణయించు కున్నాడు...
ఖురాన్ ఇలా చెబుతోంది....
"ఆయన ఒక మంచిని సృష్టించినప్పుడు, (దానిని ఎవరూ ఆపలేరు.) ఆయన సర్వశక్తిమంతుడు." 
అవును....
దేవుడే గొప్పవాడు....


కామెంట్‌లు